Begin typing your search above and press return to search.

తెలంగాణ ఇవ్వ‌ద్ద‌ని చెప్పా: జ‌గ్గారెడ్డి

తెలంగాణ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్ ముద్ర వేసుకున్న మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయ‌కుడు జ‌గ్గారెడ్డి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు.

By:  Tupaki Desk   |   6 Jan 2024 7:32 AM GMT
తెలంగాణ ఇవ్వ‌ద్ద‌ని చెప్పా:  జ‌గ్గారెడ్డి
X

తెలంగాణ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్ ముద్ర వేసుకున్న మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయ‌కుడు జ‌గ్గారెడ్డి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. అయితే.. ఈ సారి తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. 2014కు ముందు జ‌రిగిన సంగ‌తుల‌ను ఆయ‌న ఏక‌రువు పెట్టారు. అప్ప‌ట్లో తెలంగాణ రాష్ట్రం కోసం.. పెద్ద ఎత్తున ఉద్య‌మా లు సాగిన విష‌యం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది.

మ‌రోవైపు ఏపీలో రాష్ట్ర విభ‌జ‌న‌కు, తెలంగాణ ఇచ్చేందుకు వ్య‌తిరేకంగా ఉద్య‌మాలు సాగుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో కొంద‌రు తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు మౌనంగా ఉండిపోయారు. ఇదే విష‌యాన్ని మాజీ సీఎం కేసీఆర్ ప‌దే పదే దెప్పిపొడిచిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న తెలంగాణ విష‌యంలో ఇక్క‌డి నాయ‌కులు ఏం చేశార‌ని.. దెబ్బ‌లు తిన్న‌రా? కేసులు పెట్టించుకున్న‌రా? అని ప్ర‌శ్నించారు.

ఇలాంటి నేప‌థ్యంలో ఆ వేడి ఇంకా త‌గ్గ‌క‌ముందే.. జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ఇవ్వ‌ద్ద‌ని తాను కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పాన‌ని తెలిపారు. అంతేకాదు.. ఈ విష‌యంపై కేంద్రంలో పార్టీ అదిష్టానానికి తాను లేఖ కూడా రాశాన‌ని చెప్పాన‌న్నారు. తెలంగాణ వ‌స్తే.. నీళ్ల విష‌యంలో వివాదాలు త‌లెత్తుతాయ‌ని తాను చెప్పాన‌ని.. ఇప్పుడు అదే ప‌రిస్థితి ఉంద‌ని జ‌గ్గారెడ్డి వ్యాఖ్యానించారు. అయిన‌ప్ప‌టికీ అధిష్టానం త‌న మాట విన‌కుండా తెలంగాణ ఇచ్చింద‌న్నారు.

ఇక‌, తెలంగాణ ఇచ్చిన త‌ర్వాత కూడా.. తాను ఎందుకు రాష్ట్రం ఇచ్చార‌ని ప్ర‌శ్నించిన‌ట్టు జ‌గ్గారెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చి.. ఎవ‌రికి లాభం చేకూర్చారో అంద‌రికీ తెలిసిందేన‌న్నారు. ఖ‌జానాను గుల్ల చేసిందెవ‌రో తెలిసిందేనన్నారు. అయితే.. ఇది త‌న వ్య‌క్తిగ‌త మ‌ని.. ప‌ర్స‌న‌ల్‌గా తాను తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అయితే.. జ‌గ్గారెడ్డి వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. ఇప్ప‌టికే బీఆర్ ఎస్ పార్టీ ఒక‌వైపు కాంగ్రెస్‌పై విరుచుకుప‌డుతున్న స‌మ‌యంలో ఇలాంటి వ్యాఖ్య‌ల‌తో పార్టీని మ‌రింత‌గా ఇరుకున పెట్టార‌నే వాద‌న వినిపిస్తోంది.