జమిలి ముచ్చట తీరిపోయిందా ?
కొంతకాలంగా నరేంద్రమోడీ జమిలి ఎన్నికల నిర్వహణపై పదేపదే మాట్లాడుతున్నారు
By: Tupaki Desk | 28 July 2023 7:12 AM GMTకొంతకాలంగా నరేంద్రమోడీ జమిలి ఎన్నికల నిర్వహణపై పదేపదే మాట్లాడుతున్నారు. జమిలి ఎన్నికల వల్ల చాలా ఉపయోగాలున్నాయని చెప్పారు. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తే నిర్వహణ ఖర్చులు, సెక్యూరిటి, మానవశ్రమ లాంటి అనేక అంశాలు కలిసొస్తాయని మోడీ అభిప్రాయం. అలాగే కొన్ని రాష్ట్రాల్లో తరచూ ఎన్నికలు నిర్వహించాల్సి రావటం కూడా కష్టంగా ఉందని అని మోడీ చాలాసార్లు చెప్పారు. ఇదే సమయంలో జమిలి ఎన్నికల నిర్వహణ కష్టమని నిపుణులు చెప్పారు. మాట్లాడుకునేందుకు బాగానే ఉన్నా ఆచరణలో సాధ్యంకాదని చాలాసార్లు చెప్పారు.
ఎవరెంత చెప్పినా మోడీ మాత్రం జమిలి ఎన్నికలపై పట్టువిడవలేదు. జమిలి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు చాలా కమిటీలను వేశారు. కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా అన్నీ పార్టీలతో రెండుసార్లు సమావేశం నిర్వహించింది. కొన్ని నెలలపాటు జరిగిన కసరత్తు తర్వాత జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదని తేలిపోయింది. ఇదే విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్ వాల్ ప్రకటించారు. జమిలి నిర్వహణలో చాలా కష్టాలున్నట్లు కేంద్రప్రభుత్వం గుర్తించిందన్నారు.
నిజానికి జమిలి ఎన్నికలు సాధ్యంకాదనేందుకు చాలా చిన్న లాజిక్ సరిపోతుంది. మోడీ లెక్కప్రకారం పార్లమెంటుతో పాటు అన్నీ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే చాలా సమస్యలకు పరిష్కారమవుతుంది. పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు బాగానే ఉంది. కానీ ఏ కారణం వల్ల అసెంబ్లీ లేదా పార్లమెంటు రద్దయితే అప్పుడు పరిస్ధితి ఏమిటి ? పార్లమెంటును రద్దుచేసి ఎన్నికలు నిర్వహించాల్సొస్తే అప్పుడు అన్నీ రాష్ట్రాల అసెంబ్లీలను కూడా రద్దుచేస్తారా ?
ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో అసెంబ్లీ రద్దయి మధ్యంతర ఎన్నికల్లో లేకపోతే ముందస్తు ఎన్నికలో నిర్వహించాల్సొస్తే అప్పుడు పార్లమెంటుతో పాటు మిగిలిన రాష్ట్రాల అసెంబ్లీలను కూడా రద్దుచేస్తారా ? అన్నది కీలకమైన ప్రశ్న. 1962 వరకు మనకు జమిలి ఎన్నికలే జరిగాయి. అయితే తర్వాత మొదలైన రాజకీయ పరిణామాల కారణంగా జమిలి ఎన్నికల స్ధానంలో ఇపుడు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఇంతచిన్న లాజిక్కును మోడీ పట్టించుకోకుండా జమిలి ఎన్నికల జపంచేయటమే ఆశ్చర్యంగా ఉంది.