విశాఖ రూట్ జగన్ కి బాగా లేట్....!
ఆ కమిటీ ఇచ్చే సూచనలు చేసే పరిష్కారాల బట్టి జగన్ విశాఖ రాక ఆధారపడి ఉందని ఇపుడు అర్ధం అవుతోంది.
By: Tupaki Desk | 14 Oct 2023 8:29 AM GMTముఖ్యమంత్రి జగన్ గత మూడున్నరేళ్ళుగా విశాఖ అంటూ ఎంతగా కలవరిస్తున్నా ఆయన అడుగులు మాత్రం ఎందుకో అంత దూకుడుగా పడలేకపోతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ లో ఆయన శ్రీకాకుళం సభలో మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటి అంటే జస్ట్ ఒక నాలుగు నెలల కాలంలో నేనూ విశాఖ వాసిని అవుతాను అని. సెప్టెంబర్ కల్లా విశాఖలో ఉంటాను అని. అయితే సెప్టెంబర్ శూన్య మాసం కావడంతో పాటు ఇతరరత్రా కారణాల వల్ల జగన్ విశాఖ రాక సాధ్యపడలేదు.
దాంతో ఆశ్వీయుజ మాసం, అన్నీ కలసి వచ్చే విజయాలను తెచ్చే విజయదశమి రోజున జగన్ విశాఖలో కాలు పెడతారు అని ఇటీవల కాలమో గట్టిగా వినిపించింది. దానికి తగినట్లుగా ప్రభుత్వం కూడా 2015 పేరుతో ఒక జీవోను విడుదల చేసింది. దాని ప్రకారం చూస్తే మంత్రులు అధికారులకు కీలక మంత్రిత్వ శాఖలకు నివాస భవనాల ఎంపిక కోసం కమిటీని ఏర్పాటు చేశారు.
ఆ కమిటీ ఇచ్చే సూచనలు చేసే పరిష్కారాల బట్టి జగన్ విశాఖ రాక ఆధారపడి ఉందని ఇపుడు అర్ధం అవుతోంది. దాని కంటే ముందు చూస్తే జగన్ విశాఖ నివాసం మార్చాలంటే ఆయన నివాస భవనాలు రెడీ కావాలి. రుషికొండ మీద పర్యాటక శాఖ భవనాలు నిర్మిస్తోంది. అయితే అవన్నీ దాదాపుగా తుది రూపుకు వచ్చినా ఈ నెల 23న జరిగే విజయదశమి వేళకు మాత్రం సిద్ధం కాలేదని అంటున్నారు.
దాంతో జగన్ విశాఖ మకాం కచ్చితంగా మరో నెల రోజుల పాటు ఆలస్యం అవుతుంది అని అంటున్నారు. దీని మీద విశాఖ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ జగన్ నవంబర్ లో విశాఖకు మకాం మర్చవచ్చు అని అన్న్నారు. లేట్ అయినా కూడా తప్పనిసరిగా జగన్ విశాఖ వస్తారని ఇక్కడ నుంచే పాలిస్తారు అని స్పష్టం చేశరు.
విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా తాము రాంగ్ రూట్ లో రావడం లేదని రాజ మార్గంలోనే వస్తామని అన్నారు. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు పెట్టుకుని విశాఖ నుంచి పాలించడానికి అన్ని రకాలుగా రాజ్యాంగం ప్రకారం అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇదిలా ఉంటే సీఎం భవనాలు తుది రూపు దిద్దుకోవాల్సి ఉంది. అదే సమయంలో కీలక మంత్రిత్వ శాఖల భవనాలకు కూడా ఎంపిక చేయాల్సి ఉంది. ఇవన్నీ జరగాలంటే కచ్చితంగా మరో నెల రోజులు పట్టే అవకాశం ఉంది అని అంటున్నారు.
దాంతోనే జగన్ విశాఖ వాసి అయ్యేది అపుడే అంటున్నారు. దసరా తరువాత దీపావళి కూడా చూసుకుని కార్తీకమాసం పవిత్ర ఘడియలలో జగన్ విశాఖకు తన క్యాంప్ ఆఫీస్ తరలిస్తారు అని అంటున్నారు. అంటే ఎలా చూసుకున్నా ఎన్నికలకు నాలుగు నెలల సమయం ముందు మాత్రమే జగన్ విశాఖ రాబోతున్నారు అన్న మాట. ఉత్తరాంధ్ర సహా ఉభయ గోదావరి జిల్లాల రాజకీయాలను మార్చే కొత్త ఎత్తుగడతోనే జగన్ విశాఖ మకాం అన్నది ఉంటుందని అంటున్నారు.