మైదుకూరుపై జగన్ స్పెషల్ ఫోకస్.. మారుతున్న ఈక్వేషన్లు ..!
ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా ఉమ్మడి కడప ఇప్పుడు రాజకీయంగా రగులుతోంది. కీలక నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది.
By: Tupaki Desk | 26 Jan 2024 3:53 AM GMTఏపీ సీఎం జగన్ సొంత జిల్లా ఉమ్మడి కడప ఇప్పుడు రాజకీయంగా రగులుతోంది. కీలక నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా మైదుకూరు నియోజకవర్గం సెంటరాఫ్‌ది టాపిక్‌గా మారిపోయింది. దీనికి కారణం.. ప్రస్తుతం మైదుకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శెట్టిపల్లి రఘునాథరెడ్డి. ఈ నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువగా ఉండడం, ఆయన వీరిని పట్టించుకోకపోవడంతో కొన్నాళ్లుగా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
అదేసమయంలో సొంత సామాజిక వర్గం నుంచి కూడా రఘునాథరెడ్డికి సెగ తగులుతోంది. పనులు చేయడం లేదని.. గత ఎన్నికల సమయంలో జెండాలు మోసి.. గెలుపు కోసం పనిచేసిన తమను కనీసం పట్టించుకోవడం లేదని రెడ్డి సామాజికవర్గం రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు.. అటు బలిజ, ఇటు రెడ్డి వర్గం నుంచి శెట్టిపల్లిపై వ్యతిరేకత పెరుగుతున్నట్టు పార్టీ ఒక అంచనాకు వచ్చింది. దీనికితోడు శెట్టిపల్లి అనుచరులు జడ్పిటిసి గోవిందరెడ్డి, ఎంపీపీ వీరనారాయణరెడ్డిల వ్యవహార శైలి కూడా పార్టీకి చేటు తెస్తోందనే వాదన ఉంది.
దీంతో ఈ పరిణామాలు.. ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉందని వైసీపీ ఒక అంచనాకు వచ్చింది. దీంతో ఇప్పుడు వైసీపీ అధిష్టానం చూపు బలిజ సామాజిక వర్గంపై ఉందని తెలుస్తోంది. ఈ వర్గానికి పెద్దపీట వేయడం ద్వారా మరోసారి వరుస విజయాలు దక్కించుకోవాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన సింగసాని గురు మోహన్ కు ఈ దఫా వైసీపీ టికెట్ దక్కే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది.
ఈయనను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడితే ఎలా ఉంటుందనే విషయంపై నేరుగా సీఎం జగన్ వివిధ రూపాల్లో సర్వేలు చేయిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో దాదాపు అన్ని సర్వేలు సింగసానికి అనుకూలంగా వచ్చినట్టు చెబుతున్నారు. దీంతో ముఖ్యమంత్రికి సన్నిహితుడు.. పార్టీ విధేయుడిగా పేరు తెచ్చుకున్న సింగసానిని బరిలో దింపితే బాగుంటుందన్నదిశగా వైసీపీ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.