Begin typing your search above and press return to search.

నియంత్రణ కోల్పోయాం.. పీవోకే మనదే.. జైశంకర్ దమ్ము మాటలు

పీవోకే విషయంలో గత పాలకుల్లో ఉన్న లోపాన్ని ఆయన చెబుతూ.. సదరు అంశం మీద తమ వైఖరి ఏమిటన్న విషయాన్ని సూటిగా చెప్పేశారు.

By:  Tupaki Desk   |   17 May 2024 3:45 AM GMT
నియంత్రణ కోల్పోయాం.. పీవోకే మనదే.. జైశంకర్ దమ్ము మాటలు
X

మన సొత్తు మనదని చెప్పుకోవటానికి కూడా నానా తిప్పలు పడే తీరు మన దేశానికి.. మన పాలకులకు తప్పించి ప్రపంచంలో మరెక్కడా కనిపించదేమో? పాకిస్థాన్ అక్రమిత కశ్మీర్ గురించి మాట్లాడేందుకు కాంగ్రెస్ నేతలు అస్సలు ఇష్టపడరు. అందుకు భిన్నంగా బీజపీ మాత్రం.. సదరు ప్రాంతం మనదేనన్న మాటను చెబుతూ ఉంటుంది. పీవోకే విషయంలో ఇటీవల కాలంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ మాత్రం కచ్ఛితమైన అభిప్రాయాన్ని చెబుతూ ఉంటారు. తాజాగా ఆయన మరో అడుగు ముందుకేశారు. పీవోకే విషయంలో గత పాలకుల్లో ఉన్న లోపాన్ని ఆయన చెబుతూ.. సదరు అంశం మీద తమ వైఖరి ఏమిటన్న విషయాన్ని సూటిగా చెప్పేశారు.

మహారాష్ట్రలోని నాసిక్ లో విశ్వబంధు భారత్ పేరుతో జరిగిన కార్యక్రమంలో మంత్రి జైశంకర్ పీవోకేపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ విలీనం చేసుకోవటానికి లక్ష్మణ రేఖ లాంటిది ఉందన్న విషయాన్ని తాను నమ్మనని చెప్పిన ఆయన.. లక్ష్మణ రేఖ ఏమీ లేదన్నారు. పీవోకే భారత్ అంతర్భాగమన్న ఆయన.. ‘‘మన నుంచి తాత్కాలికంగా చేజారిందంతే. కొందరి బలహీనత కారణంగా పీవోకే తాత్కాలికంగా మన వద్ద లేదు. విశ్వ వేదికపై పమన స్థానాన్ని బలంగా ఉంచుకోవాలని భావిస్తున్నాం’’ అంటూ తమ వైఖరిని స్పష్టంగా చెప్పేశారు.

జైశంకర్ తాజా వ్యాఖ్యల్నిచూస్తే.. భారత ప్రధమ ప్రధాని నెహ్రూను వేలెత్తి చూపుతున్నట్లుగా ఉన్నాయని చెప్పక తప్పదు. ఇదే వేదికపై మరిన్ని వ్యాఖ్యలు చేసిన జైశంకర్.. ‘‘నేను చైనా రాయబారిగా ఉన్నాను. చైనా తీరు మనందరికి తెలుసు. ఈ భూమిని పాక్ లేదంటే చైనా తమదని చెప్పుకోలేదని వారికి మేం పదే పదే చెప్పాం. సౌర్వభౌమాధికారం ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే అది భారతదేశం. వాళ్లు అక్రమించారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు.కానీ.. చట్టపరమైన హక్కు మాత్రం మనదే’’ అంటూ పీవోకేపై తన వైఖరిని స్పష్టంగా సూటిగా చెప్పేశారు.

చైనా - పాక్ ఎకానమీ కారిడార్.. పాక్ తో బీజింగ్ సహకారంపైనా విమర్శలు చేసిన జైశంకర్.. ఈ రెండు దేశాల మధ్య 1963లో జరిగిన సరిహద్దు ఒప్పందంలోని అంశాల్ని ఎత్తి చూపారు. నాటి ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ 5వేల కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకు అప్పగించిందన్న ఆయన.. ‘‘చైనాతో సన్నిహితంగా ఉండేందుకు భారత్ కు చెందిన పాక్ అక్రమిత భూభాగంలో 5 వేల కిలోమీటర్ల భూమిని అప్పగించింది. ఈ భూమి మొత్తం భారత్ కు చెందుతుంది’’ అంటూ దమ్ముగా తన అభిప్రాయాన్ని కుండ బద్ధలు కొట్టారు. జైశంకర్ తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.