ఢిల్లీలో జగన్ అనుసరించే వ్యూహం ఇదే!?
ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం భారీ ఓటమి చవి చూసిన వైసీపీ నేతలు ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నారని అంటున్నారు.
By: Tupaki Desk | 14 Jun 2024 7:48 AM GMTఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం భారీ ఓటమి చవి చూసిన వైసీపీ నేతలు ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలపై తీవ్ర విషాదంగా స్పందించిన జగన్ సైతం తేరుకుని.. వరుస సమీక్షని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ వరుసగా భేటీలు నిర్వహించారు.
ఈ సమయంలో లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతో జగన్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారని తెలుస్తుంది. వాస్తవానికి ఏపీ అసెంబ్లీలో వైసీపీకి బలం లేకపోయినప్పటికీ... శాసనమండలిలో భారీ మెజారిటీ ఉన్న సంగతి తెలిసిందే. ఆ అవకాశాన్ని కచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రలోభాలకు లొంగొద్దని సూచిస్తున్నారు.
అదేవిధంగా రాజ్యసభలో టీడీపీకి ఒక్క ఎంపీకూడా లేని పరిస్థితి. వైసీపీ మాత్రం 11 ఎంపీలతో బలమైన పార్టీగా రాజ్యసభలో ఉంది. మరోపక్క లోక్ సభ లోనూ 4గురు ఎంపీలను ఆ పార్టీ కలిగి ఉంది. మొత్తంగా పార్లమెంట్ ఉభయ సభల్లోనూ వైసీపీ 15 మంది ఎంపీలను కలిగి ఉంది. కాగా.. టీడీపీ లోక్ సభలో మాత్రమే 16 మంది ఎంపీల మెజారిటీ కలిగి ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ బలంపై ఆ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి క్లారిటీ ఇచ్చారు. విధానాల వారిగా కేంద్రంలో బీజేపీకి తమ మద్దతు ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో కేంద్రంలో నెంబర్ గేం చాలా కీలకంగా మారిన నేపథ్యంలో... బీజేపీతో ఉన్నంతలో సఖ్యతగానే ముందుకు పోవాలని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. 2019-24 మధ్యకాలంలో బీజేపీకి మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తుచేస్తున్నారని తెలుస్తుంది!
ఆ సమయంలో వారితో ఉన్న అనుబంధం మేరకు.. బీజేపీ నాయకత్వంపై జగన్ కు పూర్తి అవగాహన ఉందని అంటున్నారు. పైగా జగన్ పై మోడీకి పాజిటివ్ అభిప్రాయం ఉందని.. ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీతో సమయానుకూలంగా వ్యవహరించాలని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. ఇదే విషయాన్ని తన పార్టీ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతో జగన్ చర్చించనున్నారని సమాచారం!
దీంతో... ఏపీలో టీడీపీ బలంగా ఉన్నప్పటికీ, ఎన్డీయే కూటమిలో కీలకంగా ఉన్నప్పటికీ.. వైసీపీకి బీజేపీతో వచ్చే నష్టం కానీ, ఇబ్బందులు కానీ ఉండకపోవచ్చని అంటున్నారు పరిశీలకులు. మరి జగన్ వ్యూహాలు ఇంకెలా ఉండబోతున్నాయి.. జగన్ విషయంలో మోడీ ఆలోచనలు ఎలా ఉండనున్నాయనేది వేచి చూడాలి!