జగన్.. భద్రత-అభద్రత.. అసలు ఏం జరిగింది?
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ భద్రతకు సంబంధించి ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 20 July 2024 4:50 AM GMTవైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ భద్రతకు సంబంధించి ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఆయన తాడేపల్లి నుంచి వినుకొండ వరకు(సుమారు 35 కిలో మీటర్లు) ఆయన కారులో ప్రయాణించి.. రెండు రోజుల కిందట దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా తనకు భద్రత విషయంలో పోలీసులు సరిగా వ్యవహరించలేదని జగన్ చెప్పినట్టు వైసీపీనాయకులు ఆరోపించారు. జగన్ పర్యటనలో బుల్లెట్ ప్రూఫ్ కారుకు బదులుగా.. వేరే కారును ఇచ్చారని.. అది కూడా రిపేర్‌లో ఉందని.. మాజీ సీఎంను ఇలా అవమానిస్తారా? అని కూడా ప్రశ్నించారు.
దీనిపై పోలీసులు, ప్రభుత్వం కూడా స్పందించాయి. జగన్ పర్యటనలో ఎలాంటి అభద్రతకు అవకాశం లేకుండా వ్యవహరించినట్టు పోలీసులు తెలిపారు. కండిషన్‌లో లేని వాహనాలు ఇచ్చారన్న విమర్శలను వారు తోసిపుచ్చారు. భద్రత తగ్గించారనే ప్రచారా న్ని కూడా ఖండించారు. ప్రస్తుతం మాజీ సీఎం అయినప్పటికీ.. జగన్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు ఇచ్చే భద్రత విషయంలో రాజీ పడలేదని డీజీపీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక, వాహనం కండిషన్‌పై కూడా స్పందించింది. అన్నీ సరిచూసుకున్న తర్వాతే.. వాహనాలను కేటాయించినట్టు పేర్కొంది.
ఏది నిజం?
వైసీపీ అధినేత జగన్ వినుకొండ పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఆగిపోయిన మాట వాస్తవం. ప్రస్తుతం ఆయన వినియోగిస్తున్న అధికారిక వాహనాల్లో కొన్నింటిని ప్రభుత్వం తీసుకుంది. ఆయనకు ఉన్న ప్రజాప్రతినిదుల సంఖ్యను బట్టి.. ఆయనకు ఉన్న హోదా(ప్రస్తుతం ఎమ్మెల్యే, మాజీ సీఎం) ను బట్టి వాహనాలు కేటాయించారు. దీనిలో ఒక వాహనం కొన్నాళ్లుగా వినియోగించడం లేదు. దీంతో అది మొరాయించిన మాట వాస్తవమే. అయితే.. ఇంతలోనే వెనుకాల ఫాలో అయిన.. జగన్ సొంత వాహనంలో ఆయన ఎక్కి వినుకొండ చేరుకున్నారు. దీంతో వైసీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా.. రచ్చ చేశారు.
అయితే.. జగన్ వినుకొండ చేరుకునే సరికి.. మొరాయించిన ప్రభుత్వ వాహనం అక్కడకు చేరుకుంది. తిరుగు ప్రయాణంలోనూ జగన్ దానిలోనే ప్రయాణించి వచ్చారు. ఇదీ.. జరిగింది. అయితే.. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా తమ నాయకుడికి భద్రత కల్పించడంలో విఫలమైందంటూ.. వైసీపీనాయకులు విమర్శలు చేయడం..ఆ వెంటనే సర్కారు ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఏదేమైనా.. రాష్ట్రంలో చిత్రమైన రాజకీయం అయితే జరుగుతోంది. ఇది ఇప్పట్లో సరి అవుతుందా? అనేది సందేహమే.