ఔను.. చైతన్యరెడ్డి వచ్చింది నిజమే.. దస్తగిరి కేసులో సంచలన విషయాలు
వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవరుగా మారిన దస్తగిరిని జైలులో బెదిరించిన కేసులో సంచలన విషయాలు వెలుగుచూసినట్లు సమాచారం.
By: Tupaki Desk | 17 Feb 2025 9:45 AM GMTవైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవరుగా మారిన దస్తగిరిని జైలులో బెదిరించిన కేసులో సంచలన విషయాలు వెలుగుచూసినట్లు సమాచారం. దస్తగిరి ఫిర్యాదు మేరకు ప్రభుత్వ ఆదేశాలతో కడప జైలులో విచారణ జరిపిన రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ సుమారు 30 మంది సాక్షులను విచారించినట్లు సమాచారం. కడప జైలులో రెండు రోజులు విచారణ అనంతరం, ఇతర సాక్ష్యుల వాంగ్మూలాలను నమోదు చేసుకున్న విచారణాధికారి నేడో రేపో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.
వివేకా కేసులో అప్రూవర్ దస్తగిరిని వేరే కేసులో 2023లో పోలీసులు అరెస్టు చేశారు. 2023 అక్టోబరు నుంచి 2024 ఫిబ్రవరి వరకు దస్తగిరి రిమాండ్ ఖైదీగా కడప జైలులో ఉన్నారు. అయితే 2023 నవంబర్ 28న సాయంత్రం జైలులో వైద్య శిబిరం నిర్వహించడానికి వచ్చిన డాక్టర్ చైతన్యరెడ్డి దస్తగిరిని బెదిరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వివేకా హత్యకేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడైన డాక్టర్ చైతన్యరెడ్డి కడప జైలులో దస్తగిరి బ్యారక్ లో ప్రవేశించి బెదిరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
ఈ విషయమై అప్పట్లోనే దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం దస్తగిరి ఆరోపణలకు ప్రాధాన్యమివ్వలేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో దస్తగిరి ఫిర్యాదు మళ్లీ తెరపైకి వచ్చింది. వివేకా హత్య కేసులో నిందితులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ చైతన్యరెడ్డి తనను బెదిరించారని దస్తగిరి ఆరోపిస్తున్నాడు. నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తే రూ.20 కోట్లు ఇస్తామన్నారని, లేదంటే చంపేస్తామని బెదిరించినట్లు దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చైతన్యరెడ్డితోపాటు అప్పటి కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్, డీఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్యలపై దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వీరు నలుగురిపై పులివెందుల పోలీసుస్టేషనులో కేసు నమోదు చేసి కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఇక కేసును చాలెంజింగ్ తీసుకున్న ప్రభుత్వం రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ్ ను విచారణాధికారిగా నియమించింది.
ప్రభుత్వ ఆదేశాలతో బాధితులు, బాధ్యులుతోపాటు అనుమానితులు, ఖైదీల వాంగ్మూలాలను విచారణాధికారి రాహుల్ శ్రీరామ సేకరించారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విచారణలో ఎక్కువ మంది జైలులో దస్తగిరి ఉన్న బ్యారెక్ లోకి డాక్టర్ చైతన్య రెడ్డి వెళ్లడం చూశామని చెప్పినట్లు సమాచారం. ప్రధానంగా ఆ సమయంలో జైలులోనే ఉన్న పులివెందుల టీడీపీ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆన్ లైన్ లో తన వాంగ్మూలం సమర్పించారని సమాచారం. దస్తగిరి బ్యారక్ ఎదురుగా తనను వేరే బ్యారెక్ లో ఉంచారని, వైద్య శిబిరం పేరిట జైలుకు వచ్చిన డాక్టర్ చైతన్యరెడ్డి దస్తగిరి ఉన్న బ్యారెక్ లోకి వెళ్లడాన్ని తాను చూసినట్లు బీటెక్ రవి వాంగ్మూలమిచ్చారు.
ఇక ఈ వ్యవహారంలో దస్తగిరితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ చైతన్యరెడ్డి, జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్ లను విచారణాధికారి విడివిడిగా ప్రశ్నించారని సమాచారం. దస్తగిరి తన ఆరోపణలకు కట్టుబడి ఉండటమే కాకుండా, పలు కీలక ఆధారాలు సమర్పించినట్లు చెబుతున్నారు. ఇక అప్పట్లో దస్తగిరి బ్యారెక్ భద్రతాధికారిగా పనిచేసిన జైలు సూపరింటెండెంట్ కూడా చైతన్యరెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చినట్లు చెబుతున్నారు. మరోవైపు కొందరు జైలు సిబ్బంది మాత్రం ఆ సమయంలో ఏం జరిగిందో తమకు తెలియదని, చైతన్యరెడ్డి బెదిరించినట్లు తమకు తెలియదని వాంగ్మూలమిచ్చినట్లు చెబుతున్నారు.
ఇక జైలులో ఉన్న డాక్టర్లు, నర్సులు, ఖైదీలను సైతం విచారణాధికారి రాహుల్ శ్రీరామ్ ప్రశ్నించారు. వీరిలో చాలా మంది దస్తగిరి బ్యారక్ లోకి చైతన్యరెడ్డి వెళ్లిన విషయాన్ని ధ్రువీకరించినట్లు చెబుతున్నారు. అదేవిధంగా డాక్టర్ చైతన్యరెడ్డితోపాటు వైద్య శిబిరం నిర్వహణకు వెళ్లిన మరో డాక్టర్ రామాంజులరెడ్డిని సైతం ప్రశ్నించారు. ఇలా మొత్తం 30 మంది నుంచి వాంగ్మూలం తీసుకున్న సూపరింటెండెంట్ తన నివేదికను సిద్ధం చేశారని చెబుతున్నారు. ఈ నివేదిక ప్రభుత్వానికి అందగానే ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.