Begin typing your search above and press return to search.

జమిలి ఎన్నికలు నిర్వహిస్తే అన్ని లక్షల కోట్లు కావాల్సిందే: సీఎంఎస్‌ సంచలన నివేదిక!

అయితే దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల ప్రక్రియను కేవలం వారం రోజుల్లో పూర్తి చేయగలిగితే ఈ వ్యయాన్ని తగ్గించవచ్చని తెలిపింది

By:  Tupaki Desk   |   13 Sep 2023 8:07 AM GMT
జమిలి ఎన్నికలు నిర్వహిస్తే అన్ని లక్షల కోట్లు కావాల్సిందే: సీఎంఎస్‌ సంచలన నివేదిక!
X

దేశంలో జమిలి ఎన్నికలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంటర్‌ ఫర్‌ మీడియా సర్వీసెస్‌ (సీఎంఎస్‌) ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. దేశంలో పార్లమెంట్‌ నుంచి గ్రామ పంచాయతీ స్థాయి వరకు ఏకకాలంలో (జమిలి) ఎన్నికలు నిర్వహిస్తే ఏకంగా 10 లక్షల కోట్ల రూపాయలు అవసరమని బాంబుపేల్చింది.

అయితే దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల ప్రక్రియను కేవలం వారం రోజుల్లో పూర్తి చేయగలిగితే ఈ వ్యయాన్ని తగ్గించవచ్చని తెలిపింది. అలాగే రాజకీయ పార్టీలు కూడా ఇందుకు ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సి ఉంటుందని వివరించింది. ఇలా చేస్తే రూ.10 లక్షల కోట్లు అయ్యే ఈ వ్యయాన్ని రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లకు తగ్గించవచ్చని సెంటర్‌ ఫర్‌ మీడియా సర్వీసెస్‌ తెలిపింది.

ఈ మేరకు దేశంలో జమిలి ఎన్నికలపై సీఎంఎస్‌ తాజాగా అధ్యయనం చేసింది. దీని ప్రకారం వచ్చే ఏడాది వేసవిలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు 1.20 లక్షల కోట్లు ఖర్చు కావచ్చని పేర్కొంది. కొత్తగా కొనుగోలు చేసిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్ల ధర కూడా ఇందులో భాగం కాదని వివరించింది. ఈ రూ. 1.20 లక్షల కోట్లలో ఎన్నికల సంఘం 20 శాతం మాత్రమే ఖర్చు చేస్తుందని తెలిపింది. మిగతా అంతా పార్టీల ఖర్చే ఉండనుందని వివరించింది.

ఈ మేరకు సీఎంఎస్‌ విశ్లేషకులు.. ఎన్‌. భాస్కర్‌ రావు మీడియాకు అధ్యయన వివరాలను వెల్లడించారు. దేశంలో లోక్‌ సభతో పాటు అన్ని రాష్ట్ర అసెంబ్లీలు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఎన్నికలు ఏకకాలంలో నిర్వహిస్తే దాదాపు రూ. 10 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇది కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేసే ఖర్చు మాత్రమేనని ఆయన తెలిపారు. పార్టీలు తమ అభ్యర్థుల ప్రచారానికి చేసిన ఖర్చులను కూడా ఇందులో చేర్చారు.

లోక్‌సభ ఎన్నికలకు రూ.1.20 లక్షల కోట్లు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (4,500 సీట్లు) రూ.3 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని సీఎంఎస్‌ అంచనా వేసింది. దేశంలోని అన్ని మున్సిపాలిటీలకు (సుమారు 500) ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే రూ. లక్షల కోట్లు ఖర్చు అవుతాయని వెల్లడించింది.

అలాగే జిల్లా పరిషత్‌ లు (650), మండలాలు (7000), గ్రామ పంచాయతీలకు (2.50 లక్షలు) ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే రూ. 4.30 లక్షల కోట్లు ఖర్చు కావచ్చని తెలిపింది. గత లోక్‌సభ ఎన్నికల (2019) సమయంలో ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు రూ.6,400 కోట్లు విరాళాలు సేకరించగా, కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే ఖర్చు చేశాయని సీఎంఎస్‌ తెలిపింది.