Begin typing your search above and press return to search.

జగిత్యాల జిల్లాఅధికారి మెడలో నోట్ల దండ వేసి షాకిచ్చారు!

ఈ సందర్భంగా సదరు అధికారి అగ్రహానికి గురైన నేపథ్యంలో.. తమ మధ్య ఆయన లంచం అడిగిన ఆడియోక్లిప్పులు ఉన్నాయని చెప్పటమే కాదు.. వాటిని వినిపించిన వైనం సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   12 Dec 2023 6:12 AM GMT
జగిత్యాల జిల్లాఅధికారి మెడలో నోట్ల దండ వేసి షాకిచ్చారు!
X

ప్రభుత్వం ఇచ్చే జీతాన్ని అందుకుంటూనే.. చేయాల్సిన పని చేయకుండా లంచం ఆశించే అధికారులకు తగిన శాస్తి చేయాల్సిందే. తాజాగా జగిత్యాల జిల్లాలోని ఒక ముఖ్య అధికారికి తాజాగా ఒక చేదు అనుభవం ఎదురైంది. జగిత్యాల జిల్లా మత్స్యశాఖకు చెందిన అధికారి లంచం లేనిదే ఏ పని చేయనని భీష్మించుకుంటున్న వేళ.. అందరి ఎదుట ఆయన మెడలో కరెన్సీనోట్ల దండను వేయటం ద్వారా షాకిచ్చారు. ఈ సందర్భంగా సదరు అధికారి అగ్రహానికి గురైన నేపథ్యంలో.. తమ మధ్య ఆయన లంచం అడిగిన ఆడియోక్లిప్పులు ఉన్నాయని చెప్పటమే కాదు.. వాటిని వినిపించిన వైనం సంచలనంగా మారింది. వీటిని విన్న వారు.. సదరు అధికారికి తగిన శాస్తి జరిగిందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా మత్స్యశాఖకు చెందిన జిల్లా అధికారి దామోదర్ తాను చేయాల్సిన పనికి లంచాన్ని ఆశిస్తూ.. అది ఇస్తే తప్పించి పని చేయనని తేల్చి చెబుతున్నారట. ఈ నేపథ్యంలో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ వివిధ సొసైటీలకు చెందిన మత్స్యకారులతోకలిసి ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషాను కలిశారు. అధికారి దామోదర్ తీరుపై కంప్లైంట్ చేశారు.

జిల్లాకు చెందిన పలు సొసైటీలకు సంబంధించిన ఏపనిని అధికారి దామోదర్ చేయటం లేదని.. అంతేకాదు సహకార సంఘాల డైరెక్టర్లను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తాము ఫిర్యాదు చేసే సమయంలో అటుగా వచ్చిన అధికారి దామోదర్ మెడలో నోట్ల దండను వేయటంతో ఆయన షాక్ కు గురయ్యారు. తన మెడలో వేసిన నోట్ల దండను తీసి పడేసిన ఆయన.. తాను లంచం అడగలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తమ ఫోన్లలో ఉన్న వాయిస్ రికార్డుల్ని అందరికి వినిపించారు. అదే సమయంలో కిందపడేసిన నోట్ల దండను మరోసారి ఆయన మెడలో వేయటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమ మధ్య గొడవలు ఉన్నాయని.. అందుకే తనపై ఈ తీరులో ఆరోపణలు చేస్తున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. తన వాయిస్ ఉన్న ఆడియో క్లిప్ ల గురించి మాత్రం ఆయన మాట్లాడకపోవటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.