Begin typing your search above and press return to search.

దేశంలో జమిలి ఎన్నికలు...సీరియస్ గానే...?

జమిలి ఎన్నికలు జరుగుతాయా అంటే కేంద్రం మాత్రం సీరియస్ గానే పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   27 July 2023 4:40 PM GMT
దేశంలో జమిలి ఎన్నికలు...సీరియస్ గానే...?
X

దేశం లో జమిలి ఎన్నికలు జరుగుతాయా అంటే కేంద్రం మాత్రం సీరియస్ గానే పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వానికి జమిలి ఎన్నికలు ఇష్టం. ఆ విధంగా దేశం లోని లోక్ సభకు అన్ని రాష్ట్రాల కు ఒకేమారు ఎన్నికలు పెడితే కచ్చితంగా జాతీయ పార్టీ దూకుడుతో ప్రాంతీయ పార్టీలు తట్టుకోలేవని, అవి చతికిలపడతాయని పదునైన వ్యూహాన్ని బీజేపీ రచిస్తోంది.

బీజేపీది అంతా ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ఎన్నిక. ఇలా సింగిల్ అజెండా తో బీజేపీ ముందుకు సాగుతోంది. అయితే జమిలి ఎన్నికలు అంటూ 2014 నుంచి బీజేపీ పాటపాడుతున్నా అది 2024 దాకా అలా సాగుతూనే వచ్చింది. అయితే ఆ కోరిక మాత్రం అలాగే ఉంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే జమిలి ఎన్నికల మీద దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల లో చర్చ అయితే వేడిగా సాగుతోంది. బీజేపీ 2024 మే వరకూ అంటే షెడ్యూల్ ప్రకారం ఆగి ఎన్నికల కు వెళ్లకపోవచ్చు అని అంటున్నారు. ఈలోగా జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి అపజయాలు కనుక పొరపాటున వస్తే ఆ ప్రభావం లోక్ సభ ఎన్నికల మీద పడుతుంది అన్న కంగారు అయితే ఉంది అంటున్నారు.

ఈ నేపధ్యంలో కేంద్రం మదిలో ఏముందో అన్నది విపఖాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పార్లమెంట్ లో గురువారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేఘవాల్ మాట్లాడుతూ జమిలి ఎన్నికల మీద లా కమిషన్ పరిశీలన లో ఉన్నట్లుగా తైపారు. అంటే ఈ విషయం మీద సీరియస్ గానే కేంద్రం ఆలోచనలు చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు అన్న మాట.

అంతే కాదు జమిలి ఎన్నికల కోసం ఆచరణాత్మకమైన రోడ్ మ్యాప్ తో పాటు ఫ్రేం వర్క్ ని తయారు చేస్తున్నట్లుగా వివరించారు. ఇక లోక్ సభకు దేశం లోని అన్ని రాష్ట్రాల కు ఒకే మారు ఎన్నికలు జరిపించేందుకు సాధ్యాసాధ్యాలను లా కమిషన్ నిశితంగా పరిశీలిస్తోంది అని ఆయన వెల్లడించడం విశేషం.

ఇక న్యాయ శాఖ స్టాండింగ్ కమిటీ కూడా జమిలి ఎన్నికల మీద పరిశీలన చేస్తోంది అని మరో కొత్త విషయం చెప్పుకొచ్చారు. దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం కూడా వివిధ భాగస్వాములతో చర్చలు జరుపుతోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి పేర్కొనడం విశేషం.

మొత్తానికి చూస్తే జమిలి ఎన్నికలు అన్నది బీజేపీ ప్రధాన అజెండాగా ఉంది అన్నది మరోమారు రుజువు అవుతోంది. 2024 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలన్న బీజేపీ ఆలోచనల కు జమిలి ఎన్నికలు ఒక ప్రధాన అస్త్రంగా ఉంటాయని అంటున్నారు. మరి దేశం లో జమిలి ఎన్నికలకు విపక్షాలు ఎంతవరకూ ఓకే చెబుతాయో చూడాల్సి ఉంది.