Begin typing your search above and press return to search.

జగన్ చుట్టూ కోటరీ మీద తీవ్ర స్థాయిలో జక్కంపూడి రాజా విమర్శలు!

అధికారంలో ఉంటే తప్పులు అన్నీ ఒప్పులుగా కనిపిస్తాయి. అదే అధికారం పోయిన నాడు ప్రతీదీ తప్పుగా తోస్తుంది

By:  Tupaki Desk   |   5 Jun 2024 12:21 PM GMT
జగన్ చుట్టూ కోటరీ మీద తీవ్ర స్థాయిలో జక్కంపూడి రాజా విమర్శలు!
X

అధికారంలో ఉంటే తప్పులు అన్నీ ఒప్పులుగా కనిపిస్తాయి. అదే అధికారం పోయిన నాడు ప్రతీదీ తప్పుగా తోస్తుంది. గత రెండు రోజులుగా వైసీపీ భారీ ఓటమి మీద సోషల్ మీడియా లోపలా బయటా వైసీపీ పార్టీలోనూ అతి పెద్ద పోస్ట్ మార్టం జరుగుతోంది. ఒక్కసారిగా వైసీపీ షాక్ కి గురి అయింది.

గెలుపు ధీమాతో ఉన్న ఆ పార్టీకి కనీసం 18 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అంటే ఎంతటి ఘోరమైన అవమానం అది. అందుకే వైసీపీలో ఉన్న నేతలు అంతా ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు. చాలా మంది వేదాంత ధోరణిలో మాట్లాడుతూంటే మరికొంతమంది మాత్రం తమ మనసులో ఉన్నది అంతా మీడియా ముఖంగా కక్కేస్తున్నారు.

రాజానగరానికి చెందిన మాజీ జక్కంపూడి రాజా అయితే జగన్ చుట్టూ కోటరీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు సంధించారు. ఆయన ఇండైరెక్ట్ గా జగన్ దే తప్పు అన్నట్లుగా మాట్లాడటం విశేషం. అంటే ఓటమి తరువాత జగన్ చుట్టూ ఉన్న కోటరీ మీద పేలిన తొలి గన్ అని అనుకోవాల్సి వస్తోంది.

ఇంతకీ జక్కంపూడి రాజా ఏమన్నారు అంటే ముఖ్యమంత్రి వద్దకు ఏ సమస్య మీద వెళ్ళినా పొద్దున నుంచి సాయంత్రం వరకూ కూర్చోబెట్టడం కాదు బయట నిలుచోబెట్టేవారు అని ఘాటు వ్యాఖ్యలే చేశారు. ధనుంజయ్ రెడ్డి అని ఒక అధికారి ఉన్నారు ఆయన సీఎం గా తానే అన్నట్లుగా ఫీల్ అయ్యేవారు అని రాజా తీవ్రంగా ఫైర్ అయ్యారు.

తాము అక్కడ ఫైల్ మూవ్ అయితే తమ ప్రాంతానికి చెందిన పదివేల మందికి అయినా ఏదో విధంగా ఉపయోగం అవుతుందని రోజంతా వెయిట్ చేసేవారమని ఆయన ఫ్లాష్ బ్యాక్ విప్పి చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిని అధికారులు ఒక ట్రాన్స్ లో పెట్టారు. చుట్టూ ఒక వలయం ఉంది. పనికి మాలిన అధికారులు ఎమ్మెల్యేలను బయటే ఉంచేవారు.

ఎమ్మెల్యే తో మాట్లాడానికి సైతం తీరిక లేకుండా ముఖ్యమంత్రి ఉండేవారు అని ఆయన మండిపడ్డారు. విపక్షంలో ఉన్నపుడు ఉద్యమాలు చేశాం, కోరుకొండ భూములకు పరిష్కారం చూపించమని కోరాం, అయిదేళ్ల పాటు అలాగే తిరిగారు కానీ పని జరగలేదు. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పధకం భూములకు సంబంధించిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని అడిగితే అయిదేళ్ళు గడిపారు.

విదేశీ విద్యకు సంబంధించి పేద కాపు విద్యార్ధుల బకాయిలు క్లియర్ చేయమని కోరినా అయిదేళ్ళు అలాగే గడిపారు కానీ పని జరగలేదని జక్కంపూడి రాజా విమర్శించారు. ముఖ్యమంత్రి ఎన్నికల తరువాత ఐప్యాక్ ఆఫీసుకు వెళ్ళి ప్రపంచమంతా చూసేలా మన విజయం ఉందని చెప్పారు అంటే ఆయనను ఏ స్థాయిలో భ్రమలలో ఉంచారో అర్ధం అవుతుందని రాజా హాట్ కామెంట్స్ చేశారు.

అసలు ఈ విధంగా సీఎం ని ఎమ్మెల్యేలకు దూరం పెట్టేలా చేశారని, అలాగే ఆయన కోటరీ దారుణంగా వ్యవహరించిందని రాజా అన్నారు. మొత్తానికి చూస్తే 150 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి అంతా కూడా రాజా ఒక్కరే ఈ విధంగా చెప్పారనుకోవాలి.

అయిదేళ్ళలో ఎమ్మెల్యేలకు సీఎం దర్శనం కలుగలే అని, కలిగినా రెండు నిముషాలు కూడా మాట్లాడే తీరిక లేకుండా పోయిందని ఆయన అంటున్న మాటలు చూస్తూంటే పరిపాలన లోని అసలు డొల్లతనం ఏమిటో చెప్పకనే చెప్పినట్లు అయింది అంటున్నారు. మొత్తం మీద చూస్తే జగన్ కోటరీ మీద రాజా ఎక్కుపెట్టిన తొలి గన్ అనుకోవచ్చా అన్న చర్చ సాగుతోంది. రానున్న రోజులలో మరింత మంది కూడా బయటకు వచ్చి పెద్ద గొంతు చేయవచ్చు అని అంటున్నారు.