మమ్మల్ని కొట్టేవారే లేరు అన్న జగన్...!
ఇడుపులపాయలో ఆయన ఈ రోజు వైసీపీకి సంబంధించి 175 మంది ఎమ్మెల్యే అభ్యర్ధులు అలాగే 24 ఎంపీ అభ్యర్ధుల జాబితాను రిలీజ్ చేశారు.
By: Tupaki Desk | 16 March 2024 9:04 AM GMTసామాజిక న్యాయం విషయంలో వైసీపీకి కొట్టేవారు ఎవరూ లేరని జగన్ వ్యాఖ్యానించారు. ఇడుపులపాయలో ఆయన ఈ రోజు వైసీపీకి సంబంధించి 175 మంది ఎమ్మెల్యే అభ్యర్ధులు అలాగే 24 ఎంపీ అభ్యర్ధుల జాబితాను రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ విషయంలో కూడా గత సంప్రదాయాన్నే కొనసాగించారు. బీసీ అయిన మంత్రి ధర్మాన ప్రసాదరావు అలాగే ఎస్సీ అయిన ఎంపీ నందిగం సురేష్ చేతుల మీదుగా జగన్ ఈ లిస్ట్ ని విడుదల చేయించారు.
అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ సామాజిక న్యాయం విషయంలో వైసీపీ ఏపీలో అన్ని పార్టీల కంటే ముందు ఉందని అన్నారు. మొత్తం 175 అసెంబ్లీ పాతిక ఎంపీ సీట్లు కలుపుకుని రెండు వందల స్థానాలు ఉంటే అందులో వంద దాకా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు కేటాయించామని ఇది సామాజిక విప్లవం అని అన్నారు. అదే విధంగా దాదాపుగా వంద సీట్లలో మార్పు చేర్పులు చేశామని ఇది కూడా ఎవరూ చేయలేని సాహసం అని అన్నారు.
సీటు రాని వారు ఏ విధంగానూ మనసులో పెట్టుకోవద్దని, వారికి పార్టీ అన్ని విధాలుగా న్యాయం చేస్తుంది అని జగన్ చెప్పారు. తమ పార్టీ ఎస్సీలకు 29, ఎస్టీలకు ఏడు, బీసీలకు 48, మైనారిటీలకు 7 సెఏట్లను కేటాయించిందని అయన గుర్తు చేశారు. అదే విధంగా మహిళలకు గతంలో 15 సీట్లు ఇస్తే ఈసారి ఆ సంఖ్యను 19కి పెంచామని పార్లమెంట్ కి కూడా కలుపుకుని 24 మందికి ఇచ్చామని జగన్ చెప్పారు. అయితే ఇది కూడా చాలదని వచ్చే ఎన్నికల్లో మరింత మంది మహిళలకు సీట్లు ఇస్తామని జగన్ చెప్పారు.
మొత్తం మీద చూస్తే పూర్తి ఆత్మవిశ్వాసంతో మరోసారి తామే గెలుస్తామన్న నమ్మకంతో జగన్ మొత్తం జాబితాను తయారు చేసినట్లుగా ఉంది. అందులో వంద స్థానాలలో ఎలాంటి మార్పు చేర్పులు చేయకపోవడం విశేషం.