కెనడా ప్రధాని మీద అవిశ్వాస తీర్మానం
ఎందుకుంటే.. ఈ జగ్మీత్ సింగ్ ను ప్రసన్నం చేసుకోవటానికే భారత్ వ్యతిరేక వ్యాఖ్యలకు తెగబడ్డారు జస్టిన్ ట్రూడో.
By: Tupaki Desk | 21 Dec 2024 4:37 AM GMTఎవరీ జగ్మీత్ సింగ్? కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కు షాకివ్వటమా? ఆయన స్థాయి ఏంటి? సామర్థ్యం ఏమిటి? అన్న సందేహాలు అక్కర్లేదు. ఎందుకుంటే.. ఈ జగ్మీత్ సింగ్ ను ప్రసన్నం చేసుకోవటానికే భారత్ వ్యతిరేక వ్యాఖ్యలకు తెగబడ్డారు జస్టిన్ ట్రూడో. ఖలిస్థానీ మద్దతుదారు.. నేషనల్ డెమోక్రటిక్ పార్టీ నేతగా గుర్తింపు పొందిన ఆయన.. తనతో రాజీ పడేందుకు తహతహలాడే కెనడా ప్రధానికి తనదైన శైలిలో షాకిస్తూ.. ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేవ పెడతామని స్పష్టం చేశారు,
దీనికి సంబంధించిన ఒక లేఖను ఎక్స్ లో పోస్టు చేశారు. ప్రధానమంత్రిగా బాధ్యతల్ని నిర్వహించటంలో జస్టిన్ ట్రూడో ఫెయిల్ అయ్యారని.. ప్రజల కోసం ఆయన పని చేయటం లేదని మండిపడ్డారు. శక్తివంతుల కోసమే ఆయన పని చేస్తున్నారని పేర్కొన్న జగ్మీత్ సింగ్.. ‘‘ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎన్డీపీ సిద్ధంగా ఉంది. కెనడియన్లకు తమ కోసం పని చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశాన్ని కల్పిస్తాం. హౌస్ ఆఫ్ కామన్స్ తదుపరి సమావేశంలో అవిశ్వాస తీర్మానాన్ని ముందుకు తెస్తాం’’ అని స్పష్టం చేశారు.
జగ్మీత్ సింగ్ చెప్పినట్లు తాజాగా ప్రవేశ పెట్టే అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీల మద్దతు లభిస్తే.. తొమ్మిదేళ్ల ట్రూడో పాలన ముగిసిపోవటం ఖాయం. మరోవైపు కెనడా ఉప ప్రధానమంత్రి క్రిస్టియా ఫ్రిలాండ్ ఇటీవలే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ట్రూడో మంత్రివర్గంలో అత్యంత శక్తివంతురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. ఆమె సైతం ట్రూడో మీద విమర్శలు సంధించారు. ట్రూడో ప్రజాదరణ కోల్పోతున్నట్లుగా ఆరోపణలు చేసిన ఆమె.. ట్రూడో పదవీచ్యుతుడ్ని చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. అయితే.. ఆమె రాజీనామాకు ముందు ట్రూడో.. ఆమె నిర్వహిస్తున్న ఆర్థిక శాఖను మారుస్తున్నట్లుగా నిర్ణయం తీసుకోవటంతో ఆమె రాజీనామా ఇష్యూ తెర మీదకు వచ్చింది.
ఇప్పటికే ట్రూడో ప్రభుత్వం పట్ల కెనడియన్లు వ్యతిరేకంగా ఉన్నట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ సైతం కెనడాకు చరకులు అంటించటం తెలిసిందే. అమెరికా సరిహద్దుల్లో వలసలు.. డ్రగ్స్.. అక్రమరవాణాను కట్టడి చేయకుంటే టారిఫ్ లను పెంచేయటంతో పాటు అమెరికాలో 51వ రాష్ట్రంగా చేర్చాలన్న చురకలు అంటించటం తెలిసిందే.