Begin typing your search above and press return to search.

జమిలి పుణ్యమాని మోడీ సర్కార్ శుభవార్త ?

ఆకాశానికి అంటిన పెట్రోల్ డీజిల్ ధరలను కొంచెం తగ్గించడానికి కేంద్రం సిద్ధపడుతోందని వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   25 Oct 2024 5:37 PM GMT
జమిలి పుణ్యమాని మోడీ సర్కార్ శుభవార్త  ?
X

జమిలి ఎన్నికల హడావుడిలో కేంద్రంలోని బీజేపీ ఉంది అని అంటున్నారు. జమిలి ఎన్నికలను నిర్వహించడానికి తగిన రోడ్ మ్యాప్ ని సిద్ధం చేసుకుంటోంది. దాని కోసం శీతాకాల సమావేశాలలోనే బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి చూస్తున్నారు.

ఇదిలా ఉంటే 2026 ఎండింగులో కానీ 2027 మొదట్లో కానీ జమిలి ఎన్నికలు జరిపించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో ప్రజలకు వరసబెట్టి వరాలను ప్రకటించే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉందని అంటున్నారు. ఈ మధ్యలోనే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు కూడా ఉండడంతో అన్నింటికీ ఒకే అస్త్రం అన్నట్లుగా కీలక నిర్ణయాల దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.

దేశంలో పెట్రోల్ ధరలు కరోనా టైం లో అలా పెరిగిపోయి గత నాలుగేళ్ళుగా వందను దాటి అక్కడే నిలబడ్డాయి. అంతకు ముందు 70 రూపాయల మధ్యన ఉన్న ఈ ధరలు కాస్తా రెట్టింపు పెరిగాయి. దాని వల్ల సామాన్యుడు మధ్యతరగతి కుదేల్ అయ్యాడు. ధరలు పెరుగుదలకు కారణం అయింది. ఆహార ద్రవ్యోల్బణం పెరిగి అది కూడా సగటు జనాల మీదనే భారంగా మారింది.

ఈ నేపధ్యంలో కేంద్రం కరుణా కటాక్షాలు ఇపుడు జనాల మీద పడ్డాయని అంటున్నారు. ఆకాశానికి అంటిన పెట్రోల్ డీజిల్ ధరలను కొంచెం తగ్గించడానికి కేంద్రం సిద్ధపడుతోందని వార్తలు వస్తున్నాయి. జమిలి ఎన్నికల నాటికి ఈ ధరలను బాగా తగ్గించేలా ఒక క్రమబద్ధంగా చర్యలు తీసుకుంటారు అని అంటున్నారు.

అంటే ప్రస్తుతానికి పెట్రోల్ మీద లీటర్ కి ఒక అయిదు రూపాయలు తగ్గిస్తారు అని అంటున్నారు. అలాగే డీజిల్ ధరల విషయంలో ఉపశమనం కలిగేలా చర్యలు ఉంటాయని అంటున్నారు. ఇవన్నీ కూడా మహారాష్ట్ర ఎన్నికల ముందే కీలక ప్రకటన చేసే విధంగానే ఉంటాయని అంటున్నారు.

నిజానికి చూస్తే ఎపుడో ఈ ధరలు తగ్గాల్సి ఉందని అంటున్నారు. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు బాగా తగ్గాయి. మరి ఆ ధరలను చూపించి ఇక్కడ దేశీయంగా పంచేసిన చమురు ధరలను మాత్రం అసలు తగ్గించలేదు, అయితే ఇన్నాళ్ళకు జమిలి పుణ్యమాని కేంద్రం ఆలోచనలు మారుతున్నాయని అంటున్నారు.

పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామని ఇప్పటికే కేంద్ర ఇంధన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ఇదే మాటను ఆ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ కూడా గట్టిగానే చెప్పారు. అంటే కేంద్రం మదిలో ఈ విషయం ఉందని అర్ధం అవుతోంది.

ఇక చూస్తే అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడయిల్ ధర 70.72 డాలర్లుగా ఉంది. దాంతో కేంద్రం తలచుకుంటే భారీగానే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించవచ్చు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కేంద్రం ఈ ధరలను తగ్గిస్తే కనుక దేశంలో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటారు. ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ తో అందరికీ పని ఉంది.