Begin typing your search above and press return to search.

జనంలోకి జగన్...?

పొరుగున ఉన్న ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ఇప్పటికి ఇరవై నాలుగేళ్ల బట్టి సీఎం గా ఉన్నారు.

By:  Tupaki Desk   |   10 Jan 2024 4:01 AM GMT
జనంలోకి జగన్...?
X

జగన్ జనంలోకి రావడంలేదు అన్నది విపక్షాలు చేసే విమర్శ. జగన్ ముఖ్యమంత్రి అయి 55 నెలలు పై దాటింది. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పెద్దగా జనంలోకి రాలేదు. సీఎం అంటే జనంలో ఉండాలన్నది ఒక ట్రెండ్. అయితే జనంలో లేకపోయినా గెలవవచ్చు అన్నది మరో ట్రెండ్. పొరుగున ఉన్న ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ఇప్పటికి ఇరవై నాలుగేళ్ల బట్టి సీఎం గా ఉన్నారు.

ఆయన పబ్లిక్ మీటింగ్స్ పెద్దగా అటెండ్ చేయరు. కానీ పాలనలోనే తన మార్క్ చూపిస్తారు. అలాగే దేశంలో ఇంకా చాలా మంది సీఎంలు ఉన్నారు. అసలు తెలుగుదేశం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ సీఎంలు హైదరాబాద్ కదలి వచ్చేవారే కాదు.

ఎన్టీయార్ వచ్చి ఆ ట్రెండ్ ని బ్రేక్ చేశారు అయితే సీఎం అయ్యాక ఎన్టీయార్ కాంగ్రెస్ సీఎంల కంటే ఎక్కువగా తిరిగారు ఆయన్ని మించారు చంద్రబాబు ఆయన సీఎం గా ఉన్నా విపక్ష నేతగా ఉన్నా జనంలోనే ఉంటూ వచ్చారు. చంద్రబాబు ని చూసిన వారు జగన్ అలా చేస్తారు అని అనుకున్నారు. కానీ జగన్ స్టైల్ వేరుగా ఉంటూ వచ్చింది.

ఆయన వైఖరి వేరు అని తరువాత కాలంలో అర్ధం అయింది. ఇక ఏపీలో గత నాలుగున్నరేళ్లలో ఉప ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అయితే ఏ ఒక్క దానికీ జగన్ రాలేదు ప్రచారం చేయలేదు. కానీ అన్నింటా వైసీపీ గెలిచింది. కానీ ఇపుడు చూస్తే సార్వత్రిక ఎన్నికలు ముందు ఉన్నాయి. పైగా పాతిక ఎంపీ సీట్లకు 175 ఎమ్మెల్యే సీట్లకు ఎన్నికలు అంటే రాజకీయ పార్టీల అధినాయకత్వాలు ఏపీ అంతా కలియ తిరగాల్సిందే అని అంటున్నారు

ఏపీలో విపక్షాలు అయితే చాలా కాలంగానే జనంలో ఉంటూ వస్తున్నాయి. చంద్రబాబు 2024 వస్తూనే జనవరి నెల అంతా వరస మీటింగ్స్ తో సైకిల్ ని జోరెత్తిస్తున్నారు. ఇక మిత్రపక్షం జనసేన ఎటూ ఉంది. ఈ నేపధ్యంలో వైసీపీ నుంచి ప్రచారం మొదలెట్టాలి అని వినిపిస్తోంది.

జగన్ అభ్యర్ధుల ఎంపికలో బిజీగా ఉన్నారు. అన్నీ పూర్తి చేసుకుని టోటల్ జాబితాను ఒకేసారి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఆ మీదట జగన్ ఎన్నికల ప్రచారానికి వస్తారు అని అంటున్నారు రానున్న కాలమంతా ఆయన జనంలోనే ఉంటారు అని కూడా అంటున్నారు.

మరో వైపు ఎన్నికల వేళ దాకా జగన్ ప్రచారం చేయరు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ తరువాత కొన్ని బహిరంగ సభలలో జగన్ పాల్గొంటారు అని కూడా అంటున్నారు. ఏపీలో ఈసారి హోరా హోరీగా ఎన్నికలు జరుగుతున్న వేళ జగన్ పూర్తి స్థాయిలో ప్రచారం చేయాల్సి ఉందని ఒక అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ప్రజలకు వైసీపీ ఏంటో తెలుసు. ఆ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కళ్ళ ముందు ఉన్నాయి.

రేపటి రోజున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం చేసుకుంటే విజయం తధ్యం అన్న భావనను మరో వైపు వ్యక్తం చేసేవారు ఉన్నారు. జగన్ పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారా లేదా అన్నది మాత్రం ఇపుడు హాట్ హాట్ చర్చగా ఉంది.

జగన్ వైసీపీ అధినేత మాత్రమే కాదు, ఆయన ముఖ్యమంత్రి కూడా. అటు పాలనా బాధ్యతలు కూడా ఉంటాయి. అందువల్ల జగన్ అన్నీ కో ఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంది. మరి జనంలోకి జగన్ ఎపుడు వస్తారు ఎలా వస్తారు ఏ రకమైన యాక్షన్ ప్లాన్ తో వస్తారు అన్నది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది అని అంటున్నారు.