ఇన్ని వ్యతిరేకతల మధ్య జగన్ గెలిస్తే మాత్రం !
వైసీపీ ఈసారి గెలుస్తుంది మళ్ళీ అధికారం చేపడుతుంది అని వైసీపీ నుంచి గట్టిగా వినిపిస్తోంది.
By: Tupaki Desk | 27 May 2024 3:57 AM GMTవైసీపీ ఈసారి గెలుస్తుంది మళ్ళీ అధికారం చేపడుతుంది అని వైసీపీ నుంచి గట్టిగా వినిపిస్తోంది. దానికి వారికి ఉన్న కారణాలు విశ్లేషణలు ఉన్నాయి. ఎక్కువ ఓటింగ్ పాజిటివ్ అని అంటున్నారు. మహిళలు వృద్ధులు అనుకూలంగా ఓటు వేశారు అని చెబుతున్నారు. అయిదేళ్ళ పాటు పనిచేసిన తీరుకి జనాల నుంచి వచ్చిన భారీ రెస్పాన్స్ అని అంటున్నారు.
అయితే బయట చూస్తే వాతావరణం వేరుగా ఉంది. ముఖ్యంగా కీలక సెక్షన్లు అన్నీ యాంటీగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు లక్షలలో ఉన్నారు. వారు వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అత్యధిక శాతం కూటమికే పడింది అని అంటున్నారు. అంతే కాదు వారి కుటుంబ సభ్యుల ఓటింగ్ కూడా అటే అని అంటున్నారు. ఆ విధంగా చూస్తే కనీసంగా కుటుంబంలో నలుగురు ఉన్నా పదిహేను లక్షల దాకా అని భావించాలి. ఇక సన్నిహితులు స్నేహితులను కూడా ప్రభావితం చేసారు అని అంటున్నారు.
దాంతో అదొక అయిదు లక్షల దాకా చూసుకున్నా ఇరవై లక్షలు అని ఒక మొద్దు లెక్కగా కడుతున్నారు. యువత యాంటీగా ఓటు వేసింది అని చెబుతున్నారు. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదని జాబ్ కాలెండర్ భర్తీ చేయలేదని కోపంతో వ్యతిరేక ఓటింగ్ చేశారు అని అంటున్నారు. ఈసారి వీరు కూడా గంటల తరబడి క్యూ లైన్లలో ఉంటూ ఓటెత్తారు. మరి ఇవి కూడా లక్షలలోనే పోల్ అయి ఉంటాయని అంటున్నారు.
కొత్త ఓటర్లు కూడా ఈసారి అత్యధికంగానే ఉన్నారు. వారి లోట్లు కూడా కూటమికే ఎక్కువ వెళ్ళాయని ఆ వైపు చెబుతున్నారు. మేధావులు చదువరులు, విద్యావంతులు ప్రైవేట్ ఉద్యోగులు వివిధ వర్గాల వారు యాంటీగానే ఓటు చేశారు అన్నది ఒక లెక్కగా కూటమి నుంచి వస్తోంది.
అయితే ఇవన్నీ అర్బన్ ఓటింగే అని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తం నాలుగు కోట్ల 14 లక్షల ఓట్లలో 75 నుంచి ఎనభై లక్షల దాకా ఓటింగ్ అర్బన్ ది అని ఆ ఓట్లు తీసి మొత్తం పక్కన పెట్టినా రూరల్ ఓట్లు మూడు కోట్లకు పై దాటి ఉన్నాయని వారి విశ్లేషణ. అందులో నూటికి ఎనభై శాతం తమకే పడినా తాము విజేతమని వారి భావన.
అయితే రూరల్ లోనూ మహిళా సెక్షన్ లోనూ టీడీపీ కూటమి ఓట్లు లేవా అంటే ఎందుకు లేవు అన్న మాట ఉంది. టీడీపీ ఈనాటి పార్టీ కాదు కదా అన్న వారూ ఉన్నారు. బూత్ లెవెల్ లో పాతుకుని పోయిన టీడీపీకి రూరల్ లో ఓటింగ్ స్ట్రాంగ్ గానే ఈసారి పడింది అన్నది కూటమి వాదన.
ఇక సామాజిక వర్గాల పరంగా చూస్తే ఏపీలో అత్యధిక శాతం ఉన్న కాపులలో మెజారిటీ కూటమికి జై కొట్టారని అంటున్నారు. వారు యాభై లక్షలకు పై దాటి ఉంటారు అనుకున్నా నలభై లక్షల దాకా ఓట్లు మావే అంటున్నారు. అలాగే బీసీలలో వైసీపీ టీడీపీ పంచుకున్నా అక్కడికి కూటమికే ఎడ్జ్ ఉంటుంది అని అంటున్నారు. ఆ లోటుని ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో భర్తీ చేసుకోగలమని వైసీపీ భావిస్తూంటే అందులో కూడా ఈసారి తమ వాటా పెరిగింది అని కూటమి చెబుతోంది.
ఇలా రెండు వైపులా లాజిక్ తో కూడిన వాదనలు ఉన్నాయి. అదే విధంగా రెండు వైపులా గెలుపు అవకాశాలకు చెబుతున్న కారణాలు సహేతుకంగానే ఉన్నాయి. పైగా ఏపీలో రాజకీయ వాతావరణం మొత్తం వైసీపీకి యాంటీగా మారిన సందర్భం ఉంది. సొంత కుటుంబమే ఈసారి వైసీపీ అధినాయకత్వానికి దూరం అయింది. ఇలా చూస్తే కనుక అన్నీ ప్రతికూలతలే అని అంటున్నారు.
మమతా బెనర్జీ విషయంలో 2021లో జరిగిన ఎన్నికల్లో ఇదే జరిగింది. ఆమెకు పూర్తి యాంటీగా బీజేపీ పట్టు బిగించింది. ఆమె ఓటమే టార్గెట్ గా పనిచేసింది. అంత చేసినా ఆమె హ్యాట్రిక్ కొట్టి సీఎం అయ్యారు. అలా ఆమె గ్రేట్ అనిపించుకున్నారు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు వైసీపీ ఇన్ని వ్యతిరేకతల మధ్య గెలిచిందా అంటే అది రికార్డులకే రికార్డు అని అంటున్నారు మరి జగన్ కూడా మమత మాదిరిగా ఏపీలో విక్టరీ కొడతారా అంటే వెయిట్ అండ్ సీ.