జమిలి-జగడం.. అసలు రాజకీయం ఏంటంటే!
ఒక కీలక వివాదాస్పద విషయాన్ని ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు రాజకీయంగా మరో విషయాన్ని తెరమీదకు తీసుకురావడం ప్రభుత్వాల్లో ఏపార్టీలు ఉన్నా చేసే పనే.
By: Tupaki Desk | 17 Sep 2024 6:30 AM GMTఒక కీలక వివాదాస్పద విషయాన్ని ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు రాజకీయంగా మరో విషయాన్ని తెరమీదకు తీసుకురావడం ప్రభుత్వాల్లో ఏపార్టీలు ఉన్నా చేసే పనే. ఇప్పుడు కేంద్రంలోనే మోడీ సర్కారు కూడా అదే పనిచేస్తోంది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా విద్వేష రాజకీయాలు పెరిగిపోయి.. కవులు, రచయితలు, సామాజిక కార్యకర్తల భావ ప్రకటనపై దాడులు జరిగాయి. బెంగళూ రులో ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు గౌరీ లంకేష్‌ను దారుణంగా హత్య చేసినప్పుడు.. ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేసినప్పుడు దేశవ్యాప్తంగా మోడీ సర్కారుపై విమర్శలు వచ్చాయి.
ఈ సమయంలో ఆ విమర్శల దాడి నుంచి తప్పించుకునేందుకు సర్జికల్ స్ట్రైక్స్ చేసి దేశాన్ని కాపాడామంటూ బీజేపీ నేతలు కొత్త విషయాన్ని తీసుకువచ్చారు. దీంతో అప్పటి వరకు జరిగిన ఘటనలు దారి తప్పి.. కొత్త వ్యవహారంపై దృష్టి పెట్టారు. ఇలానే ఇప్పుడు కూడా కీలకమైన వక్ఫ్ బోర్డుకు సంబంధించి అధికారాలను తగ్గించే ప్రక్రియకు మోడీ సర్కారు శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన కీలక సవరణలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఇది. ఒక రకంగా తేనెతుట్టెను కదపడమే అవుతుంది. ఈ విషయం బీజేపీకి కూడా తెలుసు. పైగా మిత్రపక్షాలలో కొన్ని దీనికి ఆమోదం కూడా తెలపడం లేదు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా `జమిలి`అంశాన్ని తెరమీదికి తీసుకురావడం గమనార్హం.
ఇప్పుడు జమిలి విషయాన్ని చూద్దాం. దేశవ్యాప్తం.. అన్ని రాష్ట్రాలు, కేంద్రానికి ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలనేది జమిలి వ్యూహం. ఇది సుదీర్ఘకాలంగా ఉన్నదే. ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. అయితే.. పేరు మారింది. అప్పట్లో జమిలి అన్నారు. ఇప్పుడు మోడీ సర్కారు `వన్ నేషన్-వన్ ఎలక్షన్` అనే పేరు పెట్టింది. మొత్తంగా ఒక్కటే వ్యూహం. రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం. అయితే.. దీనికి కూడా మిత్ర పక్షాలు అంగీకరించే అవకాశం లేదు. పైగా.. దీనికి అనేక చిక్కులు కూడా ఉన్నాయి. జమిలి నిర్వహణపై ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కమిటీ వేశారు.
ఈ కమిటీ ఇంకా నివేదిక ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా.. ఎలాంటి తీర్మానాలు ప్రతిపాదిస్తుందనేది చూడాలి. ఇక, కాంగ్రెస్ చెబుతున్నట్టుగా.. జమిలి నిర్వహణకు రాజ్యాంగపరమైన మార్పులు చేయాల్సి ఉంది. కనీసం ఐదు సవరణలైనా చేయాలన్నది కాంగ్రెస్ దిగ్గజ నాయకుడు పి. చిదంబరం చెబుతున్నమాట. కానీ, ఇన్ని సవరణలు చేసి.. ఉభయ సభల్లోనూ ప్రభుత్వం సక్సెస్ కావడం ఇప్పుడున్న పరిస్థితిలోనూ సాధ్యం కాదు. దీనికి కారణంగా బలమైన సంఖ్యా బలం మోడీకి లేదు. ఉభయ సభల్లోనూ ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో జమిలి.. వెనుక వ్యూహం `వక్ఫ్` చట్ట సవరణేనని తెలుస్తోందన్నది జాతీయ విశ్లేషకుల మాట.