ఖమ్మం గుమ్మంలో జలగం బలగం.. బీజేపీ దీటైన వ్యూహం
మరీ ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు దీటైన పోటీ కాదు.. ఆ రెండింటినీ ఓడించే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.
By: Tupaki Desk | 9 March 2024 9:53 AM GMTఈసారి 370 లోక్ సభ సీట్లు సాధిస్తాం.. ఎన్డీఏ స్కోరు 40 దాటిస్తాం.. అంటూ బీజేపీ పెద్దలు చెబుతుంటే, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి అంటున్నారని అనుకున్నారు.. కానీ, దీనివెనుక పెద్ద వ్యూహమే ఉందని స్పష్టమవుతోంది. మిగతా పార్టీలకు తగ్గట్టుగా ఎత్తులు వేస్తూ.. ఎక్కడ బలమైన నేతలుంటే అక్కడ తనదైన శైలిలో వారిని చేర్చుకుంటూ కమలనాథులు తమ ప్రణాళిక ఏమిటో చెప్పకనే చెబుతున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు దీటైన పోటీ కాదు.. ఆ రెండింటినీ ఓడించే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.
కాంగ్రెస్ కోటలో..
ఉమ్మడి ఏపీలో అయినా, తెలంగాణ వచ్చాక అయినా ఖమ్మం జిల్లా రాజకీయాలు మిగతా జిల్లా రాజకీయాలకు భిన్నం. రాష్ట్రమంతా ఒక పార్టీ గాలి వీస్తే ఇక్కడ మరో పార్టీ ప్రభావం చూపేది. అంతేకాదు.. బీజేపీ మొదలు కమ్యూనిస్టులు, కాంగ్రెస్, విప్లవ పార్టీలు, టీడీపీ, బీఆర్ఎస్ అన్నిపార్టీలకూ ఖమ్మంలో బలం ఉంది. ఇంత వైవిధ్యం మరో జిల్లాలోనూ కనిపించదు. ఇలాంటిచోట వచ్చే లోక్ సభ ఎన్నికలకు బీజేపీ బలమైన అభ్యర్థిని బరిలో దింపుతోంది. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దిగ్గజంగా పేరొందిన జలగం వెంగళరావు చిన్న కుమారుడు జలగం వెంకట్రావ్ ను ఖమ్మం నుంచి పోటీ చేయించేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది.
పెద్ద బలగమే.. ఆయన బరిలో దిగితే
2014లో ఉమ్మడి ఖమ్మంలో గెలిచిన ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ (కొత్తగూడెం). 2018లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇటీవలి ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. కేవలం 10 రోజుల ముందు ఫార్వర్డ్ బ్లాక్ లో చేరి 50 వేలకు పైగా ఓట్లు తెచ్చుకుని సత్తాచాటారు. ఫార్వర్డ్ బ్లాక్ తరఫున రెండో స్థానంలో నిలిచారు. దీన్నిబట్టే జలగం వెంకట్రావ్ స్థాయి, బలగం తెలుస్తోంది. కాగా, వెంకట్రావ్ ను ఖమ్మం ఎంపీగా పోటీ చేయించడం ద్వారా బీజేపీ మాస్టర్ స్ట్రోక్ ఇవ్వనున్నట్లు స్పష్టమవుతోంది. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మంలో జలగం కుటుంబానికి పార్టీలకు అతీతంగా బలం ఉంది. ఖమ్మం జిల్లా సాగునీటి రంగం ప్రగతిలో, పారిశ్రామిక ముద్రలో వెంగళరావు పాత్ర విస్మరించలేనిది. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలు కొనసాగినప్పటికీ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ లోకి వెళ్లారు. అలాంటి జలగం కుటుంబ సభ్యుడు ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తే కచ్చితంగా ప్రభావం చూపుతారు. మరింత గట్టి ప్రయత్నిస్తే.. ప్రధాని మోదీ హవా తోడైతే విజయం సాధించడమూ పెద్ద కష్టమేం కాదు.
కొసమెరుపు: జలగం వెంకట్రావు తండ్రి వెంగళరావు ఖమ్మం ఎంపీగా రెండుసార్లు (1984, 89) గెలిచారు. అత్యంత కీలకమైన కేంద్రం హోం మంత్రిగా పనిచేశారు. ఇక వెంగళరావు సోదరుడు కొండలరావు సైతం ఖమ్మం ఎంపీగా రెండుసార్లు (1977,80) నెగ్గారు. ఇక వెంగళరావు సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఉంటూ ఉమ్మడి ఏపీ సీఎం అయ్యారు. వెంకట్రావు అన్న ప్రసాదరావు కూడా సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రి గా పనిచేశారు. సత్తుపల్లి అంతకుముందు వేంసూరు నియోజకవర్గంగా ఉండేది. ఆ స్థానానికి సైతం కొండలరావు, వెంగళరావు ఎమ్మెల్యేలుగా పనిచేశారు.