Begin typing your search above and press return to search.

డిఫెన్స్ లో విపక్షం...జగన్ స్ట్రాటజీ సక్సెస్

మొత్తానికి విపక్షంలో డిఫెన్స్ మూడ్ లోకి వెళ్ళేలా చేయడంలో వైసీపీ విజయం సాధించింది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   23 Oct 2023 12:34 PM GMT
డిఫెన్స్ లో విపక్షం...జగన్ స్ట్రాటజీ సక్సెస్
X

ఏపీలో విపక్షం టోటల్ గా డిఫెన్స్ మూడ్ లోకి వెళ్లిపోయింది. గత నెలన్నరగా చూస్తే ఎక్కడా పొలిటికల్ యాక్టివిటీ పెద్దగా కనిపించడంలేదు. సబ్జెక్ట్ మొత్తం చంద్రబాబు జైలు అరెస్ట్ వీటి మీదనే టీడీపీ పెట్టేసింది. అది పార్టీ సమస్య, ప్రజల సమస్య మాత్రం కాదు, అలా జనాలకు కనెక్షన్ తెగిపోయినట్లు అయింది.

మరో వైపు చూస్తే జనసేనలో కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఆ పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులు అని ఎపుడైతే ప్రకటించారో నాటి నుంచే జనసేన గ్రాఫ్ మెల్లగా తగ్గుతున్నట్లుగా కనిపిస్తోంది. మరో వైపు చూస్తే జనసేనలో మొదటి నుంచి ఉన్న నాయకులలో కొందరు రాజీనామాల బాట పడుతున్నారు. ఉన్న వారిలో అసంతృప్తి ఉంది. టికెట్లు దక్కుతాయా లేదా అన్న చర్చ కూడా సాగుతోంది.

ఇక టీడీపీలో లోకేష్ పెద్ద దిక్కుగా మారిపోతున్నారు. దాంతో సీనియర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారని టాక్. ఆయన పార్టీని ఎంతవరకు నడుపుతారో తెలియడం లేదు. చంద్రబాబు అరెస్ట్ తరువాత టీడీపీలో ముందుకు రావాల్సింది సీనియర్లు పార్టీ పెద్దలు, కానీ కుటుంబం ముందుకు వచ్చింది. సానుభూతి కోసం అలా చేశారని అనుకున్నా పార్టీని ముందు పెట్టకుండా బిగ్ మిస్టేక్ చేస్తున్నారని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీలో యాక్షన్ కమిటీ పేరుతో పద్నాలుగు మందిని నియమించారు. కానీ వారి సూచనలు సలహాల మేరకు పార్టీ నడుస్తున్న దాఖలాలు లేవు. ఒక వైపు భువనేశ్వరి, మరో వైపు నారా లోకేష్ ఇద్దరూ జనంలోకి తిరగడానికి ఫిక్స్ అయిపోయారు. ఇక చంద్రబాబు జైలు నుంచి కొడుకు సతీమణికే సూచనలు ఇస్తున్నారు. మొత్తానికి టీడీపీలో బాబు లేని లోటు అయితే స్పష్టంగా కనిపిస్తోంది.

లోకేష్ నాయకత్వం మీద అయితే బాబు మాదిరిగా పూర్తి స్థాయిలో హోప్స్ పెట్టుకోవడానికి లేవని అంటున్నారు. దాంతో టీడీపీ రాజకీయం కీలక సమయంలో జోరు తగ్గిపోతోంది అని అంటున్నారు. జనసేన సైతం తన సొంత బలం పెంచుకుని ఆ మీదట ఎన్నికల వేళకు పొత్తులు పెట్టుకోవాలని చూసింది.

ఆ విధంగా చేస్తే జనసేన బలం పెరిగి పార్టీకి ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే పరిస్థితి ఉంటుందని కూడా భావించారు. కానీ సడెన్ గా బాబు అరెస్ట్ నేపధ్యంలో పొత్తు ప్రకటన జనసేన చేయాల్సి వచ్చింది. ఇది వైసీపీకే లాభం కలిగించేలా ఉందని అంటున్నారు. వేరు వేరుగా రెండు పార్టీలు జనంలోకి వెళ్తే వచ్చే ఊపు వేరు. ఇపుడు పొత్తులు అనడంతో జనసేనలో హుషార్ తగ్గింది. టీడీపీలో కూడా సీట్ల విషయంలో అయోమయం ఏర్పడింది.

మొత్తానికి విపక్షంలో డిఫెన్స్ మూడ్ లోకి వెళ్ళేలా చేయడంలో వైసీపీ విజయం సాధించింది అని అంటున్నారు. సెప్టెంబర్ 10 ముందు వరకూ ఏపీ పరిస్థితి వేరు, ఇపుడు చూస్తే ఏపీలో విపక్షం సౌండ్ తగ్గుతోంది. అధికార పక్షం సామాజిక బస్సు యాత్ర అంటూ వరసబెట్టి కార్యక్రమాలను ప్రకటిస్తోంది. చూడాలి మరి లోకేష్ పవన్ నాయకత్వంలో జాన్సేన టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ ఎంతమేరకు ముందుకు సాగుతాయో. ఏది ఏమైనా ప్రతిపక్షం అచేతనంగా మిగులుతున్న చోట వైసీపీ కొత్త వ్యూహాలతో ముందుకు రావడం అంటే రాజకీయం అంటే ఇదే కదా అని అనిపించక మానదు.