జగ్గన్న ఆరాటం.. పదవుల కోసమే 'కాకా'?
ఇక, ఎన్నికల సమయంలోనూ ఆయన ఒంటెత్తు పోకడలు పోయారు.
By: Tupaki Desk | 25 May 2024 2:45 AM GMTరాజకీయాల్లో ఉన్న నాయకులు ఎవరినీ ఊరికేనే పొగడరు. మరీ ముఖ్యంగా ఎన్నికలకు ముందు.. తర్వాత కూడా.. మార్పు కనిపిస్తే.. సదరు నేతల్లో ఏదో ఆశ ఉండనే ఉంటుంది. ఇప్పుడు ఇదే మాట.. తెలంగాణ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురించి రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డికి తొలినాళ్లలో కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వడాన్ని వ్యతిరేకించిన వారిలో జగ్గారెడ్డి ఉన్నారు. ఆయన అప్పట్లో సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. తర్వాత అధిష్టానం తలంటడంతో సర్దుకు పోయారు. ఇక, ఎన్నికల సమయంలోనూ ఆయన ఒంటెత్తు పోకడలు పోయారు. తన నియోజకవర్గంలో తనే ప్రచారం చేసుకుంటానని ప్రకటించారు.
దీంతో జగ్గారెడ్డి బలమైన ప్రచారంలో వెనుకబడి.. ఓడిపోయారు. ఇక, అప్పటి నుంచి ఆయనకు పార్టీలోనూ నెమ్మదిగా ప్రాధా న్యం తగ్గడం ప్రారంభమైంది. దీనిని గమనించిన జగ్గన్న వెంటనే సీఎం రేవంత్‌ను ఆకాశానికి ఎత్తేయడం ప్రారంభించారు. రేవంత్ సరైన నాయకుడని.. కేసీఆర్‌ను నిలువరించారని ఇలా.. పదే పదే చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ సంగారెడ్డిలో బాగానే ప్రచారం చేసి.. ఆ వీడియోలు.. ఫొటోలు ప్రధాన మీడియాలో వచ్చేలా చూసుకున్నారు. మొత్తానికి రేవంత్ కళ్లలో పడేందుకు బాగానే కష్టపడ్డారని టాక్. ఇక, ఇప్పుడు మరోసారి రేవంత్‌ను ఆకాశానికి ఎత్తేశారు.
మరో ఐదేళ్లు రేవంత్‌కు ఎలాంటి ఢోకా లేదని.. వ్యాఖ్యానించారు. వాస్తవానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జగ్గారెడ్డి.. ఇలా వ్యాఖ్యానించడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసినా.. ఆయన చాలా వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం అధికారిక పదవి అంటూ ఏమీ లేని నేపథ్యంలో వాటి కోసమే.. జగ్గారెడ్డి ప్రయత్నిస్తున్నారని.. ఈ క్రమంలోనే రేవంత్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారని చెబుతున్నారు. ``ఎన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రిని ఏమీ చేయలేరు. బీజేపీ నేతలు ప్రభుత్వాలను పడగొట్టడంలో ప్రొఫెసర్లు`` అని అనడం వెనుక.. పక్కాగా ఆయన కాకా పడుతున్నారని చెబుతున్నారు.
ప్రస్తుతం టీపీసీసీ పదవి ఖాళీ అవుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకునే జగ్గారెడ్డి రేవంత్‌ను కాకా పడుతున్నారని చెప్పేవారు పెరుగుతున్నారు. పోనీ.. ఇది దక్కక పోయినా..ఎమ్మెల్సీ అయినా ఆయన కోరుకుంటున్నారు. అయితే.. ఇప్పుడున్న పరిస్థతిలో ఈ రెండు స్థానాలకు కూడా పార్టీలో తీవ్రమైన పోటీ ఉంది. అందరూ..కూడా వీటి విషయంలో సీఎం రేవంత్ కీలకమని భావిస్తుండడం.. ఆయన కనుసన్నల్లోనే నియామకాలు జరగనున్నాయని భావిస్తున్న నేపథ్యంలో అందరికన్నా ముందు నేనే అన్నట్టుగా జగ్గారెడ్డి.. కాకా రాజకీయాలు ప్రారంభించారని అంటున్నారు పరిశీలకులు. మరి ఆయన ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.