పవన్ కు విరుగుడు.. సినీ రంగం నుంచి ముగ్గురికి జగన్ టికెట్లు!
కాగా టీడీపీ, జనసేన ఈసారి కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని ఎదుర్కోవడంపై జగన్ దృష్టి సారించారని టాక్ నడుస్తోంది.
By: Tupaki Desk | 16 Jan 2024 9:37 AM GMTఆంధ్రప్రదేశ్ లో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా సామాజికంగా, ఆర్థికంగా బలమైన అభ్యర్థులను అసెంబ్లీకి, పార్లమెంటు ఎన్నికలకు ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 50 అసెంబ్లీ, 9 లోక్ సభా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
జగన్ ఇప్పటికి మూడు విడతల్లో అభ్యర్థులను ప్రకటించారు. నాలుగో విడతలో మరికొందరు అభ్యర్థులను ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తారని టాక్ నడుస్తోంది. కాగా టీడీపీ, జనసేన ఈసారి కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని ఎదుర్కోవడంపై జగన్ దృష్టి సారించారని టాక్ నడుస్తోంది.
ముఖ్యంగా ఉభయగోదావరి, విశాఖ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పవన్ ప్రభావం ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కు విరుగుడుగా సినీ రంగం నుంచి ముగ్గురికి జగన్ సీట్లు ఇవ్వవచ్చనే ప్రచారం జరుగుతోంది.
ఈ ముగ్గురిలో ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్, దివంగత నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, ప్రముఖ సినీ నటుడు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీని బరిలోకి దింపుతారని టాక్ వినిపిస్తోంది.
ఇందులో భాగంగా వీవీ వినాయక్ ను కాపు సామాజికవర్గం బలంగా ఉన్న రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి బరిలోకి దించుతారని చెబుతున్నారు. వీవీ వినాయక్ కూడా కాపు సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం. అయితే వీవీ వినాయక్ మెగా క్యాంపునకు చెందిన వ్యక్తి. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. ఈ నేపథ్యంలో వీవీ వినాయక్.. చిరంజీవి సలహాను బట్టి పోటీపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
ఇక నరసాపురం పార్లమెంటరీ స్థానం నుంచి దివంగత నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పోటీ చేస్తారని అంటున్నారు. గత ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు పోటీ చేసి గెలుపొందారు. అయితే కొద్ది రోజులకే ఆ పార్టీతో విభేదించి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో శ్యామలాదేవిని బరిలోకి దించితే అటు క్షత్రియ సామాజికవర్గంతోపాటు హీరో ప్రభాస్ అభిమానులు వైసీపీకే జై కొడతారని జగన్ లెక్కలేసుకుంటున్నట్టు టాక్.
అలాగే సినీ రంగం నుంచి మూడో వ్యక్తిగా ప్రముఖ కమెడియన్ అలీకి కూడా చోటుందని అంటున్నారు. ఇప్పటికే ఆయన పేరు కర్నూలు, గుంటూరు, నంద్యాల ఎంపీ స్థానాలకు పరిశీలిస్తున్నారు. ఈ మూడింటిలో ఏదో ఒక స్థానం నుంచి అలీ పోటీ చేయడం ఖాయమంటున్నారు. ఇలా సినీ రంగం నుంచి ముగ్గురిని బరిలోకి దింపడం ద్వారా పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టాలని జగన్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.