అసెంబ్లీలో జగన్ కనిపించరంతే !
వైసీపీ సభ్యులను పూర్తిగా అవమానించే అవకాశాలు ఉంటాయని భావించే జగన్ అసెంబ్లీకి దూరం అని అంటున్నట్లుగా తెలుస్తోంది.
By: Tupaki Desk | 20 Jun 2024 12:42 PM GMTఒకనాటి ఉద్యానవనమూ నేడు కనమూ అని వైసీపీ నేతలు పాడుకోవాల్సి వస్తోంది. ఒకనాడు 151 సీట్లతో అసెంబ్లీ అంతా పరచుకున్న వైసీపీ కేవలం 11 మందితో ఒక మూలన విసిరేటట్టుగా ఉండాల్సి వస్తుంది. అంతే కాదు మాట్లాడేందుకు అవకాశం ఉండదని వైసీపీ భావిస్తోంది.
ఇక ప్రతిపక్ష హోదా ఉంటే కచ్చితంగా రూల్స్ ప్రకారం ప్రతీ అంశం మీద చర్చను ప్రారంభించే అవకాశం వస్తుంది. కానీ ప్రతిపక్ష పాత్ర కంటే తక్కువ సంఖ్యాబలం ఉంది. దాంతో స్పీకర్ మైక్ ఇస్తేనే మాట్లాడాల్సి ఉంటుంది. ఒక విధంగా అసెంబ్లీకి వెళ్ళడం అంటేనే వైసీపీకి కొత్త భయాలు పుట్టుకుని వచ్చేలా పరిస్థితి ఉంది అని అంటున్నారు.
దాంతో వైసీపీ ఏకంగా అసెంబ్లీకి దూరంగా ఉంటుందని అంటున్నారు. దానికి వైసీపీ అధినేత మనోగతం కూడా బలాన్ని ఇస్తోంది. ఆయన తాజాగా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చేసిన కామెంట్స్ చూస్తే అచ్చం చంద్రబాబు మాదిరిగానే కౌరవ సభతో పోల్చారు. జగన్ ఓడిపోయారు కానీ చావలేదు, చచ్చేటట్లుగా కొట్టాలి అని అన్న వ్యక్తులు స్పీకర్ స్థానంలో ఉండబోతున్నారు అని అయ్యన్నపాత్రుడిని ఉద్దేశించి అన్నట్లుగా తెలుస్తోంది.
ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీకి వెళ్ళి చేసేది ఏమీ లేదు అని జగన్ తేల్చేసినట్లుగా కనిపిస్తోంది. పైపెచ్చు నిండు అసెంబ్లీలో వైసీపీని టార్గెట్ చేయడం ఖాయమన్న భావన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వం అవినీతి అక్రమాలు అంటూ మీడియా ముందు మాట్లాడుతోంది. దాంతో ఈ సభలో సంజాయిషీ కూడా తీసుకోరు, వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా మైకులు ఇవ్వరు. అసెంబ్లీలో అతి తక్కువ మంది సభ్యులు చేసేది ఏమీ ఉండదని జగన్ ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు.
అసెంబ్లీకి వెళ్ళి ప్రత్యేకంగా ప్రజలకు మేలు ఏదో చేయగలుగుతామన్న నమ్మకం అయితే లేదు అని జగన్ భావనగా ఉంది అని అంటున్నారు. ప్రజలతో కలసి పోరాటాలు చేయడమే మేలు అని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. కొత్త ప్రభుత్వం మీద కాలం గడచే కొద్దీ మోజు తగ్గి అసంతృప్తి పెరుగుతుందని అపుడు కచ్చితంగా జనాల మూడ్ బట్టి వారితో కలసి పోరాటాలు చేదామని జగన్ అన్నట్లుగా చెబుతున్నారు.
శిశుపాలుడి తప్పులు మాదిరిగా ఒక్కోటి లెక్క కట్టి జనంతోనే ప్రభుత్వం మీద సమర శంఖం పూరిద్దామని జగన్ అంటున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం పాపాలు పండే రోజుల కోసం వేచి చూడడమే బెటర్ అని జగన్ అంటున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే గత అసెంబ్లీలో మాటల దాడి కాస్తా మరింత ముదిరి దాడులు కూడా చోటు చేసుకున్నాయని అంటున్నారు. దాంతో ఈసారి అసెంబ్లీలో మొత్తం టీడీపీ కూటమి ఉన్న నేపధ్యంలో కచ్చితంగా ఇబ్బందులు రాజకీయంగా రావచ్చు అన్న ఆలోచనలు ఉన్నట్లుగా చెబుతున్నారు. వైసీపీ సభ్యులను పూర్తిగా అవమానించే అవకాశాలు ఉంటాయని భావించే జగన్ అసెంబ్లీకి దూరం అని అంటున్నట్లుగా తెలుస్తోంది.
వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇందులో కొత్తగా గెలిచిన వారు సైతం ఉన్నారు. వారికి అసెంబ్లీ ముచ్చట లేకుండా పోతుందా అన్న చర్చ అయితే సాగుతోంది. కానీ ఏపీ అసెంబ్లీ తీరు చూస్తే ఏకపక్షంగా ఉంది. దాంతో ఎవరూ సభలో కనీసం వెళ్ళి ఉండలేని పరిస్థితి అని అంటున్నారు. దాంతో ఈ టెర్మ్ కి సభకు టీడీపీకి కూటమికి రాసిచ్చేయాలని వైసీపీ డిసైడ్ అయింది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈసారి అసెంబ్లీలో జగన్ అండ్ కో కనిపించే అవకాశాలు అయితే లేవు అని అంటున్నారు. కొత్త అసెంబ్లీ స్టార్ట్ అవుతున్న వేళ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం వేళ వైసీపీ తన స్టాండ్ ఏంటో చెప్పకనే చెప్పేసింది అని అంటున్నారు.