కలెక్టర్ పై జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు... సభ్యసమాజానికి ఏమి సందేశం?
రాజకీయాల్లో దిగజారుడుతనం రోజు రోజుకీ పెరిగిపోతుందనే చర్చ గత కొంతకాలంగా బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 26 Oct 2024 9:15 AM GMTరాజకీయాల్లో దిగజారుడు తనం రోజు రోజుకీ పెరిగిపోతుందనే చర్చ గత కొంతకాలంగా బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఎంత అసహ్యంగా, అసభ్యంగా మాట్లాడితే వాళ్లు అంత గొప్ప లీడర్, మాస్ లీడర్ అన్నట్లుగా ప్రచారం జరుగుతున్న రోజులివి. వీటినే దౌర్భాగ్యకరమైన పరిస్థితులు అని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు.
కొంతమంది నేతల్లో హుందాతనం మచ్చుకైనా కనిపించడం లేదనే కామెంట్లూ తదనుగుణంగా వినిపిస్తున్న పరిస్థితి. లైవ్ లో రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారంటే.. న్యూస్ ఛానల్స్ లో కూడా "పెద్దలకు మాత్రమే (18+)" అని నోట్ పెట్టాల్సి వస్తుందనే చర్చా మొదలైంది. వాటికి బలం చేకూరుస్తూ అన్నట్లుగా జగ్గారెడ్డి వీడియో ఒకటి నెట్టింట దర్శనమిచ్చింది.
అవును... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఓ కలెక్టర్ కు తాను ఫోన్ చేస్తే ఎత్తలేదని.. దీంతో తనకు కోపం వచ్చి (అసభ్యంగా) తిట్టానంటూ ఆయన బహిరంగంగా ప్రకటించుకున్నట్లున్న వీడియో ఇప్పుడు రకరకాల విమర్శలకు తావిస్తోంది.
పైగా తాను కలెక్టర్ ను అన్న మాటలు మీకు అర్ధమయ్యాయా అంటూ అక్కడున్న ప్రజానికాన్ని ప్రశ్నించారు జగ్గారెడ్డి. దీంతో... ఇంత పైత్యం ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు! జగ్గారెడ్డి బర్త్ డే వేడుకలు ఈ ఏడాది జూలై లో మైనార్టీ నాయకులు నాల్సాబ్ గడ్డ్ చౌరాస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా... తాను ఓ సారి కలెక్టర్ కు ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోలేదని.. పది సార్లు చేసినా పట్టించుకోలేదని.. ఆఫీసుకు వెళ్లినా అక్కడ లేరని.. దీంతో కలెక్టర్ పీఏకు ఫోన్ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పీఏ కు ఫోన్ చేసి... కలెక్టర్ కు కాల్ చేస్తే రిసీవ్ చేయడం లేదని, ఆఫీసుకు వెళ్తే అక్కడా లేరని చెప్పినట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలోనే... "మీ కలెక్టర్ ఇంట్లో మరో మగాడితో పడుకున్నాడా?" అని ఫైర్ అయ్యానని.. వెంటనే ఐదు నిమిషాల్లో కలెక్టర్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పుకున్నారు ప్రజాసేవకుడు జగ్గారెడ్డి! దీంతో... ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. గౌరవప్రదమైన కలెక్టర్ హోదాలో ఉన్న అధికారితో... ఇంత అసభ్యంగా మాట్లాడటం ఏమిటని ఫైర్ అవుతున్నారు.
ప్రజాసేవకులుగా చెప్పుకునే రాజకీయ నాయకులను చూసి ప్రజలు.. ‘ఇలా ఉండాలి’ అని అనుకోకపోయినా పర్లేదు కానీ.. ‘ఇలా మాత్రం ఉండకూడదు’ అని అనిపించుకోకూడదని సూచిస్తున్నారు. పుచ్చలపల్లి సుందరయ్య, ప్రకాశం పంతులు లా ఉందనవసం లేదు కానీ.. సినిమాల్లో చూపించే విలన్స్ లా తయారవ్వ కూడదని హితవు పలుకుతున్నారు.
చేసిందే అసభ్యకరమైన పని.. పైగా ఆ విషయాన్ని నలుగురిలో చెప్పుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పైగా ‘నేను కలెక్టర్ గురించి అసభ్యంగా మాట్లాడిన మాటలు మీకు అర్ధమయ్యాయా?” అంటూ అక్కడున్నవారిని ప్రశ్నించడం చూస్తుంటే.. అదేదో గొప్ప పని చేసినట్లుగా జగ్గారెడ్డి ఫీలవుతున్నట్లున్నారని.. దీనివల్ల సభ్యసమాజానికి ఏమి మెసేజ్ ఇవ్వాలని ఈ కాంగ్రెస్ నేత కంకణం కట్టుకున్నారని ప్రశ్నిస్తున్నారు.
కాగా... ఇటీవల కాలంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి! కొన్ని సందర్భాల్లో ఆయన చేస్తోన్న వ్యాఖ్యలు సొంతపార్టీ నేతలను ఇరుకున పెడుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి జగ్గారెడ్డి వ్యాఖ్యలపై పార్టీ, ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా.. లేదా అనేది వేచి చూడాలి!