జాహ్నవి కందుల మృతి కేసు.. సమీక్ష కోరిన భారత్!
అవును... కందుల జాహ్నవి మృతి విషయంలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో సియాటెల్ లోని భారత రాయబార కార్యాలయం తాజాగా ఆన్ లైన్ వేదికగా స్పందించింది.
By: Tupaki Desk | 24 Feb 2024 8:53 AM GMTఅమెరికాలో ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల మృతి, తదనంతర పరిణామాలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆమె ప్రమాదం జరిగిన సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు, చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఇదే సమయంలో ఇటీవల జాహ్నవి మృతికి కారణమైన పోలీసు అధికారి కెవిన్ డవేపై నేరాభియోగాలు మోపడం లేదని అక్కడి అధికారులు వెల్లడించారు.
దీంతో ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. ఇటీవల ఈ విషయంపై స్పందించిన కేటీఆర్.. ఆమె మృతి ఒక విషాదమైతే.. తాజాగా విన్న వార్త అంతకు మించిన విషాదం అని అన్నారు. ఇదే సమయంలో ఈ విషయంపై ఇండియన్ ఎంబసీ స్పందించాలని కోరారు. ఈ సమయంలో సియాటేల్ భారత రాయబార కార్యాలయం అమెరికా ప్రభుత్వాన్ని రివ్యూ కోరింది.
అవును... కందుల జాహ్నవి మృతి విషయంలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో సియాటెల్ లోని భారత రాయబార కార్యాలయం తాజాగా ఆన్ లైన్ వేదికగా స్పందించింది. ఇందులో భాగంగా... జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని.. తగిన పరిష్కారం కోసం స్థానిక అధికారులు, సియాటెల్ పోలీసుల వద్ద గట్టిగా లేవనెత్తామని వెల్లడించింది.
ఇదే సమయంలో ఈ కేసుకు సంబంధించి రివ్యూ కోసం సియాటెల్ అటార్నీ కార్యాలయానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే అని చెప్పిన ఎంబసీ... దర్యాప్తు నివేదిక కోసం వేచిచూస్తున్నట్లు వెల్లడించింది. ఈ విషయంలో సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.
కాగా... కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి (23) గత ఏడాది జనవరిలో సియాటెల్ లోని పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ సమయలో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కెవిన్ డవేపై అభియోగాలు మోపడం లేదంటూ కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ ఆఫీస్ రెండురోజుల క్రితం ప్రకటించింది. దీంతో ఈ విషయంపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తాయి.
ఇదే సమయంలో జాహ్నవి మృతి పట్ల చులకనగా మాట్లాడిన మరో పోలీసు అధికారి డేనియల్ అడెరెర్ పై స్పందించిన కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ అటార్నీ... ప్రమాదం జరిగిన సమయంలో అతడు అక్కడ లేడని తెలిపారు. అయితే... చులకనగా మాట్లాడినందుకు అతడిపై ఇప్పటికే సస్పెన్షన్ వేటుపడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తుది విచారణ మార్చి 4న జరగనుంది.