Begin typing your search above and press return to search.

ఏపీ స్పీకర్ కు జగన్ రాసిన లేఖలో ఏముంది?

ఆ సందర్భంగా ఆయన అంతకు ముందు వచ్చిన 151 కంటే ఎక్కువ సీట్లు ఖాయమని.. గెలుపు ధీమాను వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   26 Jun 2024 4:18 AM GMT
ఏపీ స్పీకర్ కు జగన్ రాసిన లేఖలో ఏముంది?
X

వైనాట్ 175 అంటూ ఎన్నికల గోదాలో దిగి.. పోలింగ్ పూర్తైన తర్వాత తమ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తలుగా వ్యవహరించిన వారి వద్దకు అపద్ధర్మ సీఎం హోదాలో వెళ్లిన జగన్మోహన్ రెడ్డి.. తనకు పని చేసిన టీంతో మాట్లాడటం తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన అంతకు ముందు వచ్చిన 151 కంటే ఎక్కువ సీట్లు ఖాయమని.. గెలుపు ధీమాను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగన్ మాటలను భారీగా ట్రోల్ చేశారు. ఎన్నికల వ్యూహకర్తలుగా పని చేసిన వారికి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసని.. ఆ విషయాన్ని వారు చెప్పాల్సింది పోయి.. వారికి జగనే ఎన్ని సీట్లు వస్తాయో చెప్పటం ఏమిటి? అంటూ నవ్వుకున్న పరిస్థితి.

ఈ ట్రోల్ కు తగ్గట్లే.. ఆయన చెప్పిన మాటల్లో ఏ మాత్రం వాస్తవం లేదని.. గత ఎన్నికల్లో వచ్చిన 151 సీట్లకు.. మధ్యలో ఐదు అంకె మిస్ అయి.. కేవలం 11 సీట్లు రావటం తెలిసిందే. కలలో కూడా ఊహించని ఘోర పరాజయాన్ని పొందిన జగన్.. కొంతకాలం మౌనంగా ఉంటే బాగుండేది. కానీ.. అందుకు భిన్నంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆయనకు ఎదురుదెబ్బలు తినేలా చేస్తున్నాయి. పదకొండు మంది ఎమ్మెల్యేల బలం ఉన్న తమపార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని కోరుతూ ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు.

నిబంధనల ప్రకారం మొత్తం సభ్యుల్లో పది శాతం మంది సభ్యులున్న విపక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారు.అయితే.. అలాంటిదేదీ లేదంటూ తన సుదీర్ఘ లేఖలో పేర్కొన్నారు జగన్. అంతేకాదు.. పలు అంశాల్ని ప్రస్తావించారు. దీంతో.. జగన్ లేఖలో అసలేం ఉంది? పూర్తి పాఠమేంటి? అన్నది హాట్ టాపిక్ గా మారింది. స్పీకర్ కు రాసిన లేఖపై పలు కౌంటర్లు పడుతున్నాయి. ఆయన వాదనలో ఎలాంటి పస లేదని.. మొత్తం నసే అంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తంగా లేఖతో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్లు అయ్యిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇంతకూ ఏపీ స్పీకర్ కు జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖలోని కీలకాంశాల్ని చూస్తే..

- మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు పూర్తి విరుద్ధం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లు దీని ద్వారా కనిపిస్తోంది. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష మోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు.

- ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు సాధించి ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. పార్లమెంటులో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కానీ ఈ నిబంధన పాటించలేదు. అధికారకూటమి.. స్పీకర్ ఇప్పటికే నా పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.

- చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు వీడియోల ద్వారా బయటపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో గొంతు విప్పే అవకాశాలు కనిపించటం లేదు.

- అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అస్కారం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. ఈ అంశాలని పరిగణలోని తీసుకొని నా లేఖను పరిశీలించాలని కోరుతున్నా.

- ప్రధాన ప్రతిపక్ష.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరే విషయాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్టు 1953 చట్టం 12 ఆలో ప్రధాన ప్రతిపక్షపార్టీ అంటే ఎవరనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించింది.

- విపక్షంలో ఉన్న పార్టీల్లో ఎవరికి ఎక్కువ సంఖ్యాబలం ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందున విపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే.

- జూన్ 21న జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని చూస్తే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూస్తే వైఎస్సార్ సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించటం.. పార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించటంలో మీ ఉద్దేశాలేమిటో బయటపడ్డాయి.

- చట్టాన్ని పరిశీలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వటంలో కానీ పార్టీ శాసనసభాపక్ష నేత అయిన నన్ను ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించేందుకు కానీ ఎలాంటి సందిగ్థతకు తావులేదు. ఇటీవల స్పీకర్ చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్ లో చానళ్లలో ఉన్నాయి.

- ఓడిపోయాడు కానీ చావలేదు. చచ్చేవరకూ కొట్టాలి.. అంటూ నన్ను ఉద్దేశించి గౌరవ స్పీకర్ అన్న మాటలు ఆ వీడియోల్లో ఉన్నాయి. తద్వారా నాపై ఉన్న శత్రుత్వాన్ని స్పీకర్ రూపంలో అధికార కూటమి వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 40 శాతం ఓట్లను సాధించింది.

- ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించాల్సిన బాధ్యత మాపై ఉంది. ప్రభుత్వం.. స్పీకర్ శత్రుత్వ వైఖరిని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మా పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీ కార్యకలాపాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేస్తున్నట్లే అవుతుంది.

- వైఎస్సార్ సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వటం వల్ల అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి తగిన సమయం లభిస్తుంది. సభా కార్యక్రలాపాల్లో ముమ్మరంగా పాల్గొనేలా.. ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీగా అభిప్రాయాలను చెప్పేలా చట్టబద్ధమైన భాగస్వామ్యం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి లభిస్తుంది. ఇలాంటి పరిస్థితి లేకపోతే అసెంబ్లీలో అధికార కూటమి గొంతు మాత్రమే వినిపిస్తుంది.

- వివిధ అంశాల్లో బలమైన చర్చలు జరిగే అవకాశం ఉండదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 208 కింద ఆంధప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తనా నియమావళిలో నిర్దిష్ట సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదనే విషయాన్ని మీ ముందుకు తెస్తున్నా.

- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తు చేస్తున్నా. లోక్ సభకు 1984లో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లను గెలుచుకుంది. సభలో 10 శాతం సీట్లు సాధించనప్పటికీ నాడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు.

- 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు కాంగ్రెస్ 26 స్థానాల్ని మాత్రమే సాధించింది. పది శాతం సీట్లు కాంగ్రెస్ కు దక్కనప్పటికీ పి.జానానర్ధనరెడ్డిని నాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70స్థానాలకు బీజేపీకి కేవలం 3 స్థానాల్లో మాత్రమే గెలిచినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు.

- ఈ అంశాలన్నీ కూడా కేవలం ప్రజా ప్రయోజనాల రీత్యా మీ ముందుకు తీసుకొస్తున్నా. ప్రజల తరఫున అసెంబ్లీలోగొంతు విప్పటానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతోమీకు ఈ లేఖ రాస్తున్నా.

- ఇలాంటి పరిస్థితికి అస్కారం లేకుండా అధికార కూటమి ఇప్పటికే శ్రతుత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో నేను సభలో మాట్లాడాలనుకుంటే అది భారీ మెజార్టీ సాధించిన అధికార కూటమి దయ మీద.. నన్ను చచ్చే వరకూ కొట్టాలన్న స్పీకర్ గారి విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సభలో ఉన్న పార్టీల సంఖ్యా బలాలను ద్రష్టిలో ఉంచుకొని ఈ లేఖను పరిశీలించాలని కోరుతున్నా.