Begin typing your search above and press return to search.

పాక్ లో మార్నింగ్ వాక్.. మీటింగ్ లో అటాక్.. దటీజ్ జైశంకర్

అది పాశ్చాత్య దేశాలపై కౌంటర్ అయినా పాకిస్థాన్ పై అటాక్ అయినా ఆయనే భారత విదేశాంగ మంత్రి జైశంకర్.

By:  Tupaki Desk   |   16 Oct 2024 10:16 AM GMT
పాక్ లో మార్నింగ్ వాక్.. మీటింగ్ లో అటాక్.. దటీజ్ జైశంకర్
X

ఆయనంతే.. ఎక్కడైనా ముక్కుసూటే.. ఆయన చెప్పేది అవతలి వారికి మెత్తగానే అయినా గట్టిగా తగులుతుంది. అది పాశ్చాత్య దేశాలపై కౌంటర్ అయినా.. పాకిస్థాన్ పై అటాక్ అయినా.. ఆయనే భారత విదేశాంగ మంత్రి జైశంకర్. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ (ఎస్సీవో) సదస్సులో

పాల్గొనడానికి పాకిస్థాన్ వెళ్లిన ఆయన వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత పాకిస్థాన్ లో కాలుపెట్టిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కావడం గమనార్హం. ఇక 2015లో చివరిసారిగా దివంతగ సుష్మా స్వరాజ్ పాకిస్థాన్ పర్యటనకు వెళ్లారు. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాకిస్థాన్ లో భారత మంత్రి ఒకరు పర్యటిస్తారా? అనే సందేహాలు నెలకొన్నాయి. కానీ, జైశంకర్ ను కీలక సమావేశానికి పంపింది మోదీ ప్రభుత్వం.

పాక్ గడ్డపై కాలినడక

ఒకప్పుడు అవిభాజ్య భారత దేశంలో కలిసి ఉన్న పాకిస్థాన్ దేశ విభజన తర్వాత మనుకు ప్రధాన శత్రువుగా మారిపోయింది. అలాంటి పాక్ లో అడుగుపెట్టిన జై శంకర్ బుధవారం ఎక్స్ లో ఓ ఫొటో పెట్టారు. ఇస్లామాబాద్ లో ఆయన మార్నింగ్ వాక్ చేస్తున్న ఫొటో అది. “మా (భారత) హైకమిషన్ ప్రాంగణంలో భారత్-పాక్ దేశాల సహచరులతో మార్నింగ్ వాక్” అంటూ దానికి రైటప్ ఇచ్చారు. ఎస్సీవో సమ్మిట్ కోసం మంగళవారమే పాక్ వెళ్లిన జై శంకర్ బుధవారం పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా పాల్గొన్న ఇస్లామాబాద్ లోని జిన్నా కన్వెన్షన్ సెంటర్‌లో ప్రసంగించారు. కాగా,

భారత్, చైనా, రష్యా, బెలారస్, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ తదితర దేశాలు ఎస్సీవో కూటమిగా ఏర్పడ్డాయి. ఇస్లామాబాద్ భేటీలో ఇరాన్ మొదటి ఉపాధ్యక్షుడు, మంగోలియా ప్రధాని పాల్గొంటున్నారు.

షాబాజ్ తో మాట.. ఆపై చురక

షాంఘై సహకార సంస్థ సదస్సుకు వెళ్లిన జైశంకర్‌ పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తో మాట కలిపారు. అదీ కొద్దిసేపే. అయితే, ఇది పాక్‌ ప్రధాని మంగళవారం రాత్రి ఇచ్చిన అధికారిక విందులోనే. జైశంకర్, షాబాజ్‌ లు షేక్ హ్యాండ్ చేసుకున్నారు. కాగా, బుధవారం సదస్సులో మాట్లాడుతూ.. పాకిస్థాన్ గడ్డపైనే పాకిస్థాన్ కు జైశంకర్ చురకలేశారు. క్రాస్ బోర్డర్ టెర్రరిజం (సీమాంతర ఉగ్రవాదం) గురించి ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. ‘నమ్మకం, సహకారం, స్నేహం లోపిస్తే పొరుగువారు దూరం అవుతారంటూ’ భారత్-పాకిస్థాన్ సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని కూడా సూచించారు. ‘సరిహద్దుల్లో తీవ్రవాదం, ఉగ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాలు ఉంటే.. ఆ రెండు దేశాల మధ్య వాణిజ్యం, అనుసంధానం, ప్రజల మధ్య సంబంధాలకు అవకాశం ఉండదు’ అని జైశంకర్ కుండబద్దలు కొట్టారు. అయితే పాకిస్థాన్‌ గురించే ఇదంతా అని స్పష్టంగా తెలిసిపోతోంది. ఎస్సీవో సదస్సులో మాట్లాడాక జైశంకర్ ట్వీట్ చేశారు. సదస్సులో మన దేశ ప్రకటనను వినిపించానని కల్లోల ప్రపంచంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు తగినవిధంగా స్పందించాలని కోరినట్లు తెలపడం గమనార్హం.

కాగా, 2019 ఫిబ్రవరిలో పూల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌ పై పాకిస్థాన్ మద్దతు ఉన్న జైషే మొహమ్మద్ సంస్థ భయంకర దాడికి పాల్పడింది. దీంతో 40 మంది జవాన్లు వీర మరణం పొందారు. భారత వాయుసేన ఆ వెంటనే ఫిబ్రవరి 26న పాక్‌ లోని బాలాకోట్‌ లో ఉన్న జైషే స్థావరాలపై బాంబులు వేసింది. అప్పటినుంచి రెండు దేశాల సంబంధాలు మరింత దిగజారాయి.