ఈ మచ్చలు అంత ఈజీగా పోవేమో.. జగన్ సర్!
ఉదాహరణకు కర్ణాటకకు చెందిన మాజీ ప్రధాని దేవెగౌడ ఈ దేశానికి ప్రధానిగా ఉన్న సమయంలో మంచి పాలనే అందించారు.
By: Tupaki Desk | 21 Jun 2024 10:30 AM GMTరాజకీయంగా వచ్చే విమర్శలు ఎప్పుడో ఒకప్పుడు చెరుపుకొనేందుకు అవకాశం ఉంటుంది. కానీ, వ్యక్తిగ తంగా ఒక నేతపై పడే విమర్శలు తొలిగిపోవడం అంత ఈజీకాదు. వీటిని చెరుపుకొనేందుకు ప్రయత్నిం చినా.. విఫలమైన నాయకులు కూడా ఉన్నారు. ఉదాహరణకు కర్ణాటకకు చెందిన మాజీ ప్రధాని దేవెగౌడ ఈ దేశానికి ప్రధానిగా ఉన్న సమయంలో మంచి పాలనే అందించారు. కానీ, ఆయన వ్యక్తిగతంపై ఒక పెద్ద మచ్చ పడింది. దీనిని ఆయన చెరుపుకోలేక పోయారు.
అదే.. ఎక్కడ ఉన్నా.. ఆయన నిద్ర పోతారని. ఇది నిజానికి వయోసంబంధిత వ్యవహారమే అయినా.. ప్రజలు హర్షించలేక పోయారు. దీంతో ఆయన మరోసారి ప్రదానిగా చేయాలని అనుకున్నా అవకాశం మాత్రం చిక్కలేదు. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రాన్ని సాధించారన్న పేరు, అభిమానం కేసీఆర్ పై ఉన్నాయి. అందుకే.. రెండు సార్లు అధికారం ఇచ్చారు. కానీ, ఇదేసమయంలో ఆయన దొర మాదిరిగా మారిపోయారన్న మచ్చను అంటించుకున్నారు.
ఫలితంగా దళిత బంధు వంటి కీలక పథకాలను అమలు చేసినా.. ప్రజలు ఆదరించలేదు. అసెంబ్లీలో ఓడించారు. పార్లమెంటు విషయానికి వస్తే.. చెత్తబుట్ట దాఖలు చేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు జగన్ విషయాన్ని తీసుకుంటే.. ఆయన కూడా.. రాష్ట్రానికి సంక్షేమ ఫలాలు అందించారనే విషయంలో ఎవరికీ సందేహం లేదు. అమ్మ ఒడి వంటి బృహత్తర పథకం తీసుకువచ్చి వేలకు వేల రూపాయలు ఇచ్చారు. కానీ, ఆయనపై అనేక మచ్చలు అంటించుకున్నారు. ఇవి ఎప్పటికీ పోయేలా కనిపించడం లేదు.
ప్రజల మాట, ఆకాంక్షలకు ఆయన విలువ ఇవ్వరని, జగన్ పాలనలో కక్ష పూరిత రాజకీయాలు సాగాయని, ఇంటి నుంచి గడప దాటి బయటకు రారని, ప్రతిపక్షాన్ని తొక్కేస్తారని, లేనిపోని నిర్ణయాలతో అభాసు పాలవుతారని, మూర్ఖంగా వ్యవహరిస్తారని, ప్రజా ప్రతినిధులకు కూడా అందుబాటులో ఉండరని.. ఇలా. అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చెరిగిపోయే మచ్చలు కావు. వీటిని చెరుపుకోవాలంటే.. కనీసంలో కనీసం 10 సంవత్సరాలైనా పడుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.