Begin typing your search above and press return to search.

విశాఖ సంగతేంటి...జగన్ ఆరా !

విశాఖలో వైసీపీ పరిస్థితి రాజకీయ వాతావరణం వంటివి జగన్ ఆయనతో మాట్లాడారని పార్టీ వర్గాలు తెలిపాయి.

By:  Tupaki Desk   |   4 July 2024 1:30 AM GMT
విశాఖ సంగతేంటి...జగన్ ఆరా !
X

వైసీపీ అధినేత జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకున్న తరువాత బుధవారం పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలు అయిన నేతలతో చర్చించారు. విశాఖ నుంచి వైసీపీ అధ్యక్షుడు కోలా గురువులు ఈ భేటీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విశాఖ గురించి ఆయనతో జగన్ చర్చించినట్లుగా తెలుస్తోంది. విశాఖలో వైసీపీ పరిస్థితి రాజకీయ వాతావరణం వంటివి జగన్ ఆయనతో మాట్లాడారని పార్టీ వర్గాలు తెలిపాయి. విశాఖలో రెండోసారి సీఎం గా ప్రమాణం చేస్తానని జగన్ చెప్పారు.

అదే విధంగా విశాఖలోనే ఆయన బస చేసేందుకు ఆరు వందల కోట్ల రూపాయలతో రుషికొండ వద్ద అద్భుతమైన ప్యాలెస్ ని నిర్మించుకున్నారని ప్రచారం సాగింది. దానిని సీఎం క్యాంప్ ఆఫీసుగా మార్చి జగన్ అక్కడే ఉంటారు అని కూడా పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి అయితే నెల రోజుల క్రితం వచ్చిన ఫలితాలతో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు అయింది. దాంతో జగన్ విశాఖ అన్న మాటల మధ్య కనెక్షన్ తెగిపోయింది. విశాఖ రాజధాని అన్న దానికీ అర్ధం లేకుండా పోయింది.

అన్నింటికీ మించి విశాఖను రాజధానిగా చేస్తామని ఒకటికి పది సార్లు చెప్పినా విశాఖ జనం వైసీపీని ఏ మాత్రం ఆదరించలేదు. మొత్తానికి మొత్తం సీట్లను కూటమికి ఇచ్చేశారు. భారీ ఆధిక్యతలతో కూటమి తరఫున అభ్యర్ధులు గెలిచారు.

దాంతో వైసీపీకి విశాఖలో ఎదురుగాలి బలంగా వీచింది. ఉన్న నాయకులు అంతా గప్ చుప్ అయ్యారు. చాలా మంది పక్క చూపులు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పార్టీ ఓటమి పాలు అయ్యాక చాలా మంది సొంత పనులలో పడిపోయారు. వైసీపీ ఊసు ఎత్తడంలేదు

ఇక జగన్ సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి విశాఖ పార్టీ వ్యవహారాలు చూస్తున్నా ఆయన షటిల్ సర్వీస్ మాదిరిగా విశాఖ హైదరాబాద్ ఢిల్లీల మధ్య తిరుగుతున్నారు. మొత్తానికి పార్టీ యాక్టివిటీ అన్నదే లేకుండా పోయింది. ఏపీలో అతి పెద్ద నగరం అయిన విశాఖలో ఫ్యాన్ రెక్కలు ఆగిపోవడం తో వైసీపీ అధినాయకత్వం ఆ వైపుగా దృష్టి పెట్టింది అని అంటున్నారు.

ఎన్నికల్లో పోటీ చేయని విశాఖ జిల్లా ప్రెసిడెంట్ కోలా గురువులు జగన్ని కలిశారు అంటే పార్టీ వ్యవహారాలు చర్చించడానికే అని అంటున్నారు. పార్టీని పటిష్టం చేయడం నిద్రాణమైన క్యాడర్ ని లీడర్ ని తట్టి లేపడం అన్నది ముఖ్యమైన వ్యవహారంగా ఉంది. మొత్తం మీద వైసీపీ పరిస్థితి విశాఖలో ఎలా ఉంది అన్నది సమీక్షించడమే కాకుండా పార్టీని బలోపేతం చేయమని జగన్ సూచించారు అని అంటున్నారు.