Begin typing your search above and press return to search.

ఇదేందిది.. జీతాలు పెంచారని యజమానులకు జైలు!

అయితే ధరలు పెరుగుతున్న వేళ జీతాలు పెంచితే సమాజంలో అస్థిరత ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే జీతాలు పెంచిన షాపింగ్‌ మాల్స్‌ యజమానులను అరెస్టు చేసిందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   3 July 2024 1:30 PM GMT
ఇదేందిది.. జీతాలు పెంచారని యజమానులకు జైలు!
X

నియంతల పాలనలో మగ్గిపోయే దేశం అనగానే మనకు ఉత్తర కొరియా మాత్రమే గుర్తు వస్తోంది. అయితే మనదేశం పక్కనే ఇంకో దేశం కూడా ఇలాగే సైనిక నియంతల పాలనలో ఉంది. అదే బర్మా అని పిలుచుకునే మయన్మార్‌. అక్కడ అంగసూన్‌ సూకీ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసిన సైనిక జుంటా నియంతలు పాలనను చెరపట్టారు. అంగసూన్‌ సూకీని గృహనిర్భందం చేశారు. ప్రజలకు మానవ హక్కులు, స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు అనేవి కల్లోని మాటే.

అంగసాన్‌ సూకీ ప్రభుత్వాన్ని 2021లో కూలదోసినప్పటి నుంచి మయన్మార్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. నిత్యావసర ధరలు పెరుగుదల, ఇతరత్రా సమస్యలతో ప్రజలు చుక్కలు చూస్తున్నారు. సైనిక నియంతల పాలనలో మయన్మార్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సైన్యం ప్రవేశపెట్టిన కఠిన చట్టాలు ప్రజలను ఊపిరిసలపనీయడం లేదు.

అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాల మాటలను కూడా సైనిక పాలకులు పట్టించుకోవడం లేదు. మనతో సరిహద్దులు పంచుకుంటున్న కారణంగా, ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిభద్రతల రీత్యా మయన్మార్‌ తో ఎలాంటి పేచీ పెట్టుకునే పరిస్థితుల్లో భారత్‌ లేదు. ఇంకోవైపు మయన్మార్‌ తో సరిహద్దులు పంచుకుంటున్న చైనా ఆ దేశానికి భారీ ఎత్తున మద్దతు అందజేస్తోంది.

దీంతో సైనిక పాలకుల ఉన్మాదం పరాకాష్టకు చేరింది. ఈ సైనిక పాలకుల ఉన్మాదం ఏ స్థాయికి చేరిందంటే తాజాగా ఉద్యోగులకు జీతాలు పెంచారనే కారణంతో కొంతమంది షాపింగ్‌ మాల్స్‌ యజమానులపై విరుచుకుపడింది. వారిని అక్కడి సైనిక ప్రభుత్వం ౖజñ ళ్లలో బంధించింది.

ఓవైపు మయన్మార్‌ లో ద్రవ్యోల్బణం పెరుగుతుంటే షాపింగ్‌ మాల్స్‌ యజమానులు తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు జీతాలు పెంచడాన్ని సైనిక ప్రభుత్వం పెద్ద నేరంగా పరిగణించింది.

ఇప్పటివరకు ఇలా ఆ దేశవ్యాప్తంగా కనీసం 10 మంది యజమానులను సైనిక ప్రభుత్వం జైలుపాలు చేసింది. అంతేకాకుండా వారికి మూడేళ్ల జైలుశిక్ష విధించింది. అంతటితో సైనికుల పాలకుల దాష్టీకాలు ఆగలేదు. షాపింగ్‌ మాల్స్‌ ను కూడా మూసివేయించింది.

వాస్తవానికి మయన్మార్‌ లో జీతాల పెంచడం తప్పు ఏమీ కాదు. అయితే ధరలు పెరుగుతున్న వేళ జీతాలు పెంచితే సమాజంలో అస్థిరత ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే జీతాలు పెంచిన షాపింగ్‌ మాల్స్‌ యజమానులను అరెస్టు చేసిందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయా షాపింగ్‌ మాల్స్‌ కు అతికించిన నోటీసుల్లో పేర్కొంది.