Begin typing your search above and press return to search.

జగన్ వర్సెస్ బాబు : తొలి సంతకం అక్కడే...!?

రాజకీయ సిద్ధాంతాలను చూసి ఓటు వేయడం అన్నది కూడా పోయి దశాబ్దాల కాలం అయింది.

By:  Tupaki Desk   |   5 April 2024 12:30 AM GMT
జగన్ వర్సెస్ బాబు : తొలి సంతకం అక్కడే...!?
X

ఏపీలో జగన్ వర్సెస్ చంద్రబాబు అన్నట్లుగా వార్ జరుగుతోంది. ఈసారి ఎన్నికల్లో అజెండా వేరేది లేదు. రాజకీయ సిద్ధాంతాలను చూసి ఓటు వేయడం అన్నది కూడా పోయి దశాబ్దాల కాలం అయింది. వ్యక్తి పూజతోనే రాజకీయాలు నడుస్తున్నాయి.

ఇక ఏపీలో చూస్తే చంద్రబాబు పాలన ఒక అయిదేళ్ళు చూశారు. జగన్ పాలన ఒక అయిదేళ్ళు చూశారు. ఈ ఇద్దరిలో ఎవరు మేలు ఎవరి వల్ల ఎక్కువ ప్రయోజనం ఏపీకి ఉంటుంది. ఏపీని ఎవరు ముందుకు తీసుకుని వెళ్లగలరు అన్న దాని మీదనే ఈసారి జనాలు తీర్పు ఇస్తారు అనడంలో సందేహం లేదు.

పార్టీలు కూటములు తరువాత సంగతి. చంద్రబాబునే ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటే కూటమిలో ఎవరు క్యాండిడేట్ అన్నది కూడా పట్టించుకోకుండా ఓట్లు గుద్దుతారు. అదే జగన్ పాలన మరోసారి కావాలి అనుకుంటే ఏకపక్షంగా ఆ వైపునకు వెళ్ళి మరీ జనాలు జై కొడతారు.

ఇక అలా చూసుకుంటే విశ్లేషించుకుంటే ఇద్దరికీ అవకాశాలు ఉన్నాయి. ఇద్దరికీ ప్లస్ లు ఉన్నాయి మైనస్ లు కూడా ఉన్నాయి. జగన్ సంక్షేమం పీక్స్ కి చేర్చారు. చంద్రబాబు అభివృద్ధి విషయంలో ముందుంటారు. ఒక రాష్ట్రానికి ఈ రెండూ కావాలి. బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. కానీ అది జరగలేదు.

దాంతో ఏపీకి ఇపుడు ఏది అవసరం అని జనాలు ఆలోచించి ఓటు వేస్తారు అని అంటున్నారు. ఇదిలా ఉండగా జగన్ కానీ చంద్రబాబు కానీ పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమే అన్నది ఇద్దరిలోనూ వంద శాతం ధీమాగా కనిపిస్తోంది.

అందుకే ఇద్దరూ ఎన్నికలు లాంచనం అన్నట్లుగానే తీసుకుంటున్నారు. చంద్రబాబు జగన్ ఎంత దాకా వెళ్లారు అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే తొలి సంతకం పెట్టడం మీద. జగన్ అయితే వాలంటీర్ల వ్యవస్థను మరోసారి పునరుద్ధరిస్తాను అంటూ చెప్పారు.

ఏపీలో ఇపుడు వాలంటీర్ల వార్ సాగుతోంది. వారిని మూడు నెలల పాటు విధుల నుంచి దూరం పెట్టారు. ఆ తరువాత ఏమి జరుగుతుందో అన్న కంగారు అయితే వారిలో ఉంది. ఆరు వేల రూపాయల దాకా గౌరవ వేతనం జగన్ ఇస్తున్నారు అలా ఎంతో కొంత వేతనం అనుకుంటూ ఏకంగా రెండు లక్షల అరవై వేల మంది దాకా ఈ చిరు ఉద్యోగం మీద ఆధారపడి ఉన్నారు.

దాంతో వారి సేవలు వద్దు అని టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేయించింది అన్న దాని మీద మండి పోతున్నారు. దాంతో వారిని పూర్తిగా తమ వారిగా చేసుకునే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. దాంతో జగన్ మేమంతా సిద్ధం సభలలో వాలంటీర్లకు భారీ హామీ ఇచ్చేశారు. తాను రెండవ సారి సీఎం గా ప్రమాణం చేశాక పెట్టే తొలి సంతకం వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణ మీదనే అన్నారు.

ఇందులో కూడా జగన్ వ్యూహం ఉంది. వాలంటీర్ల వ్యవస్థ మీద ఆధార పడి లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. పెన్షనర్లు ఏకంగా 68 లక్షల కుటుంబాలు ఉన్నాయి. దాంతో వారిని కూడా ఈ హామీ ద్వారా తమ వైపునకు తిప్పుకునే భారీ వ్యూహం దీని వెనక ఉందని అంటున్నారు. మొత్తానికి జగన్ తొలి సంతకం వెనక బ్రహ్మాస్త్రమే ఉందని అంటున్నారు.

ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఆయన కూడా ముఖ్యమంత్రి అయితే తొలి సంతకం అదే అంటున్నారు. మెగా డీఎస్సీ ని నిర్వహిస్తామని ఆ దిశగా ఆదేశాలు ఇస్తూ తొలి సంతకం తాను పెడతాను అని అంటున్నారు. ఏపీలో చూస్తే నిరుద్యోగులు లక్షలలో ఉన్నారు. అందులో ఉపాధ్యాయ పోస్టుల కోసం ఆశగా చూసే వారు ఉన్నారు. వారి వెనకాల కుటుంబాలు ఉంటాయి. వారిని అందరికీ ఒక్క దెబ్బకు ఆకట్టుకోవడానికి బాబు మెగా డీఎస్సీ అస్త్రాన్ని బయటకు తీశారు అని అంటున్నారు.

మొత్తానికి జగన్ కానీ బాబు కానీ తొలి సంతకాలు ఏంటో చెప్పేశారు. తమ ప్రయారిటీ ఏంటో చెప్పేసారు. మరి ఇక ఆచీ తూచీ డెసిషన్ తీసుకోవాల్సింది ఏపీ ప్రజలే. చూడాలి మరి వారి తీర్పు ఎలా ఉంటుందో. వారు ఏ రకమైన నిర్ణయం తీసుకుని ఎవరిని ముఖ్యమంత్రిగా తెచ్చుకుంటారో కూడా చూడాల్సి ఉంది.