ఒకే దేశం ఒకే ఎన్నిక... సభ్యులు వీరే !
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ ముందుకు సాగుతోంది.
By: Tupaki Desk | 3 Sep 2023 12:30 AM GMTకేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ ముందుకు సాగుతోంది. నిజానికి అది బీజేపీ కలల నినాదం. అది సాకారం చేయడం కోసం బీజేపీ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఇపుడు ఆ దిశగా ఒక అడుగు వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ సారధ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని శుక్రవారం ఏర్పాటు చేసిన కేంద్రం ఇపుడు ఆ కమిటీ సభ్యులను ప్రకటించింది.
ఈ కమిటీలో సభ్యులలో అమిత్ షా, అధిర్ రంజన్, గులాంనబీ ఆజాద్, ఎన్ కే సింగ్, హరీశ్ సాల్వే, సుభాష్, సంజయ్ కొఠారీ ఉన్నారు. వీరంతా కలసి ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నది ఎలా సాధ్యం అన్న దాని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు మేధవులు న్యాయ నిపుణులు రాజ్యాంగ నిపుణులతో ఈ కమిటీ చర్చిస్తుందని చెబుతున్నారు.
భారత్ లో 28 రాష్ట్రాలు ఉన్నాయి. దేశంలో ప్రతీ ఏటా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటున్నాయి. దాని వల్ల ఎంతో ధనం వృధా అవుతోంది. అదే టైంలో కాలం కూడా ఖర్చు అవుతోంది. అలాగే వ్యయ ప్రయాసలు అటు అధికారులకు ఇటు ప్రజలకు తప్పడం లేదు. మొత్తం పాలనలో ఎక్కువ కాలం రాజకీయాలు ఎన్నికలు ప్రచారాలకే పోతోంది.
దాంతో అయిదేళ్లకు ఒక మారు ఎన్నికలు దేశంలోని అన్ని రాష్ట్రాలు లోక్ సభకు నిర్వహించాలని ప్రతిపాదనలు అయితే చాలా కాలంగా ఉన్నాయి. అయితే మధ్యలో ప్రభుత్వాలు కూలిపోతే ఆల్టర్నేషన్ ఎలా చూపిస్తారు అన్నది అసలైన చిక్కుముడి. అలాగే ఏ పార్టీకి మెజారిటీ రాని పరిస్థితులు ఇటీవల కాలంలో ఉత్పన్నం అవుతున్నాయి. అలాగే తరచూ ఉప ఎన్నికలు వస్తున్నాయి. ఇలా చాలా సమస్యలు ఇందులో ఇమిడి ఉన్నాయి.
వీటిని ఈ కమిటీ ఏ విధంగా చూస్తుంది. వాటికి రాజ్యాంగం ప్రకారం ఏ రకమైన పరిష్కారం సూచిస్తుంది అన్నది ఇక్కడ చూడాలి. మరో వైపు చూస్తే లోక్ సభ ఎన్నికలు అంటే జాతీయ అంశాలు ప్రధానంగా సాగుతాయి. రాష్ట్రాల ఎన్నికలు అంటే ప్రాంతీయ విషయాలు హైలెట్ అవుతాయి. ఈ రెండింటినీ ముడి పెట్టి ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాభిప్రాయం ఒకే వైపుగా ఉంటుందా లేక ఏ ఎన్నికకు ఆ ఎన్నిక అన్నది విడదీసి చూసి జనాలు ఓటు వేస్తారా అన్నది ఒక ఆసక్తికరమైన అంశం.
అయితే ఈ దేశంలో ఆది నుంచి ఓటర్లు ఎపుడూ విలక్షణమైన తీర్పునే ఇస్తూ ఉంటారు. ఇతర దేశాలు సైతం ఆశ్చర్యపోయేలా మంచి తీర్పు ప్రతీ ఎన్నికలో వస్తూ ఉంటోంది. అందువల్ల లోక్ సభకు రాష్ట్రాలకు మధ్య ఎన్నికల తీర్పులో తేడాలను ప్రజలు చాలా చక్కగా అర్ధం చేసుకుని తగిన విధంగానే ఓటు చేస్తారు అని అంటున్నారు.
మరో విషయం ఏంటి అంటే జాతీయ రాజకీయాలు ప్రాంతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని అందుకే జమిలి ఎన్నికలు వద్దు అని పలు ప్రాంతీయ పార్టీలు ఈ జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్న నేపధ్యం ఉంది. ఇవన్నీ కూడా ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది అంటున్నారు. మొత్తానికి కమిటీ ఇచ్చే నివేదిక మీదనే అందరి చూపూ ఉంది. ఇక ఈ కమిటీకి చైర్మన్ గా ఉన్న మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింది న్యాయ నిపుణులు అన్న సంగతి తెలిసిందే. దాంతో చక్కని సిఫార్సులతో మంచి నివేదిక సాధ్యమైనంత తొందరలోనే వస్తుంది అని అంతా ఆశిస్తున్నారు.