అడకత్తెరలో పోకచెక్కలా ఖాన్!
జలీల్ ఖాన్ విజయవాడ పశ్చిమ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారి 1999లో విజయం సాధించారు.
By: Tupaki Desk | 6 April 2024 12:30 PM GMTజలీల్ ఖాన్ పరిచయం అక్కర్లేని పేరు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ బీకాంలో ఫిజిక్స్ చదివానని చెప్పడం.. బీకాంలో ఫిజిక్స్ ఏంటంటూ అంతా ట్రోల్ చేయడం... దీనిపైన ఎన్నో రీల్స్, మీమ్స్ పుట్టుకురావడం జరిగిపోయాయి.
జలీల్ ఖాన్ విజయవాడ పశ్చిమ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారి 1999లో విజయం సాధించారు. 2009లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 2014లో వైసీపీ తరఫున బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరిపోయారు. 2019లో జలీల్ ఖాన్ కు బదులుగా ఆయన కుమార్తె షబానా ఖాతూన్ కు టీడీపీ టికెట్ ఇచ్చింది. అయితే ఆమె ఓడిపోయారు.
కాగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయవాడ పశ్చిమ సీటును జలీల్ ఖాన్ ఆశించారు. అయితే విజయవాడ పశ్చిమ సీటు పొత్తులో భాగంగా తొలుత జనసేనకు దక్కింది. ఆ పార్టీ తరఫున పోతిన వెంకట మహేశ్ సీటును ఆశించారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున బరిలోకి దిగిన పోతిన ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో తనకే సీటు అని ఆయన ఆశలు పెట్టుకున్నారు.
మరోవైపు విజయవాడ పశ్చిమ సీటును టీడీపీ తరఫున జలీల్ ఖాన్ తోపాటు టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న కూడా ఆశించారు, సీటు తమకంటే తమకని పోటీ పడ్డారు. వీరితోపాటు ఎంకే బేగ్ కూడా విజయవాడ పశ్చిమ సీటును ఆశించారు. అయితే పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్టు చివరకు విజయవాడ పశ్చిమ సీటును బీజేపీ ఎగరేసుకుపోయింది. ఆ పార్టీ తరఫున కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు.
దీంతో విజయవాడ పశ్చిమ నుంచి అటు జనసేన నేత పోతిన మహేశ్ కు, ఇటు టీడీపీ తరఫున జలీల్ ఖాన్ కు దక్కలేదు.
జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిసి విజయవాడ పశ్చిమ సీటును తనకివ్వాలని జలీల్ ఖాన్ కోరారు. అయితే పవన్ ఆయనకు ఏ హామీ ఇవ్వలేదు. విజయవాడ పశ్చిమ సీటును తనకివ్వకపోతే ముస్లింలు ఉరేసుకుంటారని హాట్ కామెంట్స్ కూడా ఇటీవల జలీల్ ఖాన్ చేశారు. అయినా సరే విజయవాడ పశ్చిమ సీటు తనకు రాకపోవడంతో జలీల్ ఖాన్ పార్టీ మారాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
దీంతో జలీల్ ఖాన్ వైసీపీలో చేరడానికి అన్నట్టు ఇటీవల వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డిని కలిశారు. దీంతో అప్రమత్తమైన విజయవాడ టీడీపీ లోక్ సభా ఇంచార్జి కేశినేని చిన్ని.. జలీల్ ఖాన్ ను నారా లోకేశ్ దగ్గరకు తీసుకెళ్లారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని.. పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా న్యాయం చేస్తామని లోకేశ్.. జలీల్ ఖాన్ కు హామీ ఇచ్చినట్టు చెçప్పుకున్నారు. దీంతో జలీల్ ఖాన్ బయటకొచ్చాక తాను పార్టీ మారడం లేదని టీడీపీలో ఉంటానని ప్రకటించారు.
కాగా ఇప్పటికే వైసీపీ విజయవాడ పశ్చిమకు స్థానిక కార్పొరేటర్ అయిన ఒక ముస్లిం అభ్యర్థిని ప్రకటించింది.
ప్రధాన పార్టీల తరఫున సీటు లేకపోవడంతో జలీల్ ఖాన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మొగ్గు చూపుతున్నారని టాక్ నడుస్తోంది. వైసీపీలో సీట్లు రానివారు, ఇతర పార్టీల్లో అవకాశం లేని ఎమ్మెల్యేలకు, మాజీలకు కాంగ్రెస్ పార్టీ ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది.
అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కొంతమంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఏపీలో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. దీంతో పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ సీటును సీపీఐకి కేటాయించింది. సీపీఐ అభ్యర్థి విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. దీంతో జలీల్ ఖాన్ కు చివరకు కాంగ్రెస్ లో చేరినా సీటు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆయన పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా ఉందని టాక్ నడుస్తోంది.