Begin typing your search above and press return to search.

వైసీపీకి విశాఖ సవాల్..జగన్ ఏం చేయబోతున్నారు ?

విశాఖలో వైసీపీకి తొలి రాజకీయ సవాల్ ఎదురవుతోంది. వైసీపీ అధినేత జగన్ ఎంతగానో అభిమానించిన సిటీ విశాఖ

By:  Tupaki Desk   |   1 Aug 2024 3:47 AM GMT
వైసీపీకి విశాఖ సవాల్..జగన్ ఏం చేయబోతున్నారు ?
X

విశాఖలో వైసీపీకి తొలి రాజకీయ సవాల్ ఎదురవుతోంది. వైసీపీ అధినేత జగన్ ఎంతగానో అభిమానించిన సిటీ విశాఖ. అలాంటి విశాఖలో వైసీపీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా దెబ్బతింది. ఒక్క సీటు కూడా గెలుచుకో లేకపోయింది. పూర్తిగా చతికిలపడింది.

అయినా స్థానిక సంస్థలలో వైసీపీ జెండా బాగానే ఎగురుతోంది. మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ పదవి వైసీపీకి చెందిన హరి వెంకట కుమారి నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా వైసీపీకి చెందిన సుభద్ర ఉన్నారు.

దీంతో పాటుగా మండల పరిషత్తులు మునిసిపాలిటీలు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. అయితే వైసీపీ దిగిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పక్క చూపులు చూస్తున్నారు. ఇందులో అనేక మంది టీడీపీ జనసేనలలో చేరిపోయారు.

ఇదిలా ఉంటే విశాఖ కార్పోరేషన్ లో వైసీపీకి 58 మంది కార్పోరేటర్ల బలం ఉంటే అందులో నుంచి 12 మంది కార్పోరేటర్లు కూటమి వైపు వెళ్లిపోయారు. మరి కొంతమంది జనసేన బాట పట్టారు. దాంతో జీవీఎంసీలో వైసీపీకి 40 మంది దాకా కార్పోరేటర్ల బలం ఉంది.

స్థాయీ సంఘం ఎన్నికలు ఆగస్ట్ 7న జరగనున్నాయి. ఇప్పటికి మూడేళ్ళుగా జరిగిన స్థాయీ సంఘం ఎన్నికల్లో పదికి పది చైర్మన్ పదవులను వైసీపీయే గెలుచుకుంటూ వచ్చింది. కానీ ఫస్ట్ టైం కూటమి నుంచి గట్టి పోటీ ఎదురవౌతోంది. మొత్తం 24 నామినేషన్లు స్టాండింగ్ కమిటీ పదవులకు పడ్డాయి. అంటే పోటీ తారస్థాయిలో ఉందని అంటున్నారు.

ఈ నేపధ్యంలో స్థాయీ సంఘం ఎన్నికలో వైసీపీని గెలిపించుకఒవడానికి ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఏకంగా వైసీపీ అధినేత జగన్ ఈ విషయంలో సీరియస్ గా ఫోకస్ పెట్టారు. తాడేపల్లికి రమ్మని కార్పోరేటర్లకు కబురు పెట్టారు. దాంతో రెండు బస్సులలో నలభైమంది దాకా కార్పోరేటర్లు బయల్దేరి వెళ్లారు.

స్థాయీ సంఘం ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది అనడానికి జగన్ నుంచి పిలుపు రావడమే సంకేతం అని అంటున్నారు వైసీపీ అధినాయకత్వం ఏ విధంగా డైరెక్షన్ ఇస్తుంది. ఏ విధంగా గెలిపించుకుంటుంది అన్నది చూడాలి. కనీసం మెజారిటీ స్థాయీ సంఘం పదవులు అయినా వైసీపీకి దక్కకపోతే రాజకీయంగా ఇబ్బందే అని అంటున్నారు. అంతే కాదు మేయర్ సీటు మీదనే గురి పెట్టిన టీడీపీ కూటమికి స్థాయీ సంఘం ఎన్నికలలోనే దెబ్బ తీస్తేనే వైసీపీకి జీవీఎంసీలో పట్టు దొరుకుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.