Begin typing your search above and press return to search.

జమిలి చట్టంగా మారాలంటే పెద్ద ముచ్చటే

పెద్ద ఎత్తున విపక్షాలను కూడగట్టుకోవటంతో పాటు.. బిల్లు ఆమోదానికి అత్యధికుల ఆమోదం పొందాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   19 Sep 2024 10:30 AM GMT
జమిలి చట్టంగా మారాలంటే పెద్ద ముచ్చటే
X

దేశ వ్యాప్తంగా ఒకేసారి లోక్ సభ ఎన్నికలు.. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు వీలుగా జమిలి ఎన్నికలకు ఓకే చేస్తూ.. కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. దీంతో.. దీన్ని బిల్లు రూపంలో వచ్చే శీతాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే.. చెప్పినంత.. అనుకున్నంత ఈజీగా జమిలి ఎన్నికల ముచ్చట చట్టంగా మారే అవకాశం లేదు. దీనికి భారీగానే కసరత్తు చేయాల్సి ఉంటుంది. పెద్ద ఎత్తున విపక్షాలను కూడగట్టుకోవటంతో పాటు.. బిల్లు ఆమోదానికి అత్యధికుల ఆమోదం పొందాల్సి ఉంటుంది.

జమిలి ఎన్నికలు వస్తే.. అన్ని రాష్ట్రాలకు.. లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. అయితే.. మధ్యలోనే ఏదైనా రాష్ట్రంలోని ప్రభుత్వం సంక్షోభంలో పడి ప్రభుత్వం కూలిపోతే.. లోక్ సభ ఎన్నికలు జరిగే వరకు అయితే గవర్నర్ పాలన.. లేదంటే రాష్ట్రపతి పాలన నడవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తారో.. అప్పుడు ఆ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికల్ని నిర్వహిస్తారు. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల వేళకు కొన్ని రాష్ట్రాల గడువును ముందుకు తీసుకొస్తే.. మరికొన్ని రాష్ట్రాల్లో గడువును తగ్గించటమో చేస్తారు. ఒకవేళ.. లోక్ సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చినా.. మార్పులు తప్పవు.

జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి చట్టంగా చేయాలంటే పలు సవరణులు చేయాలి. ఒక లెక్క ప్రకారం చూస్తే దాదాపు ఆరు సవరణలు అవసరమవుతాయి. దేశంలోని వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నుల్ని మార్చటంతో పాటు.. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణ చేయాల్సి ఉంటుంది. కీలక రాజ్యాంగ సవరణకు పార్లమెంట్ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. రాజ్యాంగానికి ఆరు సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకూ ఆ ఆరు సవరణలు ఏమిటన్నది చూస్తే..

1. ఆర్టికల్ 83

లోక్ సభ, రాజ్యసభల కాలపరిమితికి సంబంధించింది

2. ఆర్టికల్ 1712(1)

రాష్ట్రాల అసెంబ్లీలకు ఐదేళ్ల గడువును నిర్దేశించేది

3. ఆర్టికల్ 83(2)

అత్యయిక పరిస్థితుల వేళలో సభ కాలపరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంట్ చట్టం ద్వారా వీలు కల్పించేది. ఆర్టికల్ 172(1) కింద రాష్ట్రాల అసెంబ్లీలకు ఇలాంటి వీలుంది.

4. ఆర్టికల్ 85(2) (బి)

రాష్ట్రపతికి లోక్ సభను రద్దు చేసే అధికారం. ఆర్టికల్ 174(2) (బి) కింది రాష్ట్ర అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్ కు ఉంటుంది.

5. ఆర్టికల్ 356

రాష్ట్రాల్లో రాష్ట్రపతిపాలనకు వీలు కల్పించేది

6. ఆర్టికల్ 324

ఎన్నికల కమిషన్ అధికారాలకు సంబంధించింది

జమిలి బిల్లును ఆమోదించటం అంత సులువైన అంశం కాదు. ఎందుకంటే ఆరు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంుటంది. దీనికి పార్లమెంటులో 2/3 మెజార్టీతో సభ ఆమోదం తీసుకోవాలి. ప్రస్తుతం లోక్ సభలో బీజేపీ ఆ మార్కు దాటాలంటే సొంతబలంతో పాటు అదనంగా ఎంపీల మద్దతు అవసరం. రాజ్యసభలో మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే లోక్ సభలో ప్రస్తుతం ఎన్డీయేకు ఉన్న బలం 293. కానీ.. జమిలి ఆమోదానికి 362 మంది సభ్యుల అవసరం ఉంది. అంటే.. 69 మంది ఎంపీల మద్దతు అవసరమవుతుంది.

లోక్ సభలో సినిమా అలా ఉంటే.. రాజ్యసభలో మరింత ఇబ్బంది ఖాయం. కారణం.. ప్రస్తుతం రాజ్యసభలో ఎన్డీయే బలం కేవలం 121 మాత్రమే. జమిలి ఆమోదం పొందాలంటే 164 మంది రాజ్యసభ సభ్యుల మద్దతు అవసరం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సమాఖ్య వ్యవస్థను ఫాలో అయ్యే మన దేశంలో జమిలి అంశానికి సంబంధించి రాష్ట్రాలను ఒప్పించాల్సి ఉంటుంది. అందుకు.. దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఓకే చెప్పాలి. ఆ లెక్కన 14 రాష్ట్రాలకు పైనే జమిలికి ఓకే చెప్పాల్సి ఉంటుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. బీజేపీ సొంతంగా 13 రాష్ట్రాల్లో పవర్ లో ఉండటం కలిసి వచ్చే అంశం. కష్టమంతా రాజ్యసభలో మెజార్టీకి అవసరమైన సభ్యుల మద్దతు పొందటమే అవుతుంది.