జమిలి...వైసీపీకి టానిక్ గా పనిచేస్తోంది !
ఇక లీడర్లు క్యాడర్ ఎక్కడ కోలుకుంటారు అన్నది ఒక ప్రశ్న.
By: Tupaki Desk | 7 Nov 2024 3:58 AM GMTవైసీపీ అధినాయకత్వమే నీరుగారిపోయిన దారుణమైన ఫలితాలు 2024 ఎన్నికల్లో వచ్చాయి. గట్టిగా చెప్పాలీ అంటే ఆరు నెలలు గడచినా ఈ రోజుకీ అధినాయకత్వమే ఇంకా కోలుకోలేదు. ఇక లీడర్లు క్యాడర్ ఎక్కడ కోలుకుంటారు అన్నది ఒక ప్రశ్న.
మరో వైపు చూస్తే లీడర్ కి క్యాడర్ కి, అలాగే లీడర్ కి హై కమాండ్ కి మధ్య ఒక వంతెన తెగి చాలా ఏళ్ళు అయింది అన్నది నిష్టుర నిజం అంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వైసీపీ పెద్దలు ఇపుడు భరోసా ఇస్తామని అంటున్నారు.
కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో అయిదు నెలల టీడీపీ కూటమి ప్రభుత్వంలో జరిగిన కొన్ని తప్పులు వైసీపీకి కొంత ఓదార్పుని ఇస్తున్నాయి. దానికి తోడు టార్గెట్ చేసి మరీ వైసీపీ నేతల మీద కేసులు పెట్టడం కూడా వారిలో పౌరుషాన్ని పెంచుతోంది. దెబ్బ తిన్న వారు ఎటూ కసిగా ఉంటారు. అపుడు వారికి ఒక వేదిక కావాలి. అలా వైసీపీలో యాక్టివిటీని కోరి టీడీపీ కూటమి పెంచుతోంది. ఇది అచ్చం గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన మాదిరిగానే అని అంటున్నారు.
దాంతో జగన్ ప్రమేయం లేకుండానే చాలా చోట్ల క్యాడర్ నిద్రావస్థ నుంచి మేలుకుంటోంది. ఎందుకంటే వారి కొంపే మునుగుతోంది కాబట్టి. అందువల్ల ఎటూ తమకు ఉన్న పొలిటికల్ బ్రాండ్ ని వారు ఇపుడు పట్టుకుని పోరాడేందుకు రెడీ అవుతున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే కేంద్రం జమిలి ఎన్నికల నినాదం అయితే వైసీపీకి జవ జీవాలను అందిస్తోంది. దాంతో చెల్లా చెదురు అయిన లీడర్లు ఇపుడు మళ్లీ పార్టీ ఫ్లాట్ ఫారం వద్దకు చేరుతున్నారు. అయిదేళ్ళ పాటు అధికార వియోగం అంటే బాబోయ్ అనుకున్న వారు అంతా మూడేళ్ళకే మళ్ళీ ఎన్నికలు అందులోనూ ఆరు నెలలు ఇపుడే గడచిపోయాయి కాబట్టి గట్టిగా కళ్ళు మూసుకుంటే రెండున్నరేళ్ళే కాబట్టి ఇప్పటి నుంచే ఫీల్డ్ లో ఉండాలని భావిస్తూ వైసీపీ తో టచ్ లోకి వస్తున్నారు.
అలా వచ్చే వారిలో సీనియర్ నేతలు అలకల పానులు ఎక్కిన వారు కూడా ఉన్నారు. వారంతా ఇప్పటికి ఇపుడు వేరే పార్టీలోకి పోయి చేసేది ఏమిటి అన్న ఆలోచనతో కూడా వైసీపీతోనే అంటున్నారు. ఇది ఒక విధంగా వైసీపీకి అనుకోని వరంగా మారింది అనే చెప్పాలి.
జమిలి ఎన్నికల విషయంలో కేంద్రంలోని బీజేపీ పట్టుదలగా ఉండడమే వైసీపీకి కలసి వస్తోంది. గత అయిదేళ్ల వైసీపీ పాలనలో ఇదిగో అదిగో ఎన్నికలు అంటూ టీడీపీని యాక్టివేట్ చేసుకుంటూ వచ్చారు చంద్రబాబు. నిజానికి అది బాబు మార్క్ స్ట్రాటజీ.
వైసీపీలో అలాంటి స్ట్రాటజీలకు అవకాశమే లేదు. ఎన్నికల్లో ఓటమి చెందగానే అయిదేళ్ళకు సిద్ధంగా ఉండాలని అధినాయకుడు జగనే దిశా నిర్దేశం చేశారు. ఈ పోరాటంలో ఎన్నో ఒడుదుడుకులు ఉంటాయని తట్టుకోవాలని కూడా చెప్పాల్సినవి చెప్పేశారు. ఆ మీదట నాతో ఉండే వారు ఉంటారు లేని వాళ్ళు లేదు అని కూడా నిర్ణయించుకున్నారు.
అలా కొందరు పార్టీ జెండాను పక్కన పెట్టి జంప్ చేశారు. ఇక మిగిలిన వారు కూడా అదే బాట అనుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ఆలపించిన జమిలి రాగం వైసీపీకి వేయి ఏనుగుల బలం ఇస్తోంది. ఇది నిజంగా జగన్ ఊహించినది కాదు, ఆయన ఏ రకమైన రాజకీయ వ్యూహాలు రచించినదీ లేదు.
ఒక్క మాటగా చెప్పుకుంటే నిజంగా జమిలి ఎన్నికలు అని కేంద్రం ప్రకటించకపోయి ఉంటే వైసీపీ పరిస్థితి ఏమిటి అన్నది కూడా చర్చకు వచ్చే విషయమే. షెడ్యూల్ ప్రకారం 2029 ఎన్నికలు అంటే వైసీపీలో ఉండేవారు ఎవరో రాజెవరో మంత్రి ఎవరో అన్న సీన్ కనిపించేది.
ఎంత జగన్ ప్రజాకర్షణ నేత అనుకున్నా క్యాడర్ లీడర్ లేకుండా ఎన్నికలను ఎదుర్కోలేరు కదా అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా నిజంగా 2027లో ఎన్నికలు జరగవచ్చు లేక ఆగవచ్చు. కానీ అప్పటిదాకా ఆ రాగాలాపన ఉంటుంది అన్నది కచ్చితం. ఒకవేళ జమిలి ఎన్నికలు అప్పటికి జరగకపోయినా వైసీపీకి నష్టం ఏమీ లేదు.
ఎందుకంటే అక్కడ నుంచి 2029 ఎన్నికలు కేవలం రెండేళ్ళే. సో వైసీపీకి ఆయాచిత వరంగా కేంద్రంలోని బీజేపీ ఈ రాజకీయ సాయం చేస్తోంది అని అనుకోవాలి. నాడు బాబు ఎంతో ఊదరగొట్టి ముందస్తు ఎన్నికలు మధ్యంతర ఎన్నికలు జమిలి ఎన్నికలు అని ప్రకటిస్తూ ఉండేవారు. అలాంటి ఆయాసం ఏదీ లేకుండా జగన్ కి జమిలి జపం అందివస్తోంది అంటే రాజకీయంగా జగన్ కి ఇంకా ఎక్కడో సుడి గట్టిగానే ఉంది అని అంటున్నారు.