వివేకా హత్య కేసు : జగన్ వ్యూహాత్మకంగా ముగింపు ...!?
ఇక తన చెల్లెళ్ళు రాజకీయ తపనతోనే బాబు వైపు నడుస్తున్నారు అని కూడా జగన్ అన్నారు.
By: Tupaki Desk | 29 March 2024 4:11 AM GMTవైఎస్ వివేకా హత్య కేసులో చాలా కాలానికి జగన్ పెదవి విప్పారు. అది కూడా తన సొంత జిల్లా కడపలోని ప్రొద్దుటూరు సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. హత్య చేసిన వారితోనే టీడీపీ దోస్తీ చేస్తూ వారికి మద్దతుగా నిలుస్తోందని ఆయన ఆరోపించారు. ఇక తన చెల్లెళ్ళు రాజకీయ తపనతోనే బాబు వైపు నడుస్తున్నారు అని కూడా జగన్ అన్నారు.
వివేకా హత్యను చేసిన వారు బయట ఉన్నారని జగన్ అన్నారు. ఎవరు చేశారు ఎవరు చేయించారు అన్నది దేవుడికి కడప ప్రజలకు తెలుసు అని ఆయన చెప్పారు. ఇక తాను ఎరిగి మరచీ తప్పు చేయను అని కడప ప్రజల సాక్షిగా జగన్ పెద్ద ఒట్టు వేశారు. అదే టైం లో ఆయన ధర్మం న్యాయం అన్న వాటిని తాను నమ్ముతాను అని కూడా చెప్పారు.
ఇదంతా జగన్ ఎందుకు చెప్పారా అని అంతా అనుకున్నారు. ఎన్నికలు వచ్చాయి. ప్రజల వద్దకు వెళ్ళి తీర్పు కోరాల్సి ఉంది. తన సొంత చిన్నాన్న దారుణ హత్య విషయంలో అసలు విషయాలు ఏమిటి అన్నది ప్రజలకు కూడా ఆసక్తికరంగానే ఉంది. అది మిస్టరీ గా మారిపోయింది. దాంతో పాటు విపక్షాలు అన్నీ జగన్ మీద విమర్శలు చేస్తున్నాయి.
అందుకే జగన్ పెదవి విప్పాల్సి వచ్చింది అని అంటున్నారు. అది కూడా కడప గడ్డ మీదనే ఆయన మాట్లాడారు. ఆ తరువాత జరిగిన నంద్యాల సభలో ఆయన ఆ ప్రస్తావనే చేయలేదు. ఇక మీదట ఆయన మాట్లాడుతారు అని అనుకోవడానికి కూడా లేదు. జగన్ కడప ప్రజలకు ఆ విధంగా ఏపీ ప్రజలకు కూడా తన మనసులో మాటను చెప్పేశారు అన్న మాట.
ఇక అది అంతటితో సరి అన్నది ఆయన భావన కావచ్చు. అయితే ఆయన ఈ మాటలు అన్న ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే వివేకా సొంత కుమార్తె సునీత జగన్ మీద విరుచుకుపడ్డారు సానుభూతి కోసం చిన్నాన్న పేరుని వాడుకుంటున్నారు అని ఆమె అన్నారు. హత్య చేసిన వారు దొరికినా సూత్రధారులు దొరకాలి కదా అని ఆమె లాజిక్ పాయింట్ తీశారు. జగన్ పక్కన ఉన్న వారే సూత్రధారులు అని హత్య చేసిన దస్తగిరి చెప్పారు కదా వారిని ఎందుకు రక్షిస్తున్నారు అని ఆమె మరో ప్రశ్న వేశారు
జగన్ అయిదేళ్ల పాలనలో అసలు నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయారు అన్నది కూడా ఆమె వేసిన మరో ప్రశ్న. వీటి మీద జగన్ తో చర్చకు తాను సిద్ధం అని ఆమె అంటున్నారు. ఇదే విషయం మీద చంద్రబాబు కూడా చెల్లెళ్ళ ప్రశ్నలకు జగన్ జవాబు చెప్పాలని రెట్టిస్తున్నారు. ఆ విధంగా వివేకా హత్య ఇష్యూని ఎన్నికల్లో కీలకం చేయాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు.
అయితే వివేకా హత్య కేసు ఈసారి ఎన్నికల్లో ఎంత మేరకు ఇష్యూ అవుతుంది అన్నది చూడాలి. దాని కంటే ముందు చాలా అంశాలు ఉన్నాయి. వాటికే జనాలు ప్రాధాన్యత ఇస్తారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే జగన్ ని కుటుంబ పరంగా ఆయన తల్లి సమర్ధిస్తున్నారు. దీవించి ఎన్నికల ప్రచారానికి పంపిస్తున్నారు. వైఎస్సార్ చెల్లెళ్ళు కూడా జగన్ పక్షమే ఉన్నారు. మొత్తం వైఎస్సార్ ఫ్యామిలీలో ఏడు వందల యాభై మందికి పైగా సభ్యులు ఉంటే ఒకరిద్దరు తప్ప అంతా జగన్ వెంటే ఉన్నారని అంటున్నారు.
ఇది నైతికంగా కుటుంబం నుంచి దక్కిన మద్దతు అయితే రాజకీయంగా కడప జిల్లాలో ఈ రోజుకూ వైసీపీ బలంగా ఉంది. ఆ పార్టీని ఢీ కొట్టే స్థితిలో టీడీపీ లేదు పైగా వివేకా హత్య కేసు చర్చ అన్నీ 2019లోనే ఎన్నికల ప్రచారంగా జరిగిపోయాయి. ఈసారి దానికి అంత ప్రాముఖ్యత లేదనే అంటున్నారు వైసీపీ నేతలు. మరి జగన్ ఈ అంశం ఎందుకు ఎత్తారు అంటే తన గురించి జనాలకు గట్టిగా ఒకసారి చెప్పుకోవడానికే తప్ప ఎవరికో సంజాయిషీ ఇవ్వడానికి కాదు అనే అంటున్నారు.
వివేకా హత్య కేసులో సూత్రధారులు ఎవరో దర్యాప్తు సంస్థలు చెప్పాలి. పాత్రధారి బెయిల్ మీద ఉన్నారు. ఆయనకు ఎల్లో మీడియా మద్దతు ఉంది అన్నది వైసీపీ నేతల విమర్శలు. ఏది ఏమైనా వివేకా హత్య కేసులో ఇప్పటిదాక టీడీపీ చంద్రబాబు అలాగే సునీత వంటి వారు చేస్తున్న విమర్శలకు ఒక్క సభతో ఒకేసారి జగన్ జవాబు చెప్పారని అంటున్నారు. అంతకు మించి ఆయన మాట్లాడేది లేదు. ఇక ఆయన దీని మీద పెదవి విప్పరు అనే అంటున్నారు. సో ఈ విషయంలో వైసీపీ వ్యూహాత్మకంగా ముగింపు పలికింది అన్న మాట.