Begin typing your search above and press return to search.

భగ్గుమన్న జైనూరు.. అసలేమైంది?

అత్యంత సున్నితమైన ప్రాంతంగా అభివర్ణించే ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని అత్యంత సున్నిత ప్రాంతం మరోసారి భగ్గుమంది.

By:  Tupaki Desk   |   5 Sep 2024 4:59 AM GMT
భగ్గుమన్న జైనూరు.. అసలేమైంది?
X

అత్యంత సున్నితమైన ప్రాంతంగా అభివర్ణించే ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని అత్యంత సున్నిత ప్రాంతం మరోసారి భగ్గుమంది. ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ.. ఆందోళనతో హింసాత్మకంగామారింది. కుమ్రరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలానికి చెందిన ఒక ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారయత్నం.. దాడి ఘటన ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ప్రధాన మీడియా సంస్థలు అందించిన సమాచారం ప్రకారం అక్కడ అసలేం జరిగింది? ప్రస్తుతం ఆ ప్రాంతం ఎలా ఉంది? బాధితురాలి పరిస్థితి ఏమిటి? లాంటి వివరాల్లోకి వెళితే..

జైనూరు మండలానికి చెందిన ఆదివాసీ మహిళ ఆగస్టు 31న సిర్పూరు (యూ) మండలంలోని తల్లి ఇంటికి నడుచుకుంటూ వెళుతోంది. సోనుపటేల్ గూడకు చెందిన నిందితుడు ఆమెను తన ఆటోలో ఎక్కించుకున్నాడు. రాఘాపూర్ దాటిన తర్వాత అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించటంతో దాడి చేసి చితకబాదాడు. దీంతో ఆ మహిళ స్ప్రహ కోల్పోయింది. ఆమె చనిపోయిందని భావించిన నిందితుడు.. ప్రమాదం జరిగినట్లుగా ఆ మహిళను రోడ్డు మీద పడేసి పరారయ్యాడు.

ఆ రహదారి మీదుగా వెళ్లే వాళ్లు ఆమెను ఆదిలాబాద్ లోని రిమ్స్ కు తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అందరూ ఆమె ప్రమాదానికి గురైందనే భావించారు.అయితే.. బాధితురాలు ఎప్పుడైతే స్ప్రహలోకి వచ్చి.. తన మీద అత్యాచారయత్నం జరిగిందని.. దాడి జరిగిందన్న విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఈ నెల ఒకటో తేదీన కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ సంఘాలు మంగళవారం జైనూరులో ఆందోళనకు దిగి.. బుధవారం ఏజెన్సీ బంద్ కు పిలుపునిచ్చారు.

ఈ బంద్ కు సంపూర్ణ మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో జైనూరు మండల కేంద్రానికి తరలి వచ్చిన వేలాది మంది ఆదివాసీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిందితుడి ఇంటిని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఆ తర్వాత.. అతడ్ని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని ఆందోళన చేపట్టారు. అనంతరం ఆదివాసీలు మండల కేంద్రంలోని ఒక వర్గానికి చెందిన దుకాణ సముదాయంలోని పాన్ షాప్ లోని సామాగ్రిని రోడ్డుపైకి తీసుకొచ్చి నిప్పు అంటించారు.

దీంతో.. సదరు వర్గం వారు ఆందోళనకు దిగారు. వారు కొన్ని దుకాణాల్ని ధ్వంసం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దింపాల్సి వచ్చింది. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో నిఘా విభాగం ఫెయిల్ అయినట్లుగా చెబుతున్నారు. పరిస్థితిని అంచనా వేయటంలో వారు విఫలమైనట్లుగా సమాచారం. జైనూరులో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ముందస్తు జాగ్రత్తగా జిల్లా యంత్రాంగం స్థానికంగా 144వ సెక్షన్ ను విధించింది. సోషల్ మీడియాలో వదంతుల్ని ప్రచారం చేయకుండా ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు. పోలీస్ పికెటింగ్ లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక బలగాల్ని మొహరించారు. దాదాపు వెయ్యి మంది వరకు బలగాల్ని రంగంలోకి దింపి.. శాంతిభద్రతలను నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. గాంధీలో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను తాజాగా మంత్రి సీతక్క పరామర్శించారు. ఆమెకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారని.. అతడికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. ఇదిలా ఉంటే ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం అమానుషమని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ కు ఫోన్ చేసిన సంజయ్ జైనూరులో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులపై ఆరా తీశారు. నిందితుడిపై చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ ప్రశ్నించటం గమనార్హం.

ఇదిలా ఉండగా.. గతంలోనూ కొన్ని ఉదంతాలు జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏప్రిల్ లోనూ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని.. ఈ సందర్భంగా వారం పాటు బంద్ నిర్వహించిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. 2018లోనూ ఇరు వరగాల మధ్య ఘర్షణలు ఈ ప్రాంతంలో చోటు చేసుకున్నాయి. అప్పటి ఎస్పీ.. కలెక్టర్ లు నెల రోజుల పాటు స్థానిక ప్రజలతో మమేకమై.. ఇక్కడే ఉండి పరిస్థితుల్ని చక్కబెట్టిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు.తాజా ఉదంతం నేపథ్యంలో పోలీసు వర్గాలు మరింతగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.