జాహ్నవి కేసు... 18 విచారణలు- 14 కోట్లు - నో అరెస్టులు!
అవును... తెలుగమ్మాయి జాహ్నవి మరణంపై వెకిలిగా ప్రవర్తించిన డేనియల్ ఆడేరర్ కు సంబంధించి దారుణమైన ఫ్లాష్ బ్యాక్ వెలుగులోకి వచ్చింది.
By: Tupaki Desk | 20 Sep 2023 4:28 AM GMTఅమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతిపై పోలీసు అధికారి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆమె అనంతరం సీటెల్ పోలీసు అధికారి డేనియల్ ఆడెరర్ వీడియో తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆడెడార్ గతం అత్యంత ఘోరం అని తెలుస్తుంది.
అవును... తెలుగమ్మాయి జాహ్నవి మరణంపై వెకిలిగా ప్రవర్తించిన డేనియల్ ఆడేరర్ కు సంబంధించి దారుణమైన ఫ్లాష్ బ్యాక్ వెలుగులోకి వచ్చింది. ఈమేరకు సీటెల్ ఆధారిత పోలీస్ వాచ్ డాగ్ గ్రూప్ అయిన డైవెస్ట్ ఎస్పీడీ.. ఆ అధికారికి జాతి హింస చరిత్ర ఉందని ఆరోపించింది. ఇదే సమయంలో ఆ పోలీస్ అధికారి పాల్పడిన ఘోరాలకు సంబంధించిన వివరాలు వెల్లడించింది.
ఇందులో భాగంగా... 2010లో ఇద్దరు మెక్సికన్ వలసదారులను చట్టవిరుద్ధంగా ఆపడం, వేధించడం, హింసాత్మకంగా అరెస్టు చేయడంతో సహా 2014 నుండి సీటెల్ లోని ఆఫీస్ ఆఫ్ పబ్లిక్ అకౌంటబిలిటీ (ఓపీయే) ద్వారా ఆడెరర్ సుమారు పద్దెనిమిది కేసుల్లో విచారణను ఎదుర్కొన్నాడని తెలిపింది!
ఈ సందర్భంగా మాట్లాడిన డైవెస్ట్ ఎస్పీడీ... 2010లో ఆడెరర్ తో పాటు ఇతర అధికారులు కొంతమంది ఒక మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని శాశ్వతంగా మెదడు దెబ్బతీసే స్థాయికి కొట్టారని తెలిపారు. ఇదే క్రమంలో... 2016లో అరెస్టుల సమయంలో మహిళలపై బలప్రయోగం చేసినందుకు ఆడెరర్ ను ఓపీయే రెండుసార్లు విచారించిందని వెల్లడించారు.
ఇదే క్రమంలో... చట్టవిరుద్ధమైన ఆఫ్ డ్యూటీ అరెస్ట్ లు చేసినందుకు అతన్ని నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు సంస్థ తెలిపింది. 2017లో ఆడెరర్ సీటెల్ లోని హార్బర్ వ్యూ హాస్పిటల్ లోని అత్యవసర గదిలో నిరాశ్రయులైన వ్యక్తిని కొట్టాడనే కేసు కూడా అతనిపై ఉందని తెలిపింది.
దీంతో... ఈ కేసుల వ్యాజ్యాల కారణంగా నగరానికి 1.7 మిలియన్ డాలర్లు (రూ. 14.10 కోట్లకు పైగా) నష్టం వాటిల్లిందని డైవెస్ట్ ఎస్పీడీ వారి పోస్ట్ లలో తెలిపారు.
కాగా... తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతిపై పోలీసు అధికారి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సియాటెల్ మేయర్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. డేనియల్ అడెరర్ చేసిన వ్యాఖ్యలకు గాను భారతీయ సమాజానికి మేయర్ బ్రూస్ హారెల్ క్షమాపణలు చెప్పారు. జాహ్నవి మృతి పట్ల సియాటెల్ పోలీస్ చీఫ్ ఆడ్రియన్ డియాజ్ కూడా సంతాపం ప్రకటించారు.