Begin typing your search above and press return to search.

జైలు పిలుస్తోంది...ప్రత్యర్ధులకు అదే దారి ?

రాజకీయాలు ఒకప్పటిలా అయితే అసలు లేవు అనే చెప్పాలి. ఒకపుడు హుందాగా రాజకీయాలు సాగేవి.

By:  Tupaki Desk   |   3 Aug 2024 3:37 AM GMT
జైలు పిలుస్తోంది...ప్రత్యర్ధులకు అదే దారి ?
X

రాజకీయాలు ఒకప్పటిలా అయితే అసలు లేవు అనే చెప్పాలి. ఒకపుడు హుందాగా రాజకీయాలు సాగేవి. దేశమంతా తనకు ఎదురులేదని పించుకుని తొలి ప్రధానిగా అత్యంత బలోపేతమైన నేతగా నెహ్రూ పాలిస్తున్న రోజులు అవి. 1955లో రెండవ సార్వత్రిక ఎన్నికలు జరిగినపుడు జనసంఘ్ నుంచి ఒక యువకుడు గెలిచి తొలిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఆయనే అటల్ బిహారీ వాజ్ పేయ్.

యువ వాజ్ పేయ్ అప్పటి నెహ్రూ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఉండేవారు. ఆనాడు పార్లమెంట్ లో జనసంఘ్ బలం ఇద్దరు ఎంపీలు మాత్రమే అని చెబుతారు. అయినా సరే పార్లమెంట్ లో వాజ్ పేయ్ మాట్లాడేందుకు సమయమూ ఇచ్చేవారు. నెహ్రూని విమర్శించినా ఆయన చిరునవ్వుతో వాటిని తీసుకుని ఎలాంటి భేషజం లేకుండా సభలో వాజ్ పేయ్ ప్రశ్నలకు జవాబు కూడా చెప్పేవారు.

ఇదంతా ఎందుకు అంటే అంతటి గొప్ప సంప్రదాయం ఉన్న మన చట్ట సభలు నేడు ఎలా మారుతున్నాయా అన్న దాని గురించే. ప్రత్యర్థులను చీల్చి చెండాడడం అన్నది ఇందిరా గాంధీ శకం నుంచి మొదలైంది. అది ఇపుడు పీక్స్ కి చేరుకుంది. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నిస్తే చాలు కేంద్రం ఆధీనంలో ఉన్న వ్యవస్థలు వస్తాయని విపక్షాలు ఒకనాడు ఆగ్రహంతో ఊగిపోతూ అంటూండేవారు.

ఇపుడు సరదాగా సెటైరికల్ గా మాట్లాడుతున్నారు. తాను బడ్జెట్ మీద తాజాగా చేసిన ప్రసంగానికి సంబంధించిన ప్రభావం తన మీద తప్పకుండా పడుతుందని ఈడీ వంటి సంస్థలు తన ఇంటికి రావచ్చు అని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తాజాగా చేసిన ట్వీట్ ఆలోచింపచేస్తోంది. తాను అలా వచ్చిన ఈడీ అధికారులను చాయ్ బిస్కెట్లతో ఆహ్వానం పలుకుతాను అని ఆయన సెటైర్లు వేశారు.

కట్ చేస్తే కర్నాటకకు చెందిన బలమైన కాంగ్రెస్ నేత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తనను ఎపుడైనా అరెస్ట్ చేసి జైలులో పెట్టవచ్చు అని మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా మీద కుట్ర జరుగుతోందని నన్ను అవినీతి పితామహుడు అంటున్నారు. నేను ఏ అవినీతి చేయలేదు అని డీకే గట్టిగా చెప్పారు. ఇక నేను ఎలాంటి పరిణామాలు అయినా ఎదుర్కోవడానికి రెడీ అని కూడా చెప్పారు.

ఇంకాస్తా వెనక్కి వెళ్తే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయి నెలల తరబడి జైలు గోడల మధ్యన గడుపుతున్నారు. ఆయన నేను ఏ తప్పూ చేయలేదని అంటున్నారు. బెయిల్ కూడా రాకుండా ఎందుకు చేస్తున్నారు అన్న చర్చ కూడా నడుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాలకి వస్తే తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ అయ్యారు. నెలల నుంచి జైలులో ఉంటున్నారు.

బీఆర్ఎస్ నేతలు కూడా అరెస్ట్ అవుతారు అని హెచ్చరికలూ వినిపిస్తునాయి. ఏపీలో చూస్తే వైసీపీ ఏలుబడిలో ఎంతో మంది టీడీపీ నేతలు అరెస్ట్ అయి జైలుకు వెళ్ళి వచ్చారు. ఆఖరుకు జీవితంలో ఎన్నడూ కోర్టు మెట్లు ఎక్కని చంద్రబాబూ ఆ అనుభవం చూశారు. యాభై మూడు రోజులు జైలులో ఉన్నారు.

ఇపుడు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. అటు నుంచి ఇటు సీన్ మారుతుందని అంటున్నారు. జగన్ అయినా ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందే అని కూటమి మంత్రులు హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ చూస్తూంటే అధికారంలో ఉన్న వారు ప్రత్యర్ధులకు జైలు దారినే చూపిస్తున్నారు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కానీ ఒకరిని ఒకరు నాశనం చేసుకునేందుకు ప్రయత్నం చేయడం అది చివరికి జైలు గోడల దాకా కధ నడిచేలా సాగడం చూస్తూంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న చర్చ అయితే సాగుతోంది.

తప్పు చేస్తే ఎవరిని అయినా వదలకూడదు, అది కూడా చట్ట ప్రకారం అన్ని ఆధారాలతో అరెస్ట్ చేసి జైలులో పెడితే ప్రజలు సైతం హర్షిస్తారు. అలా కాకుండా తమ వైపు ఉంటే బ్యాంకులను ఎగవేత వేసిన వారు సైతం పునీతులే అవినీతి చక్రవర్తులు సైతం ఏమీ కారని భరోసా ఇస్తూ తమను కాదన్న వారిని మాత్రం వెతికి వెంటాడి జైలు దారి చూపించడం అంటే ఎలా దీనిని అర్ధం చేసుకోవాలో తెలియడం లేదని మేధావులు ప్రజా సంఘాన నేతలు అంటున్నారు. రాజకీయ అసహనం నానాటికీ పెరిగిపోతే మాత్రం అది చివరికి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని కూడా దేశ హితైషుల నుంచి హెచ్చరిక వస్తోంది.