భీమవరంలో జగన్ ఏం చేయబోతున్నాడు ?
దీనికి ప్రధానకారణం ఇక్కడ గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసి ఓడిపోవడమే.
By: Tupaki Desk | 16 April 2024 5:17 AM GMTముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సుయాత్ర 16వ రోజుకు చేరుకుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి, భీమవరం నియోజకవర్గాల్లో ఈ రోజు బస్సు యాత్ర కొనసాగనున్నది. నారాయణపురం క్యాంపు నుండి బయలుదేరి మధ్యాహ్నం 3.30 గంటలకు భీమవరం బైపాస్ రోడ్ గ్రంధి వెంకటేశ్వర రావు జూనియర్ కాలేజ్ దగ్గర బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. అనంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారుకి చేరుకొని.. రాత్రికి అక్కడ బసచేస్తారు. అయితే జగన్ భీమవరం సభ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
దీనికి ప్రధానకారణం ఇక్కడ గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసి ఓడిపోవడమే. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ ఎనిమిది వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు. ఈ సారి ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులును జనసేన నుంచి పోటీకి దించారు. ఇక్కడ ఈసారి ఖచ్చితంగా విజయం సాధించాలన్న పట్టుదలతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు.
కుబేరులు ఉండే భీమవరం రౌడీల చేతుల్లో బందీ అయిందని, ఈ సారి ఎన్నికల్లో ఓడించి జగన్ కు బుద్దిచెబుదాం అని ఇటీవల పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ కు ఎలాంటి కౌంటర్ ఇస్తారు అని సర్వత్రా ఉత్కంఠ వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రాలో అధికారంలోకి ఏ పార్టీ రావాలో ఉమ్మడి ఉభయ గోదావరి, గుంటూరు, క్రిష్ణా జిల్లాలే డిసైడ్ చేస్తాయి. ఈ జిల్లాలలో అధికస్థానాలు సాధించిన పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. అందుకే ఇక్కడ గెలుపుకు జగన్ వ్యూహం ఏంటన్నది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. గతంలో తాను ఓడిన స్థానంలో తన అభ్యర్థిని గెలిపించుకోవడం కూడా పవన్ కళ్యాణ్ కు ప్రతిష్టాత్మకం అయిన నేపథ్యంలో అందరూ భీమవరం వైపు చూస్తున్నారు.