Begin typing your search above and press return to search.

మంత్రి రోజా కోసం రంగంలోకి జగన్... అయినా చేతులు కలవలేదా...?

వైసీపీకి చెందిన మునిసిపల్ చైర్ పర్సన్ కేజే శాంతి చేతిని మంత్రి రోజా చేతిని పట్టుకుని ముఖ్యమంత్రి స్వయంగా కలిపేందుకు ప్రయత్నించారు.

By:  Tupaki Desk   |   28 Aug 2023 12:50 PM GMT
మంత్రి రోజా కోసం రంగంలోకి జగన్... అయినా చేతులు కలవలేదా...?
X

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా నగరి పర్యటనలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. నగరిలో మంత్రి రోజాకు వ్యతిరేకంగా అయిదు మండలాల నుంచి అసమ్మతి నేతలు సొంత పార్టీలోనే ఉన్నారు. వారంతా చేరి ఆమెకి టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని కుండబద్ధలు కొడుతున్నారు. ఈ నేపధ్యంలో అనేక దఫాలుగా అసమ్మతి నేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు మార్లు మాట్లాడారు, వారిని అమరావతి పిలిపించి మరీ భేటీ వేశారు.

గత ఏడాది జగన్ బ్రహ్మోత్సవాల సందర్భంలో తిరుపతి వచ్చినపుడు కూడా అసమ్మతి లేకుండా అంతా తనకోసం పనిచేయాలని కోరారు అయితే ఆ చర్చలు అన్నీ కూడా పెద్దగా ఫలించలేదు. ఇపుడు ఏకంగా ముఖ్యమంత్రి నగరిలో సభా వేదిక వద్దనే అసమ్మతి నేతలకు మంత్రి రోజాకు మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు.

వైసీపీకి చెందిన మునిసిపల్ చైర్ పర్సన్ కేజే శాంతి చేతిని మంత్రి రోజా చేతిని పట్టుకుని ముఖ్యమంత్రి స్వయంగా కలిపేందుకు ప్రయత్నించారు. అయితే చేతులు కలిపేందుకు అయిష్టంగానే ఈ ఇద్దరు మహిళా నేతలు ముందుకు రావడం విశేష. ఈ ఇద్దరూ ముఖ్యమంత్రికి చెరో వైపునా ఉన్నారు. ముఖ్యమంత్రి అయితే వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

ఇక రోజాకు నగరిలో పెద్ద ఎత్తున సొంత పార్టీలోనే అసమ్మతి ఉంది. మొత్తం అయిదు మండలాలలో నేతలు అంతా ఆమె వద్దు అంటున్నారు. జగన్ మాకు ముద్దు అని కూడా చెబుతున్నారు. ఈసారి రోజాకు టికెట్ ఇస్తే తాము అసలు కలసి పనిచేసేది లేదని తేల్చేస్తున్నారు. రోజా తమను పట్టించుకోవడం లేదని, రెండు సార్లు తాము కష్టపడి ఆమెని గెలిపిస్తే మాత్రం మంత్రి మాత్రం తమను పక్కన పెట్టడమేంటని వారు గుస్సా అవుతున్నారు.

ఈసారి ఎన్నికల్లో తమ అయిదు మండలాలోని ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేసి వైసీపీని గెలిపిస్తామని, అదే సమయంలో రోజాకు టికెట్ ఇస్తే తమను గెలుపు గురించి అడగవద్దు అని వారు అంటున్నారు. ఇక మునిసిపల్ చైర్మన్ కేజే శాంతి భర్త ఈడెగ కార్పోరేషన్ చైర్మన్ కే ఏ కుమార్ కూడా రోజాకు యాంటీగా ఉన్నారు. అదే విధంగా శ్రీశైలం దేవస్థానం చైర్మన్ అయిన రెడ్డివారి చక్రపాణి రెడ్డి సైతం రోజా పట్ల గుస్సాగా ఉన్నారు.

వీరంతా వైసీపీ అధినాయకత్వాన్ని కోరేది ఏంటి అంటే రోజా తప్ప తమకు ఎవరైనా ఇష్టమే అని. ఆమెను రెండు చాన్సులు ఇచ్చారని, ప్రజలలో కూడా ఆమె పట్ల వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉందని అంటున్నారు. అందువల్ల ఆమెను తప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో జగన్ స్వయంగా జోక్యం చేసుకుని చేతులు కలిపినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదని అంటున్నారు. దానికి కారణం రోజా వైఖరి కూడా అని అంటున్నారు. ఆమె రాజకీయంగా ఉండాల్సిన లౌక్యంతో పాటు వ్యూహాలతో ముందుకు సాగడంలేదు అని అంటున్నారు. పార్టీని బలోపేతం చేసుకోవడం స్థానిక నాయకులను పట్టించుకోవడం చేసి ఉంటే ఇంతదాకా పరిస్థితి వచ్చి ఉండేది కాదని అంటున్నారు.

ఇదిలా ఉండగా రోజా నగరి సభా వేదిక మీదనే ముఖ్యమంత్రి జగన్ కి రాఖీ కట్టింది. తనకు రక్షణగా నిలవాలని ఆమె కోరారు మరి సీఎం కి రోజా పట్ల సాఫ్ట్ కార్నర్ ఉన్నా ఆమె పట్ల సొంత పార్టీ నేతలు అంతా యంటీగా ఉంటే ఆయన మాత్రం ఏమి చేస్తారు అన్న చర్చ వస్తోంది.

సీఎం జగన్ కూడా బాహాటంగానే ప్రయత్నం చేశారు. మరి ఇది ఫలించే అవకాశాలు అయితే పెద్దగా లేవని అంటున్నారు మరో వైపు చూస్తే నగరిలో రోజా పనితీరు పట్ల కూడా వ్యతిరకత ఉందని నివేదికలు వస్తున్న నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

ఇక మునిసిపల్ చైర్మన్ కేజే శాంతి రోజాకు పోటీ మహిళా కోటాలో టికెట్ కోసం ట్రై చేస్తున్నారు అంటున్నారు. ఆమె బీసీ నేత కూడా కావడం కలసి వచ్చే అంశం అంటున్నారు. ఇక రెడ్డి కోటాలో టికెట్ ఇవ్వాలనుకుంటే బలమైన నేతగా రెడ్డివరి చక్రపాణి రెడ్డి ఉన్నారని అంటున్నారు. మొత్తానికి చూస్తే నగరి పర్యటన తరువాత రోజాకు టికెట్ ఇచ్చే అవకాశాలు తగ్గిపోయాయా అన్నదే చర్చకు వస్తోంది.