జగన్ సారూ... మీ సలహాదారులెక్కడ ..?
ఎలా చూసుకున్నా.. సలహాదారులకు స్కోప్ ఉంది. వారి సొంత చానెళ్ల ద్వారా అయినా..వైసీపీ హయాం లో జరిగిన నిర్ణయాలు.. చేసిన చట్టాలపై వారు వాయిస్ వినిపించే అవకాశం ఉంది.
By: Tupaki Desk | 8 Aug 2024 9:30 PM GMTలెక్కకు మిక్కిలిగా వైసీపీ హయాంలో పనిచేసిన సలహాదారులు ఇప్పుడు ఏమయ్యారు. సుమారు 89 మందిని సలహాదారులుగా జగన్ నియమించుకున్నారు. కొందరిని పొరుగు రాష్ట్రాల నుంచి కూడా తెచ్చుకున్నారు. పోసాని కృష్ణమురళి, అలీ వంటివారికి కూడా పదవులు కట్టబెట్టారు. వీరు కాకుండా.. మీడియా రంగం నుంచి అమర్ వంటి బలమైన వాయిస్ ఉన్నవారిని కూడా నియమించారు. వారికి కేబినెట్ హోదాతోపాటు నెలకు 4 లక్షల వరకు వేతనం కూడా ఇచ్చారు.
ప్రభుత్వం మారేసరికి వారంతా తమ పదవులకు రాజీనామాలు చేశారు. అయితే.. ఇప్పుడు పార్టీ కష్ట కాలంలో ఉన్న నేపథ్యంలో వారంతా ఎక్కడి నుంచైనా సరే.. వాయిస్ వినిపించేందుకు అడ్డంకులు లేవు. అయినప్పటికీ.. వారు మౌనంగా ఉంటున్నారు. మరి ఇలా ఎందుకు జరుగుతోంది. ఇక, వైసీపీ పని అయిపోయిందని వారు భావిస్తున్నారా? లేక.. జగనే వారిని వద్దని వారిస్తున్నారా? అనేది ప్రశ్న. కనీసం వైసీపీ ఉప్పు తిన్నందుకైనా వారు ముందుకు రావాలి కదా! అంటే.. సమాధానం లేదు.
వాస్తవానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. హైకోర్టు నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా.. జగన్ పట్టించుకోకుం డా సలహాదారులను నియమించుకున్నారు. సలహాదారుల లెక్క తేలుస్తాం! అంటూ.. హైకోర్టు హెచ్చరిక లు జారీ చేసినా.. జగన్ వినిపించుకోకుండా.. అదే రోజు సలహాదారుడిని నియమించుకున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే.. పార్టీ నాయకుల కంటే కూడా.. సలహాదారులపైనే జగన్ ఎక్కువగా విశ్వాసం పెట్టుకున్నారు. మరి అలాంటివారికి ఇప్పుడు బాధ్యత లేదా? అనేది ప్రశ్న.
ఎలా చూసుకున్నా.. సలహాదారులకు స్కోప్ ఉంది. వారి సొంత చానెళ్ల ద్వారా అయినా..వైసీపీ హయాం లో జరిగిన నిర్ణయాలు.. చేసిన చట్టాలపై వారు వాయిస్ వినిపించే అవకాశం ఉంది. జగన్‌కు మద్దతుగా నిలిచే అవకాశం కూడా కనిపిస్తోంది. అయినా వారు మౌనంగా ఉన్నారు. అంటే.. వారు కూడా కేసులకు భయపడుతున్నారా? లేక, నిజంగానేవారు కూడా తప్పులు చేశారా? అనేది ప్రశ్న. మొత్తంగా చూస్తే.. వైసీపీ నమ్ముకున్న వలంటీర్లు, గృహ సారథుల తర్వాత.. మేధావులను కదిలించేందుకు సలహాదారులు కూడా నిరుపయోగంగానే మారారని చెప్పాలి.