Begin typing your search above and press return to search.

కెసిఆర్ తో రావడానికి నీకు దమ్ముందా.. హరీష్ రావుకు జగ్గారెడ్డి సవాల్..

ప్రస్తుతం జగ్గారెడ్డి మాట్లాడిన మాటల సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   5 Oct 2024 3:28 PM GMT
కెసిఆర్ తో రావడానికి నీకు దమ్ముందా.. హరీష్ రావుకు జగ్గారెడ్డి సవాల్..
X

తెలంగాణ రాజకీయాలు మరొకసారి వేడెక్కుతున్నాయి… ఇటు అధికార కాంగ్రెస్.. అటు బిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధాలు మొదలయ్యాయి. తాజాగా హరీష్ రావు రైతు రుణమాఫీ విషయంలో రాహుల్ గాంధీ ఇంటి ముందు దీక్ష చేపడతాను అని ఇచ్చిన స్టేట్మెంట్ కి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కెసిఆర్ ఇంటి ముందు దీక్ష చేయడానికి తాను కూడా సిద్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జగ్గారెడ్డి మాట్లాడిన మాటల సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

అంతేకాదు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హరీష్ రావుకు సవాల్ విసిరారు.రైతు రుణమాఫీ గురించి మాట్లాడడానికి సీఎం రేవంత్ ని ఒప్పించి చర్చలకు తీసుకువచ్చే బాధ్యత తనదని.. అయితే కేసీఆర్ ని ఒప్పించే చర్చకు తీసుకువచ్చే దమ్ము హరీష్ రావుకి ఉందా అంటూ జగ్గారెడ్డి ప్రశ్నిస్తున్నారు. బయట కలవడానికి భయమైతే నేరుగా సిద్ధిపేటలోనే చర్చ పెట్టడానికి తామసిద్ధమని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడు నెలలలో 18 వేల కోట్ల రుణమాఫీ చేసినట్లు జగ్గారెడ్డి తెలియజేశారు. అయితే కొన్ని సాంకేతిక లోపాల కారణంగా కొందరికి రుణమాఫీ అందలేదని.. ఆ విషయం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని జగ్గారెడ్డి వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి వివరాలు తెప్పించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేశారని పేర్కొన్నారు.

మాటికొస్తే రుణమాఫీ అని యాగి చేసే కేసిఆర్, హరీష్ రావు కారణంగానే ఈరోజు ఈ పరిస్థితులు దాపరించాయని ఆయన మండిపడ్డారు. పదేపదే రుణమాఫీ గురించి మాట్లాడడం.. రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామనడం హరీష్ రావుకి ఫ్యాషన్ అయిపోయింది.. అలాగైతే నేను కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు దీక్ష చేస్తాను అని జగ్గారెడ్డి అన్నారు. అసలు ఏ ముఖం పెట్టుకొని ఢిల్లీ వెళ్లడానికి హరీష్ రావు రెడీ అవుతున్నారు అని ప్రశ్నించారు. పది సంవత్సరాలపాటు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసిన మంచి ఏమీ లేదని.. నమ్మించి నిండా ముంచారని ఆయన వ్యాఖ్యానించారు. మల్లన్న సాగర్ రైతుల వీపులు పగలగొట్టినప్పుడు.. ఖమ్మం రైతులకు బేడీలు వేసినప్పుడు హరీష్ రావు ఏం చేశారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఇక జగ్గారెడ్డి మాటలకు హరీష్ రావు ఎటువంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.