కూకటి వేర్లు కాదు.. ఆకును కూడా పీకలేడు.. కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత ఆగ్రహం
తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలను ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక కామెంట్స్ చేశారు.
By: Tupaki Desk | 27 Nov 2024 7:15 AM GMTతెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తే.. దానికి కాంగ్రెస్ నేతలు ప్రతికౌంటర్ ఇస్తూనే ఉన్నారు. దాంతో రాజకీయాలు వాడీవేడిగా మారాయి. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలను ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక కామెంట్స్ చేశారు. కేటీఆర్‌కు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు.
‘కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకిలిస్తా అని అంటున్నావు. కాంగ్రెస్ వయసు 140 ఏళ్లు. నీ వయసు 50 ఏళ్లు. మా పార్టీకి ఉన్న వయసు, త్యాగాల ముందు నీ వయసు పావలా వంతు లేదు. కాంగ్రెస్‌ను కూకటి వేళ్లతో పీకేంత శక్తి నీకు ఎక్కడిది’ అంటూ కేటీఆర్‌పై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ వ్యూహాల ముందు కేటీఆర్ ఎంత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కల్ప వృక్షం లాంటిదని, తమ పార్టీ వేర్లు వెతకడానికే వయసు సరిపోదని అన్నారు. పార్టీ కూకటి వేర్లు కాదు.. ఆకును కూడా కేటీఆర్ పీకలేడని హెచ్చరించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చారన్న విషయాన్ని కేటీఆర్ మరిచిపోతున్నాడని, ఆయనకు మరోసారి గుర్తు చేస్తున్నామని జగ్గారెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే.. ఇక్కడ ఇప్పటికీ కాంగ్రెస్ లేదంటే టీడీపీ అధికారంలోకి వచ్చుండేవన్నారు. తెలంగాణ వంట చేసింది కాంగ్రెస్ అయితే.. వడ్డించుకున్నది మాత్రం కేసీఆర్ అని ఎద్దేవాచేశారు. తల్లిపాలు తాగి కొమ్ము కోసినట్లుగా కేటీఆర్ మాటలు ఉన్నాయని, సోనియా తెలంగాణ ఇస్తేనే కేసీఆర్ సీఎం అయ్యాడన్న విషయం మరువకూడదని సూచించారు.
కాంగ్రెస్ అనే కల్పవృక్షం నుంచే కేసీఆర్ యూత్ కాంగ్రెస్ నేతగా ఎదిగాడన్న సంగతి మరిచిపోకూడదని జగ్గారెడ్డి హితవు పలికారు. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఇంకా 20 ఏళ్లపాటు బతకాలన్నారు. తాము అధికారంలో ఉన్నా.. లేకున్నా హూందాగా ఉంటామని చెప్పారు. బీఆర్ఎస్‌ను జాతీయ పార్టీ అన్నారని, మహారాష్ట్ర, ఒడిసా, ఏపీలకు వెళ్లి కండువాలు కప్పారని, కర్ణాటకలోనూ కాలు పెట్టావని, తర్వాత ఏమైందని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డిని గోకడం.. తన్నించుకోవడం కేటీఆర్‌కు అలవాటుగా మారిందన్నారు. కేటీఆర్, హరీశ్‌రావులు కోతలరాయుళ్లు అని విమర్శించారు. తమను తిట్టినా ఊరుకుంటామేమో కానీ.. సోనియాను, రాహుల్ గాంధీని తిడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.