Begin typing your search above and press return to search.

అదంతా పాకిస్తాన్ కర్మ... గట్టిగా తగులుకున్న భారత్!

కాగా శుక్రవారం షరీఫ్ తన ప్రసంగంలో... జమ్మూకశ్మీర్ లోని పరిస్థితిని పాలస్తీనాతో పోల్చిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 Sep 2024 3:49 AM GMT
అదంతా పాకిస్తాన్  కర్మ... గట్టిగా తగులుకున్న భారత్!
X

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సమావేశంలో ప్రసంగించిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. కశ్మీర్ లో పరిస్థితిని పాలస్తీనాతో పోల్చిన సంగతి తెలిసిందే. దీనిపై మన దౌత్యవేత్త భవికా మంగళానందన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సమయంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరింత స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు.

అవును... ఐరాస జనరల్ అసెంబ్లీ తాజా సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ పై దుమ్మెత్తిపోశారు. ఇందులో భాగంగా... పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి ప్రపంచాన్ని నిందించకూడదని.. ఇది దాని కర్మ మాత్రమే అని నొక్కి చెప్పారు. దాని సీమాంతర ఉగ్రవాదం ఎప్పటికీ విజయవంతం కాదని అన్నారు.

ఈ ఫోరమ్ నుంచి ఓ విచిత్రమైన వాదనలు విన్నాము.. భారత్ వైఖరిని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము.. సరిహద్దు ఉగ్రవాదం, పాకిస్తాన్ విధానం ఎప్పటికీ విజయవంతం కాదు.. దానికి విరుద్ధంగా చర్యలు కచ్చితంగా ఉంటాయి.. తీవ్ర పరిణామాలు ఉంటాయి అని జైశంకర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఇదే సమయంలో తమ మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్య పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగాన్ని విడిచిపెట్టడం, ఉగ్రవాదంతో వారి దీర్ఘకాల అనుబంధాన్ని దూరం పెట్టడం మాత్రమే అని స్పష్టం చేసారు.

కాగా శుక్రవారం షరీఫ్ తన ప్రసంగంలో... జమ్మూకశ్మీర్ లోని పరిస్థితిని పాలస్తీనాతో పోల్చిన సంగతి తెలిసిందే. ప్రజలు తమ స్వేచ్ఛ కోసం ఒక శతాబ్ధంపాటు పోరాడారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఆర్టికల్ 370 రద్దును భారత్ వెనక్కి తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ వ్యాఖ్యలపై భారత దౌత్యవేత్త భవికా మంగళానందన్ ఇదే వేదికపై గట్టిగా స్పందించారు. ప్రపంచానికి తెలిసినట్లుగా పాక్ చాలా కాలంగా సరిహద్దు ఉగ్రవాదాన్ని పొరుగుదేశాలపై ఆయుధంగా ఉపయోగించుకుంటోందని తెలిపారు.

భారత పార్లమెంటు, ముంబై మార్కెట్ ప్లేసు, తీర్థయాత్రల మార్గాలపై దాడి చేసిన పాక్.. హింస గురించి మాట్లాడటం అత్యంత నీచమైన వంచన అని ఆమె ఫైర్ అయ్యారు.