హిందుజా కుటుంబ సభ్యులు నలుగురికి జైలు శిక్ష!
ఈ సమయంలో నాలుగు నుంచి నాలుగున్నర ఏళ్లపాటు జైలు శిక్ష పడిన వారిలో ప్రకాశ్ హిందుజా, ఆయన భార్య కమల్, కుమారుడు అజయ్, కోడలు నమ్రత ఉన్నారు.
By: Tupaki Desk | 22 Jun 2024 4:22 AM GMTఇంట్లో పనిచేస్తున్న వారి విషయంలో నిరంకుసత్వంగా, అమానవీయంగా ప్రవర్తించారంటూ హిందుజా గ్రూపు కుటుంబ సభ్యులపై ఇటీవల సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం తీవ్ర సంచలనమైంది. ఈ సమయంలో ఆ కుటుంబ సభ్యులపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సమయంలో వారి విషయంలో స్విట్జర్లాండ్ లోని జెనీవ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
అవును... ఇంటిపనివారికి తక్కువ వేతనాలు ఇవ్వడంతో పాటుగా వారిని మానసికంగా, శారీరంగా వేధింపులకు గురిచేశారనే విషయాలు తీవ్ర వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. నిరక్షరాస్యులైన భారతీయులను తీసుకొచ్చి జెనీవాలోని తమ విలాసవంతమైన విల్లాలో పనివారిగా నియమించుకుని, వారి పాస్ పోర్టులను తీసేసుకున్నారంటూ తీవ్ర ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ సమయంలో వ్యవహారం కోర్టుకు చేరింది.
దీంతో... భారతీయ మూలాలున్న సంపన్న హిందూజా గ్రూపు కుటుంబ సభ్యులు నలుగురికి స్విట్జర్లాండ్ లోని జెనీవా కోర్టు జైలు శిక్ష విధించింది. ఇంటిపనివారికి తక్కువ వేతనాలు ఇవ్వడంతోపాటు, వారితో రోజుకు 18 గంటలు పనిచేయించుకోవడం, తగు విశ్రాంతి ఇవ్వకుండా వేధించడం వంటివి చేస్తున్నారని ప్రాసిక్యూషన్ బలంగా వాదించిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
ఈ సమయంలో నాలుగు నుంచి నాలుగున్నర ఏళ్లపాటు జైలు శిక్ష పడిన వారిలో ప్రకాశ్ హిందుజా, ఆయన భార్య కమల్, కుమారుడు అజయ్, కోడలు నమ్రత ఉన్నారు. భారత్ నుంచి రప్పించుకున్న పనివారిని వేధించడంతోపాటు.. వారి జీతాలు స్విస్ కరెన్సీలో కాకుండా ఇండియన్ రూపీస్ ల్లో చెల్లిస్తున్నారని.. అది కూడా పనివారి చేతికి ఇవ్వకుండా భారత్ లోని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నారని తెలిపింది.
రోజుకి 18 గంటలు పనిచేయించుకోవడంతోపాటు విల్లాను వదిలి బయటకు వెళ్లటానికి అనుమతించకపొవడం చేస్తున్నారనే నేరారోపణలు ఉన్నాయి! ఈ క్రమంలోనే అన్ని విషయాల్లోనూ వీరు స్విట్జర్లాండ్ చట్టాలను ఉల్లంఘించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అయితే... ఈ తీర్పు వెలువడే సమయంలో నిందితులు నలుగురూ కోర్టులో లేరు. ఆ సమయంలో వారి తరుపున వారి మేనేజర్ ఒకరు మాత్రమే హాజరయ్యారు.