Begin typing your search above and press return to search.

'భార్యను కాస్త మత్తులో ఉంచాలి'.. మంత్రికి శాపంగా మారిన మాటలు

తాను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ప్రైవేటుగా ఆయన అభివర్ణించారు. ప్రైవేటు సంభాషణలపై ఇలా రచ్చ చేస్తారన్నది ఆయన వాదన.

By:  Tupaki Desk   |   25 Dec 2023 4:53 AM GMT
భార్యను కాస్త మత్తులో ఉంచాలి.. మంత్రికి శాపంగా మారిన మాటలు
X

ప్రైవేటు అయినా పబ్లిక్ అయినా.. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. తమ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా కౌంట్ కిందకే వస్తుందన్నది మర్చిపోకూడదు. తాజాగా ఆ విషయాన్ని మర్చిపోయిన బ్రిటన్ మంత్రి చిక్కుల్లో చిక్కుకున్నారు. వాట్సాప్.. సోషల్ మీడియాలో తరచూ భార్య మీద వేసే భర్త జోకుల తరహాలో ఆయన ఒక వ్యాఖ్య చేశారు. అది జోక్ అన్నారు కానీ.. అది ఆయన పాలిట షాక్ గా మారింది. వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగాలంటే.. భార్యను ఎప్పుడు కొంత మత్తులో ఉంచాలన్నది ఆయన మాట.

బ్రిటన్ హోం మంత్రి జేమ్స్ క్లెవర్లీ నోటి నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యపై ఇప్పుడు పెద్ద రగడ జరుగుతోంది. అంత మాట అనటమా? భార్యను పట్టుకొని అలా అనేస్తావా? భాగస్వామి విషయంలో ఇంత బాద్యతారాహిత్యంతో వ్యాఖ్యలు చేస్తారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వేటు వేయటమే సరైన చర్యగా అభిప్రాయపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇంతకు ఆయన ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు? అన్న విషయంలోకి వెళితే.. చాలానే అంశాలు కనిపిస్తాయి.

బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తన ఇంట్లో ఒక విందును ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన హోం మంత్రి జేమ్ క్లెవర్లీ.."తన భర్త కంటే మెరుగైన వారు ఎంతో మంది ఉన్నారన్న విషయాన్ని ఎప్పటికీ గుర్తించకుండా భార్యకు నిరంతం కొద్ది మోతాదులో మత్తు ఇచ్చి జోకొట్టాలి.. ఇది చాలా కొద్దిగా ఇవ్వాలి. అదేమీ చట్టవిరుద్దమేమీ కాదు" అంటూ తన బ్యాడ్ టేస్టును బయటపెట్టాడు. తాను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ప్రైవేటుగా ఆయన అభివర్ణించారు. ప్రైవేటు సంభాషణలపై ఇలా రచ్చ చేస్తారన్నది ఆయన వాదన.

మీడియా.. సోషల్ మీడియా.. వాట్సాప్ లాంటి మాధ్యమాలు ఉన్న వేళ.. ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అర్థం లేనిది. ఎందుకంటే.. వాస్తవం జరిగిందేమిటన్న దాని కంటే సంచలనం చేయటానికి ఉన్న అంశాలకు ప్రాధాన్యత ఇవ్వటం.. వాటిని వైరల్ చేయటం అన్నది ఒక అలవాటుగా మారినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. అలాంటిది లేనప్పుడు ఇలాంటి సమస్యలే ఎదురవుతాయి.

తాను సరదాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారి.. ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్ అంతకంతకూ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో తెలివిలోకి వచ్చిన ఆయన.. తాను సరదాగా అన్నానే తప్పించి.. దరుద్దేశం లేదన్నారు. తన వ్యాఖ్యలు కేవలం జోక్ మాత్రమేనని పేర్కొంటూ సారీ చెప్పారు. అయినప్పటికీ ఆయనపై విమర్శల పరంపర తగ్గట్లేదు. ఆయన్ను మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జేమ్స్ కంటే ముందు బ్రిటన్ హోం మంత్రిగా ఉన్న సువెల్లా బ్రేవర్మన్ సైతం.. తన వ్యాఖ్యలతోనే పదవిని పోగొట్టుకున్నారు. పాలస్తీనాకు అనుకూలంగా తీసిన ర్యాలీ అంశంలో పోలీసులపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. దీంతో.. ఆయన్నుపదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో నియమించిన జేమ్స్ సైతం ఇప్పుడు మాటల వివాదంలో చిక్కుకోవటం విశేషం. మరేం జరుగుతుందో చూడాలి.