ప్రమాణస్వీకారవేళ.. జగన్ దారెటు?
ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరటం తెలిసిందే.
By: Tupaki Desk | 21 Jun 2024 4:11 AM GMTఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరటం తెలిసిందే. ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు షురూ కానున్నాయి. చట్టబద్ధంగా ఎన్నికైన శాసన సభ్యులు తమ పదవీ ప్రమాణస్వీకారాన్ని చేపట్టాల్సి ఉంటుంది. దీనికి ఈ రోజు.. రేపు రెండు రోజుల పాటు చేపట్టేలా ఏపీ అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహించనున్నారు. శుక్రవారం జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం.. జనసేన.. వైసీపీ.. బీజేపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలందరూ ప్రమాణం చేయనున్నారు.
ఇందులో భాగంగా అసెంబ్లీలో తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. మంత్రులు.. మహిళా సభ్యులు.. సాధారణ సభ్యులు ప్రమాణం చేస్తారు. ప్రమాణం చేసే సభ్యుల ప్రాధాన్యత ఇలా ఉంటే.. సాధారణ సభ్యుల ప్రమాణం మాత్రం పేరులో మొదటి అక్షరం వరుస క్రమంలో ఉండనుంది. ప్రధాన ప్రతిపక్ష హోదాను వైసీపీ సొంతం చేసుకోని నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధారణ సభ్యుడిగానే ప్రమాణం చేయనున్నారు.
ఆంగ్ల అక్షరమాలలో ఆయన పేరు YS Jagan Mohan Reddy ఉన్ననేపథ్యంలో చివర్లోనే ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని చెబుతున్నారు. పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జగన్మోహన్ రెడ్డి సాధారణ సభ్యుడిగానే ప్రమాణం చేయనున్నారు. అయితే.. ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరవుతారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నాటి అధికార బీఆర్ఎస్ ఓటమిపాలు కావటం.. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించే వీలున్నా.. ఎమ్మెల్యే ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదు. అనుకోకుండా ఆయన బాత్రూంలో జారిపడటం.. గాయాలు పాలు కావటం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని ఆయన.. తర్వాతి రోజుల్లో స్పీకర్ వద్ద ఒక్కరిగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తాజాగా జగన్ ఎలా వ్యవహరిస్తారు? అన్నది ప్రశ్నగా మారింది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చూస్తే.. రెండు రోజుల పాటు సాగే అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ప్రమాణస్వీకార అవకాశం రేపు (శనివారం) మాత్రమే వచ్చే వీలుంది. అలాంటప్పుడు ఈ రోజు (శుక్రవారం) అసెంబ్లీకి వచ్చే వీలు లేదంటున్నారు. అయితే.. అందరి అంచనాలకు భిన్నంగా అసెంబ్లీకి హాజరు కావటం బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటమి వేళ.. వెనక్కి తగ్గకుండా.. ముఖం చాటేయకుండా.. కేసీఆర్ మాదిరి కాకుండా తనదైన ముద్రను వేస్తూ ఆయన అసెంబ్లీకి వస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం అవుతుందో చూడాలి.