వైఎస్సార్ కు జగన్ ఘన నివాళి... ట్వీట్ వైరల్!
దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఈ రోజు
By: Tupaki Desk | 8 July 2024 4:09 AMదివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్, భారతి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా.. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.
అవును... నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కావడంతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు ఆ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా... తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
ఈ క్రమంలో... రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆసుపత్రుల్లోని రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం, అన్నదానం వంటి కార్యక్రమాలు భారీ ఎత్తున ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు వైసీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ చేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది.
"నాన్నా... మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం" అని అన్నారు.
ఇదే సమయంలో... "జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా... చివరివరకూ మా కృషి." అని ట్వీట్ చేశారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
ఈ సందర్భంగా... "తెలుగు నేలపై సంక్షేమ పునాదులు నిర్మించి ప్రజల గుండెల్లో చెదరని జ్ఞాపకంగా నిలిచిపోయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా నివాళులు" అంటూ వైసీపీ సోషల్ మీడియాలో హోరెత్తించేస్తున్నారు!!